
సాక్షి, తిరుమల : విజయదశమి సందర్భంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సోమవారం ఉదయం ఆయుధపూజ నిర్వహించినట్లు తిరుమతి తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహార్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని, శ్రీ దుర్గామాతను ప్రార్థిస్తూ ఈ ఆయుధపూజ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. విజయదశమి రోజున పనిముట్లను, ఆయుధాలను పూజించుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
దుర్గామాత మహిషాసురమర్ధనం చేసి విజయం సాధించినట్టు ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయుధ పూజ నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసినట్లు వివరించారు. అంతకుముందు అన్నప్రసాద భవనంలో శ్రీవారి చిత్రపటానికి, వంట పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాద కేంద్రంలో జరిగిన ఆయుధపూజలో ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.