Tarigonda vengamamba
-
'అన్నపూర్ణ'.. టీటీడీ
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ఆకలి బాధలు తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అల్పాహారాలు, అన్నప్రసాద వితరణ చేస్తూ అన్నపూర్ణగా ఖ్యాతిగడించింది. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బంది పడకుండా టీటీడీ అన్నప్రసాద వితరణ యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. తిరుమలలో 17వ శతాబ్దంలోనే భక్తుల కోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ఆమె పేరుతోనే టీటీడీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను నిర్మించింది. ఒకేసారి నాలుగు వేల మంది భోజనం చేసేలా ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవనాన్ని 2011 జూలై 11న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రారంభించారు. రూ.10 లక్షలతో అన్నప్రసాద వితరణ ప్రారంభం ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడిన మూడు దశాబ్దాల తర్వాత అతి తక్కువ ధరలకు భక్తులకు అల్పాహారం, భోజనం అందించేందుకు పలు ప్రాంతాల్లో టీటీడీ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్ 5వ తేదీన ప్రారంభించింది. ఇక్కడ కూడా ప్లేట్ మీల్స్ రూ.1.75, ఫుల్ మీల్స్ రూ.3, స్పెషల్ మీల్స్ రూ.4.50 విక్రయించేవారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ 1985లో ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన రూ.పది లక్షల భూరివిరాళంతో టీటీడీ ఉచిత అన్నప్రసాద వితరణను ప్రారంభించింది. అప్పట్లో శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచిత భోజనం టోకెన్లు అందించేవారు. తొలుత రెండు వేల మందికి భోజనం అందించగా, క్రమంగా ఈ సంఖ్య 20 వేలకు పెరిగింది. భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో టీటీడీ 2008లో సర్వ¿ోజన పథకానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి తిరుమలలో భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ భక్తుల సేవలో తరిస్తోంది. పలు ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ ► తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌తోపాటు నాలుగు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు తయారు చేస్తారు. ► వెంగమాంబ కాంప్లెక్స్‌లో అన్నం, కూర, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగ, చక్కెర పొంగలి అందిస్తారు. ► వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1, 2, వెలుపలి క్యూలైన్లు, పీఏసీ–2, ఫుడ్ కౌంటర్లలో సాంబార్ బాత్, ఉప్మా, పొంగలి, పులిహోర అందిస్తారు. ► సాధారణ రోజుల్లో రోజుకు 55వేల నుంచి 60వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. పర్వదినాలు, రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుతుంది. ► సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు, గరుడసేవ రోజు రాత్రి ఒంటి గంట వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ► అన్నప్రసాదాల తయారీకి రోజూ దాదాపు 10 నుంచి 12 టన్నుల బియ్యం, 7 నుంచి 8 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. ► సరుకుల నాణ్యత విషయంలో టీటీడీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ నుంచి తెచ్చిన సరుకులను ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత అన్నప్రసాద విభాగానికి చేరవేస్తారు. అన్నదాన ట్రస్టులో రూ.1,502 కోట్ల నిధులు దాతల సహకారంతో టీటీడీ అన్నదాన ట్రస్టులో రూ.1,502 కోట్ల నిధులు సమకూరాయి. ఈ ట్రస్టు 2018వ సంవత్సరంలో స్వయంసమృద్ధి సాధించడంతో టీటీడీ గ్రాంటు నిలిపివేసింది. భక్తులకు మరింత పోషకాలతో కూడిన అన్నప్రసాదాలు అందించేందుకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు అందించాలని దాతలను టీటీడీ కోరుతోంది. -
తిరుమల అన్న ప్రసాద కేంద్రంలో ఆయుధ పూజ
సాక్షి, తిరుమల : విజయదశమి సందర్భంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సోమవారం ఉదయం ఆయుధపూజ నిర్వహించినట్లు తిరుమతి తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహార్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని, శ్రీ దుర్గామాతను ప్రార్థిస్తూ ఈ ఆయుధపూజ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. విజయదశమి రోజున పనిముట్లను, ఆయుధాలను పూజించుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దుర్గామాత మహిషాసురమర్ధనం చేసి విజయం సాధించినట్టు ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయుధ పూజ నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసినట్లు వివరించారు. అంతకుముందు అన్నప్రసాద భవనంలో శ్రీవారి చిత్రపటానికి, వంట పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాద కేంద్రంలో జరిగిన ఆయుధపూజలో ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీవారి దేవేరిగా తరిగొండ వెంగమాంబ!
తరిగొండ వెంగమాంబ కవయిత్రి, సాంఘిక దురాచారాలను ఎదిరించిన ధీరవనిత. చిన్నతనం నుంచే శ్రీ వేంకటేశ్వర స్వామిని తన సర్వస్వంగా భావించిన మహాభక్తురాలు. తిరుమలలో స్వామివారి సన్నిధికి విచ్చేసే భక్తులకు తొలిసారిగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వితరణ శీలి. స్వామి నామమే సర్వస్వం క్రీ.శ 17వ శతాబ్దంలో చిత్తూరుజిల్లా తరిగొండలో నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కానాడ కృష్ణమూర్తి, అచ్చమాంబ దంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని తన భర్తగా భావించి నిరంతరం ధ్యానముద్రలో గడిపేది. ఈమె ప్రవర్తనతో తల్లడిల్లిన తల్లిదండ్రులు మదనపల్లె పట్టణం శ్రీయోగభోగేశ్వరస్వామి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యదీక్షితులు వద్దకు తీసుకెళ్లారు. ఆమెలోని దైవచింతనను గమనించిన స్వామీజీ ఆమెకు తారకనామం ఉపదేశించారు. ఎన్నో రచనలకు శ్రీకారం శ్రీ వేంకటేశ్వరస్వామిపై అనురక్తితో వెంగమాంబ అనేక రచనలకు శ్రీకారం చుట్టారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్మరిస్తూ శ్రీనరసింహ శతకాన్ని రచించింది. ఇంకా శ్రీకృష్ణపారిజాతం, ముక్తకాంతా విలాసం వంటి కావ్యాలను రచించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మీద సుమారు రెండువేల కీర్తనలను తాళపత్రాలపై రచించింది. దురాచారాలను ధిక్కరించిన ధీరవనిత వెంగమాంబను ఆధ్యాత్మిక చింతన, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన నుంచి తప్పించడానికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే తిరుపతికి సమీపంలోని బాకరాపేటకు చెందిన ఇంజేటి వెంకటాచలపతితో వెంగమాంబ వివాహం జరిపించారు. అయితే దురదృష్టవశాత్తు భర్త ఆమె చిన్నతనంలోనే గతించాడు. అప్పటి సమాజంలో ముఖ్యంగా శ్రోత్రియ కుటుంబాలలో సనాతన సంప్రదాయాలు ఎక్కువగా పాటించేవారు. బ్రాహ్మణ æస్త్రీకి భర్త మరణిస్తే శిరో ముండనం చేయించి బొట్టు, గాజు, మెట్టెలు తొలగించి ఇళ్లలోనే ఉంచేవారు. అయితే శ్రీనివాసుణ్ణే తన భర్తగా భావించిన వెంగమాంబ ఈ సాంప్రదాయాలను తిరస్కరించిందన్న భక్తుల ఫిర్యాదు మేరకు పుష్పగిరి పీఠాధిపతి తరిగొండకు చేరుకొని వెంగమాంబకు హితబోధ చేశారు. ఆమె తిరస్కరించడంతో అపరాధంగా భావించిన పెద్దలు పీఠాధిపతికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు సరిదిద్దుకోవాలని ఆదేశించారు. అయితే వెంగమాంబ పీఠాధిపతికి బదులుగా గురుపీఠానికి నమస్కారం చేయడంతో గురుపీఠం దగ్ధమైంది. ఆగ్రహించిన పెద్దలు ఆమెకు బలవంతంగా శిరోముండనం చేయించి తరిగొండ నరసింహస్వామి కొలనులో స్నానం చేయించారు. స్నానం చేసిన తరువాత వెంగమాంబ తలపై శిరోజాలు మునుపటిలాగే దర్శనమిచ్చాయి. దీంతో వెంగమాంబకు గ్రామబహిష్కారం విధించారు. సూఫీ గురువు సహకారం గ్రామ బహిష్కారానికి గురైన శ్రీ వెంగమాంబకు తరిగొండలో అప్పటి సూఫీమత బోధకుడు హజరత్ సయ్యద్ మురాద్‌షావలీ ఆశ్రయం కల్పించాడు. అనంతరం వెంగమాంబ తరిగొండకు సమీపంలోని మారెళ్ల గెవి(గుహ)కి చేరుకొంది, ప్రతిరోజు ఆమె సాధనకు అవసరమైన సామగ్రిని, కందమూలాలను మురాద్‌షావలీ స్వయంగా సమకూర్చేవాడు. కుపితులైన కొందరు అక్కడా ఆమె సాధనను సాగనివ్వలేదు. స్వామి చూపిన మార్గం వెంగమాంబకు శ్రీనివాసుడు తన వద్దకు చేరుకోవాలని సూచించి తిరుమలకు మార్గం కూడా చూపించాడు. ప్రస్తుతం తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని శ్రీఆంజనేయస్వామి విగ్రహం వెనకవైపు ఉన్న సొరంగ మార్గం గుండా ఆమె తిరుమలకు చేరుకొంది. అక్కడ తుంబుర తీర్థంలోని శ్రీవెంగమాంబ గుహగా పిలువబడే పర్వతశ్రేణిలో తన సాధనను కొనసాగించింది. అక్కడే కొన్ని గ్రంథాలు, కీర్తనలు రచించింది. ముత్యాలహారతి– వేంకటేశ్వరుడికి జోలపాట తిరుమలలోనూ ఛాందసుల నుంచి ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. ఒకరోజు వెంగమాంబ గుహలో శ్రీ శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఉండటం కొందరు గమనించి వెంగమాంబ మహత్యాన్ని తెలుసుకొని తమ తప్పులు క్షమించమని వేడుకొన్నారు. అప్పటినుంచి కొండపైన అన్నమయ్య వారసులకు కల్పించిన సౌకర్యాలను ఈమెకూ కల్పించారు. ఉండటానికి నివాసం, ఇతర సౌకర్యాలతోపాటు ఆలయంలో ఉదయం అన్నమయ్య మేలుకొలుపు తరువాత రాత్రి స్వామివారి జోలపాట ముత్యాలహారతి ఇచ్చే భాగ్యాన్ని వెంగమాంబకు కల్పించారు. నిత్యాన్నదానానికి వెంగమాంబ శ్రీకారం తిరుమలలో నేటికీ కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబే. క్రీ.శ 1812–15 మధ్య కాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ తన నివాసంలోనే భోజనాలు తయారు చేసి వడ్డించడం ప్రారంభించింది. నిత్యం వందలాది మంది భక్తుల ఆకలిని తీర్చేది. టీటీడీ వారు నేటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొండపై వేలాది మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న నిత్యాన్నదాన సత్రానికి శ్రీ వెంగమాంబ పేరు పెట్టడం గమనార్హం. వెంగమాంబకు బహుళ ప్రచారం తరిగొండ ప్రాంతంలో శ్రీ వెంగమాంబకు బహుళ ప్రచారం కల్పించారు. తరిగొండ గ్రామ బస్టాండులో పెద్ద మండపం నిర్మించి అందులో శ్రీ వెంగమాంబ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. – కె. మురళీకృష్ణ గుర్రంకొండ -
శ్రీవారి ప్రియభక్తులు
వేంకటేశ్వరస్వామికి 32,000 కీర్తనల మణిహారాన్ని వేసిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. శ్రీవారినే తన ‘వారు’ గా భావించుకున్న 18 కావ్యాల భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ. వీరి ప్రస్తావన లేకుండా స్వామి సేవ సంపూర్ణం కాదు. తిరుమలకు పశ్చిమ దిశలోని తరిగొండ గ్రామంలో కృష్ణయ్య, మంగమ్మ దంపతులుండేవారు. వారికి ఐదుగురు మగ సంతానం. కన్యాదానం చేయడానికి పుత్రికను ప్రసాదించమని వేంకటేశ్వరస్వామికి మొక్కుకుంటే, పుట్టింది కనుక, ఆమెను స్వామి పేరుతో వెంగమ్మ అన్నారు. అది క్రీ.శ.1730. శ్రీవారే నా వారు ‘‘శ్రీవేంకటేశ్వరుడే నా భర్త. నాకు పెళ్లేమిటి?’’ అనేది వెంగమ్మ. అయినా, చిత్తూరుకు సమీపంలోని నారగుంటపాళెం గ్రామానికి చెందిన ఇంజేటి వెంకటాచలపతితో ఆమెకు బలవంతంగా పెళ్లి జరిపించారు. ఇంతాచేస్తే ఆప్పుడామె వయసు పదేళ్లే. అయితే, కలసి కాపురం చేయకముందే వెంకటాచలపతి తనువు చాలించాడు. అయినా శ్రీనివాసుడినే భర్తగా భావించి పూలు, గాజులు, చెవికమ్మలతో నిత్యసుమంగళిగా ఉండేది. చివరకు తండ్రి కృష్ణయ్య మదనపల్లెకు చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద వెంగమ్మకు ఉపదేశం చేయించారు. దాంతో భక్తిమార్గంలో ఆమె మరింత పరిపూర్ణత చెందారు. తపస్వినిగా మారారు. ఆమె కలాన భక్తి శతకాలు... నోట కీర్తనలు అలవోకగా జాలువారేవి. ఆమె రచనలు చదివినవారు, భక్తిమార్గాన్ని కళ్లారా వీక్షించినవారు వెంగమ్మను ‘మహాయోగిని’గా భావించి, ‘వెంగమాంబ’ అని గౌరవంగా సంబోధించారు. అలా వెంగమ్మ వెంగమాంబ అయ్యారు. పుట్టినూరుతో కలిసి తరిగొండ వెంగమాంబగా ప్రసిద్ధి చెందారు. ఇరవై ఏళ్ల వయసులో వెంగమాంబ తిరుమలను తన ఆవాసంగా చేసుకున్నారు. స్వామికి ప్రతిరోజూ పుష్పాలు సమర్పించాలని, ప్రతి సాయంత్రం చివర్లో కర్పూర నీరాజనం ఇవ్వాలని కొండ వద్ద తులసివనం పెంచారు వెంగమాంబ. పూలమొక్కలు నాటారు. ఇందుకోసం దిగుడుబావిని తవ్వించారు. పగలు తుంబురుకోనలో తపస్సు... రాత్రి స్వామి ఆలయంలో పూజలు తిరుమలకు వచ్చే భక్తుల సందడి వల్ల తన ధ్యానానికి ఆటంకం కలుగుతోందని వెంగమాంబ ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోని తుంబురుకోనకు చేరుకున్నారు. అక్కడ ఆమె నిశ్చింతగా తపస్సు చేసుకునేవారు. రాత్రి వేళలో బంగారు వాకిళ్లు మూసినా బిలమార్గం ద్వారా ఆమె ఆలయానికి వచ్చేవారు. రాత్రి అర్చనలో ఉపయోగించిన పూలు మారివుండటం, కొత్త పూలు కనిపిస్తూ ఉండటంతో ఆచారులు ఇది వెంగమాంబ మహిమగా రూఢిచేసుకున్నారు. దీంతో యాత్రికులకు భక్తి ప్రపత్తులు కలిగాయి. ఎందరెందరో జమీందారులు, భూస్వాములు, పాలెగాళ్లు, సంస్థానాధీశులు ఆమెకు భక్తితో విరాళాలు సమర్పించారు. సమస్తాన్నీ తిరుమలకు వచ్చే భక్తులకే వినియోగించారు. అన్న సత్రాలు నిర్వహించారు. వేసవిలో చలివేంద్రాలు, బ్రహ్మోత్సవాల్లో అన్నప్రసాదాలు కల్పించారు. క్రీ.శ.1817లో ఈశ్వర శ్రావణ శుద్ధ నవమినాడు వెంగమాంబ సమాధిలోకి ప్రవేశించారు. నేడు ఆ పుణ్యప్రదేశం వెంగమాంబ బృందావనంగా పేరొందింది. భవరోగ వైద్యుడు అన్నమయ్య అన్నమయ్య తాళ్లపాకలో (క్రీ.శ.1408-1503)జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. తన పదహారవ యేటనే తిరుమలకు చేరుకుని స్వామి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని తన స్వరార్చనతో కీర్తించి తరించాడు అన్నమయ్య. శ్రీనివాస స్మరణే బతుకుగా, తిరువారాధనే తెరువుగా జీవించి సంకీర్తనా భవసాగరంలో మునిగితేలాడు. ‘మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా’ అంటూ మేలుకొలుపు పాటతో స్వామిని నిద్రలేపాడు. ‘జోవచ్యుతానంద’ అంటూ నిద్రపుచ్చాడు. నేటికీ అన్నమయ్య వంశీయులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆలయంలో అన్నమయ్య సంకీర్తనా భండారం వేంకటేశ్వరుడిని వే విధాలుగా స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు రచించారు అన్నమయ్య. వీటిలో దాదాపుగా 12వేల సంకీర్తనలు మాత్రమే రాగి రేకుల రూపంలో నిక్షిప్తమై లభిస్తున్నాయి. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుడు, ఈతని కుమారుడు చినతిరుమలాచార్యుల సత్సంకల్పబలం వల్లే అవైనా మనకు దక్కాయి. తిరుమల ఆలయంలో నెలకొల్పిన అన్నమయ్య ‘సంకీర్తనా భాండారం (తాళ్లపాక అర)’ తరతరాల్ని ఉత్తేజితుల్ని చేస్తూ స్వామి సన్నిధానానికి నడిపించే ఆధ్యాత్మిక కోశాగారం. స్వామి ఆలయంలో ప్రతి రోజూ అర్ధరాత్రి సమయంలో ఏడుకొండలవాడికి ఏకాంత సేవ (పవళింపుసేవ) జరుగుతుంది. ఇందులో గర్భాలయానికి ముందున్న శయన మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన పట్టెమంచంపై ‘మణవాళ పెరుమాళ్’(నిత్యనూతన వరుడు) అనే భోగశ్రీనివాసమూర్తి వేంచేపు చేస్తారు. అదే సమయంలో ఆనంద నిలయ గర్భాలయ మూలమూర్తికి చిట్టచివరగా ‘ముత్యాల హారతి’ అనే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి మంగళ కర్పూర నీరాజనం ఇస్తారు. తర్వాత అదే హారతి భోగ శ్రీనివాసుడికి ఇస్తారు. తాళ్లపాకవారి జోలపాట అందజేసి ఏకాంత సేవ ముగిస్తారు. తాళ్లపాక వారి లాలిపాట, తరిగొండ వారి ముత్యాల హారతి స్వామికి సమర్పించటం ఆనవాయితీగా మారింది. అలా ఆ ఇద్దరు మహాభక్తులు స్వామివారిని శాశ్వతంగా కొలుస్తూనే ఉన్నారు. అన్నంపెట్టే తండ్రి- ఆత్మనింపే తల్లి ‘‘మానవునికి అసంకల్పితంగా దైవం అనుభవంలోకి రావటానికి అందివచ్చినవి లలితకళలు. ‘పాట’ మధ్యమంగా శ్రీవేంకటేశ్వరుని తత్త్వాది విశేషాలను జనసామాన్యానికి అందించినవాడు అన్నమయ్య. మాండలికాలు, జాతీయాలు, సామెతలు వయ్యారాలు పోతూ ఈ సంకీర్తనలకు అపూర్వ రామణీయతను సంతరించి పెట్టాయి.’’ ‘‘తరిగొండ వెంగమాంబ చాలాకాలం తిరుమలకొండపైన, తుంబురకోన తీర్థం వద్ద తపస్సు చేస్తూ- తరిగొండ నృశింహస్వామికి, తిరుపతి వేంకటేశ్వరస్వామికి అభేదంగా కావ్యాలు, యక్షగానాలు, దండకాలు రచించింది. ఎన్నో సంప్రదాయాలకు ఎదురీది, అచంచలమైన భక్తితో స్వామిని సేవించి, ఎన్నెన్నో మహిమలు చూపి నారీలోకానికి ఆదర్శంగా నిలిచిన మాతృశ్రీ వెంగమాంబ గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఆ తల్లి రచించిన సంకీర్తనలు సుమారు వంద వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆడియో రికార్డింగ్ చేయగా అందులో కొన్ని నేను స్వరపరిచి గానం చేసినవి కూడా ఉండటం నా పూర్వజన్మ సుకృతం.’’ - గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ అన్నమయ్య జోలపాట - వెంగమాంబ హారతి ‘‘దేవుడంటే ఓ పరిమితమైన ఆకారమేనన్న మౌఢ్యం, అర్థరహితమైన కుల విభేదత్వంతో సమాజం అనారోగ్యం పాలవుతుందని గ్రహించిన సర్వాంతర్యామి అన్నమయ్యగా అవతరించి సంకీర్తనౌషధం పంచాడు. సకలోపనిషత్సారాన్ని బ్రహ్మమొక్కటే అన్న సందేశంగా అందించాడు అన్నమయ్య. ఆ నాద సందేశాన్ని గ్రహించి, మనిషి మనిషికీ మధ్య ఉన్న అర్థరహితమైన అడ్డుగోడలు తొలగించుకొని, విశ్వజీవంతో అనుసంధానం కుదుర్చుకున్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది.’’ ‘‘దైవభక్తి అను అమృతపానంలో మత్తిల్లిన భక్తులను సమాజమెప్పుడూ అర్థం చేసుకోలేదు. భర్త రోగ కారణంగా అకారణమరణమందగా సమాజం వెంగమాంబను సుమంగళీ చిహ్నాలను తీసివేయమని శాసించింది. అర్థరహితమైన ఆ ఆచారాన్ని రెండు శతాబ్దాల క్రితమే ప్రశ్నించి, ఎదురించి నిలిచిన దృఢశీల వెంగమాంబ. వేంకటేశ్వర స్వామికి అన్నమయ్య జోల ప్రీతి. అన్నమయ్య జోల విన్న తర్వాత ఇంకేదీ వినని స్వామి తరిగొండ వెంగమాంబ హారతి మటుకు స్వీకరించాడట!’’ - ‘పద్మశ్రీ’ శోభారాజు