శ్రీవారి దేవేరిగా  తరిగొండ వెంగమాంబ! | Special story to Tarigonda Vengamamba | Sakshi
Sakshi News home page

శ్రీవారి దేవేరిగా  తరిగొండ వెంగమాంబ!

Published Sun, Oct 7 2018 2:06 AM | Last Updated on Sun, Oct 7 2018 2:06 AM

Special story to Tarigonda Vengamamba - Sakshi

తరిగొండ వెంగమాంబ కవయిత్రి, సాంఘిక దురాచారాలను ఎదిరించిన ధీరవనిత. చిన్నతనం నుంచే శ్రీ వేంకటేశ్వర స్వామిని తన సర్వస్వంగా భావించిన మహాభక్తురాలు. తిరుమలలో స్వామివారి సన్నిధికి విచ్చేసే భక్తులకు తొలిసారిగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వితరణ శీలి. 

స్వామి నామమే సర్వస్వం
 క్రీ.శ 17వ శతాబ్దంలో చిత్తూరుజిల్లా తరిగొండలో నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన  కానాడ కృష్ణమూర్తి, అచ్చమాంబ దంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని తన భర్తగా భావించి నిరంతరం ధ్యానముద్రలో గడిపేది. ఈమె ప్రవర్తనతో తల్లడిల్లిన తల్లిదండ్రులు మదనపల్లె పట్టణం శ్రీయోగభోగేశ్వరస్వామి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యదీక్షితులు వద్దకు తీసుకెళ్లారు. ఆమెలోని దైవచింతనను గమనించిన స్వామీజీ ఆమెకు తారకనామం ఉపదేశించారు. 

ఎన్నో రచనలకు శ్రీకారం
శ్రీ వేంకటేశ్వరస్వామిపై అనురక్తితో వెంగమాంబ అనేక రచనలకు శ్రీకారం చుట్టారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్మరిస్తూ శ్రీనరసింహ శతకాన్ని రచించింది. ఇంకా శ్రీకృష్ణపారిజాతం, ముక్తకాంతా విలాసం వంటి కావ్యాలను రచించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మీద సుమారు రెండువేల కీర్తనలను తాళపత్రాలపై రచించింది.

దురాచారాలను ధిక్కరించిన ధీరవనిత
వెంగమాంబను ఆధ్యాత్మిక చింతన, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన నుంచి తప్పించడానికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే తిరుపతికి సమీపంలోని బాకరాపేటకు చెందిన ఇంజేటి వెంకటాచలపతితో వెంగమాంబ వివాహం జరిపించారు. అయితే దురదృష్టవశాత్తు భర్త ఆమె చిన్నతనంలోనే గతించాడు. అప్పటి సమాజంలో ముఖ్యంగా శ్రోత్రియ కుటుంబాలలో సనాతన సంప్రదాయాలు ఎక్కువగా పాటించేవారు. బ్రాహ్మణ æస్త్రీకి భర్త మరణిస్తే శిరో ముండనం చేయించి బొట్టు, గాజు, మెట్టెలు తొలగించి ఇళ్లలోనే ఉంచేవారు. అయితే శ్రీనివాసుణ్ణే తన భర్తగా భావించిన వెంగమాంబ ఈ సాంప్రదాయాలను తిరస్కరించిందన్న భక్తుల ఫిర్యాదు మేరకు పుష్పగిరి పీఠాధిపతి తరిగొండకు చేరుకొని వెంగమాంబకు హితబోధ చేశారు. ఆమె తిరస్కరించడంతో అపరాధంగా భావించిన పెద్దలు పీఠాధిపతికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు సరిదిద్దుకోవాలని ఆదేశించారు. అయితే వెంగమాంబ పీఠాధిపతికి బదులుగా గురుపీఠానికి నమస్కారం చేయడంతో గురుపీఠం దగ్ధమైంది. ఆగ్రహించిన పెద్దలు ఆమెకు బలవంతంగా శిరోముండనం చేయించి తరిగొండ నరసింహస్వామి కొలనులో స్నానం చేయించారు. స్నానం చేసిన తరువాత వెంగమాంబ తలపై శిరోజాలు మునుపటిలాగే దర్శనమిచ్చాయి. దీంతో వెంగమాంబకు గ్రామబహిష్కారం విధించారు. 

సూఫీ గురువు సహకారం
గ్రామ బహిష్కారానికి గురైన శ్రీ వెంగమాంబకు తరిగొండలో అప్పటి సూఫీమత బోధకుడు హజరత్‌ సయ్యద్‌ మురాద్‌షావలీ ఆశ్రయం కల్పించాడు. అనంతరం వెంగమాంబ తరిగొండకు సమీపంలోని మారెళ్ల గెవి(గుహ)కి చేరుకొంది, ప్రతిరోజు ఆమె సాధనకు అవసరమైన సామగ్రిని, కందమూలాలను మురాద్‌షావలీ స్వయంగా సమకూర్చేవాడు. కుపితులైన కొందరు అక్కడా ఆమె సాధనను సాగనివ్వలేదు. 

స్వామి చూపిన మార్గం
వెంగమాంబకు శ్రీనివాసుడు తన వద్దకు చేరుకోవాలని సూచించి తిరుమలకు మార్గం కూడా చూపించాడు. ప్రస్తుతం తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని శ్రీఆంజనేయస్వామి విగ్రహం వెనకవైపు ఉన్న సొరంగ మార్గం గుండా ఆమె తిరుమలకు చేరుకొంది. అక్కడ తుంబుర తీర్థంలోని శ్రీవెంగమాంబ గుహగా పిలువబడే పర్వతశ్రేణిలో తన సాధనను కొనసాగించింది. అక్కడే కొన్ని గ్రంథాలు, కీర్తనలు రచించింది.

ముత్యాలహారతి– వేంకటేశ్వరుడికి జోలపాట
తిరుమలలోనూ ఛాందసుల నుంచి ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. ఒకరోజు వెంగమాంబ గుహలో శ్రీ శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఉండటం కొందరు గమనించి వెంగమాంబ మహత్యాన్ని తెలుసుకొని తమ తప్పులు క్షమించమని వేడుకొన్నారు. అప్పటినుంచి  కొండపైన అన్నమయ్య వారసులకు కల్పించిన సౌకర్యాలను ఈమెకూ కల్పించారు. ఉండటానికి నివాసం, ఇతర సౌకర్యాలతోపాటు ఆలయంలో ఉదయం అన్నమయ్య మేలుకొలుపు తరువాత రాత్రి స్వామివారి జోలపాట ముత్యాలహారతి ఇచ్చే భాగ్యాన్ని వెంగమాంబకు కల్పించారు. 

నిత్యాన్నదానానికి వెంగమాంబ శ్రీకారం 
తిరుమలలో నేటికీ కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబే. క్రీ.శ 1812–15 మధ్య కాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ తన నివాసంలోనే భోజనాలు తయారు చేసి వడ్డించడం ప్రారంభించింది. నిత్యం వందలాది మంది భక్తుల ఆకలిని తీర్చేది. టీటీడీ వారు నేటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొండపై వేలాది మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న నిత్యాన్నదాన సత్రానికి శ్రీ వెంగమాంబ పేరు పెట్టడం గమనార్హం.

వెంగమాంబకు బహుళ ప్రచారం
తరిగొండ ప్రాంతంలో శ్రీ వెంగమాంబకు బహుళ ప్రచారం కల్పించారు. తరిగొండ గ్రామ బస్టాండులో పెద్ద మండపం నిర్మించి అందులో శ్రీ వెంగమాంబ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. 
– కె. మురళీకృష్ణ గుర్రంకొండ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement