ఆపదమొక్కులవాడికి రాయలవారి కనకాభిషేకం | Thirumala Srirvar jewelery special | Sakshi
Sakshi News home page

ఆపదమొక్కులవాడికి రాయలవారి కనకాభిషేకం

Published Sun, Oct 7 2018 1:53 AM | Last Updated on Sun, Oct 7 2018 1:54 AM

Thirumala Srirvar  jewelery special - Sakshi

ఆతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి
కనకరత్న కవాట కాంతులిరుగడ గంటి
అనుపమ మణియమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గక్కన మేలు గంటి
అరుదైన శంఖుచక్రాదులి వరుగడ గంటి
సరిలేని అభయ హస్తమును గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి

అంటూ ఐదు వందల ఏళ్ల క్రితం శ్రీవేంకటేశ్వర సాక్షాత్కారం పొందిన అన్నమయ్య తన్మయత్వంతో స్వామివారిని వర్ణించిన తీరు ఇది. నాటి నుంచి నేటి వరకు స్వామి దివ్యమంగళమూర్తి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేధ పుష్యరాగాది నానా రత్నఖచితాభరణాలతో కోటి సూర్యప్రభల వెలుగులతో అలరారుతోంది. భక్తులకు వెన్నెల వరాలను ప్రసాదిస్తూ నయనానందకరమై వర్ధిల్లుతోంది. తిరుమల శ్రీవెంకటేశ్వరునికి ఎన్ని కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయో దేవస్థానం వద్దే లెక్కలు లేవు. ఉన్న వాటికి వెలకట్టలేని పరిస్థితి. శ్రీవారికి ఉన్న ఆభరణాల విషయానికొస్తే భక్తులకు వెంటనే గుర్తు వచ్చేది వజ్రకిరీటం. అయితే గత కొన్ని వందల సంవత్సరాలుగా రాజుల నుంచి సామాన్యుల వరకు స్వామి వారిని సందర్శించి కనకాభిషేకం చేస్తున్నారు. ఆ విశేషాలు శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేకం.కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు విలువైన కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. కోరిన కోరికలు తీర్చే ఆపదమొక్కుల వాడికి భక్తులు నిలువుదోపిడీ సమర్పించుకుంటారు. మరికొందరు అపురూపమైన, విలువైన కానుకలను హుండీలో వేస్తుంటారు. వందల ఏళ్ల కిందట కొందరు రాజులు విలువైన మాన్యాలను స్వామి సేవకు కైంకర్యం చేసిన సందర్భాలు ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆరు వందల ఏళ్ళ నాడే దేశ, విదేశాల నుండి భక్తులు వందల వేల మైళ్ళు నడిచి తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకునేవారు.

విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు 1513–1524 సంవత్సరాల మధ్య కాలంలో తన దేవేరులైన చిన్నాదేవి, తిరుమలాదేవిలతో అనేకసార్లు స్వామిని  సందర్శించి అమూల్య రత్నఖచిత ఆభరణాలను స్వామికి సమర్పించారు. కృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన కానుకల వివరాలకు సంబంధించి ఆలయంలో యాభై శాసనాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాలలో మకరకంటి ప్రధానమైనది. నాటి స్వర్ణకారుల కళా కౌశలానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆభరణానికి వెలకట్టే సాహసం ఎవరూ చేయలేదు. కళింగసామ్రాజ్యాన్ని జయించిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళుతూ 1515 అక్టోబర్‌ 25న శ్రీకృష్ణదేవరాయలు అరుదైన, అపురూపమైన మకరకంటిని స్వామివారికి కానుకగా సమర్పించారు. ఈ ఆభరణం బరువు 31,124 యూనిట్లుగా శాసనాలలో ఉంది. ఈ ఆభరణంలో 10,994 కెంపులు, 754 మణులు, 530 నీలాలు, 930 వజ్రాలు, 3,933 ముత్యాలు, నాలుగు పెద్ద మణులు, వందల సంఖ్యలో పచ్చలు, వైఢూర్యాలు 45, ఎగేట్‌లు 74, టోపాజ్‌లు పొదిగించి తయారు చేయించారు.

1513 ఫిబ్రవరి 10న కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించిన సమయంలో 3308 క్యారెట్ల నవరత్న కిరీటాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చారు. ఈ కిరీటంలో 1076 యూనిట్ల బంగారం వాడారు. దీనితో పాటు 61 క్యారెట్ల పచ్చ, ముత్యాలు, మణులు, నీలాలు పొదిగిన మూడుపేటల కంఠహారాన్ని కూడా స్వామివారికి కానుకగా సమర్పించారు. రాణి చిన్నాదేవి 374 క్యారెట్లు గల రెండు బంగారు పాత్రలను స్వామివారి ఏకాంత సేవలో పాలు ఇచ్చేందుకు కానుకగా సమర్పించారు. తిరిగి 1513 మే 2న, జూన్‌ 13న కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించి ఉడుదార అనే పేరు గల విలువైన ఆభరణాన్ని స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు. ఐదు వజ్రాలతో, 17 అడ్డకేసుల ముత్యాలు, కెంపులు, నీలాలు పొదిగిన ఆభరణం అది. ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు ఇచ్చారు. కృష్ణదేవరాయలు పలు విలువైన ఆభరణాలను స్వామి వారికి సమర్పించినట్టు శాసనం వుంది.

∙వజ్రాలు, కెంపులు, నీలాలు, రత్నాలు, ముత్యాలతో పొదిగిన 326 యూనిట్ల బరువు గల బంగారు కత్తి.
∙ కెంపులలో పొదిగిన 132 యూనిట్ల బరువు కలిగిన మరో కత్తి 
∙ముత్యాలు పొదిగిన మరో చిన్న కత్తి
∙ముత్యాలు – కెంపులు, వజ్రాలు పొదిగిన పొది
∙87 క్యారెట్ల వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు ఆభరణం
∙వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలు పొదిగిన 573 యూనిట్ల భుజకీర్తులు
∙ప్రతిరోజూ విగ్రహానికి అలంకరించేందుకు మరో మూడు భుజకీర్తులు
∙వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, రత్నాలు పొదిగిన మరో రెండు బంగారు కంఠహారాలు బరువు 481 యూనిట్లు
∙ఉత్సవమూర్తులకు వజ్రాలు, ముత్యాలు, కెంపులు పొదిగిన మూడు బంగారు కిరీటాలు. 
ఈ కానుకలన్నీ కృష్ణదేవరాయలు ఒక్కరోజులోనే శ్రీవారికి బహూకరించారు. 
∙1514 జూలై 6న కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించి ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకొని తన రాజ్యానికి తిరిగి వెళుతూ తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ముప్పయివేల బంగారు వరహాలతో స్వామివారికి కనకాభిషేకం చేశారు.
∙ముత్యాలు, కెంపులు పొదిగిన 250 యూనిట్ల బంగారు హారాన్ని, ఒక జత బంగారు కడియాలను బహూకరించి, తలిలవమా అనే గ్రామాన్ని స్వామి నిత్యసేవకు కానుకగా ఇచ్చారు. 
∙రాణి చిన్నాదేవి కూడా అదే రోజు వజ్రాలు, కెంపులు, ముత్యాలు పొదిగిన ఒక బంగారుహారాన్ని, రాణీ తిరుమలదేవి వజ్రాలు, కెంపులు, ముత్యాలు పొదిగిన 225.5 యూనిట్ల బరువుగల మరో కంఠాహారాన్ని స్వామివారికి కానుకలుగా ఇచ్చారు. స్వామి నిత్యసేవకు ముదియారు అనే గ్రామాన్ని కూడా ఆమె కానుకగా ఇచ్చారు. 
∙కళింగదేశాన్ని జయించి సింహాద్రి పాట్నూరులో విజయçస్తంభం నాటించి తిరిగి వస్తూ కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించారు. ఆ సమయంలో రెండు పెద్ద బంగారుహారాలను కానుకగా ఇచ్చి, ఆలయ విమానం బంగారు పూత కోసం మరో 30 వేల బంగారు వరహాలను ఇచ్చారు. 
∙1521 ఫిబ్రవరి 17న∙రాణి తిరుమలదేవి, తిరుమలకు వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు తొమ్మిది రకాల మణులతో కూడిన పీతాంబర వస్త్రాన్ని, ముత్యాలు, కెంపులు, పచ్చలు పొదిగిన తలపాగా, నవరత్నాలు పొదిగిన మరో హారాన్ని, ఒక పెద్ద బంగారు హారాన్ని, పదివేల బంగారు వరహాలను కానుకగా సమర్పించారు. ఇవే కాకుండా కృష్ణదేవరాయలు తిరుమల వేంకటేశ్వరునికి కోట్లు విలువ చేసే ఆభరణాలెన్నో కానుకలుగా సమర్పించారు. వందల ఏళ్ళనాటి ఆభరణాలలో కొన్ని ఈనాటికీ స్వామి సన్నిధిలోనే ఉన్నాయి. 

∙1740 సంవత్సరంలో మరాఠా రాజు రాఘోజీ భోంస్లే చిత్తూరు జిల్లాలోని దామల్‌ చెరువు వద్ద నవాబ్‌ దోస్త్‌ అలీని ఓడించి చంపేశాడు. ఆ సమయంలో మరాఠా రాజు భోంస్లే తిరుమలలో ఆలయాన్ని సందర్శించి అప్పట్లోనే రూ.33వేలు విలువ చేసే కెంపులు పొదిగిన బంగారుహారాన్ని, రూ. 56వేలు విలువ చేసే రెండు ముత్యాల హారాలను, రూ.8,500 విలువ చేసే కలికి తురాయిని, రూ.45వేలు విలువ చేసే వజ్రాలతో కూడిన ఐదు వరసల ముత్యాల దండను స్వామి వారికి కానుకగా ఇచ్చారు. ఈ కానుకలు ఇప్పటికీ ఆలయంలోని ‘రాఘోజీవారి పెట్టె’లో భద్రపరచినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇప్పటి లెక్కల ప్రకారం ఈ ఆభరణాల విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. హిందూ రాజులే కాకుండా, 1820–27 సంవత్సరాల మధ్య మద్రాసు గవర్నర్‌గా ఉన్న లార్డ్‌ థామస్‌ మన్రో కూడా స్వామి వారి నిత్యాన్న సేవకు భూమిని కానుకగా ఇచ్చారు. స్వామి మన్రోకు ఒకరోజు కలలో కనిపించడంతో ఆయన కాలినడకన తిరుమలకు వెళ్ళి స్వామిని సేవించి ధన్యుడయ్యాడు. అలా ప్రాంతాలకు, మతాలకు అతీతంగా అందరూ తరతరాలుగా స్వామివారిని సేవించి తరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం స్వామివారికున్న ఆభరణాలు విలువ లెక్కగట్టే సాహసమే ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. స్వామివారికి ఉన్న ఆభరణాలు, ఆ ఆభరణాలలో పొదిగిన అమూల్యమైన రాళ్ళు ఎన్ని కోట్లు చేస్తాయన్నది ఈ నాటికీ దేవస్థానం దగ్గర లెక్కలు లేవు. 

ధగద్ధగాయమానం వజ్రకిరీటం
తిరుమల శ్రీవారికి గల ఆభరణాలలో కలికితురాయి ‘‘వజ్ర కిరీటం’’.  శ్రీవారికి ఏదైనా ఒక పెద్ద ఆభరణం చేయించాలనే ఆలోచనలతో టీటీడీ ఈ వజ్రకిరీటం తయారు చేయించాలని సంకల్పించింది. ప్రపంచమంతా తిరిగి వేలాది వజ్రాలు పరిశీలించి చివరికి బ్రెజిల్, ఆస్ట్రియా వంటి దేశాలలో వజ్రాలు సేకరించింది. అప్పట్లో అరున్నర కోట్ల ఖరీదు చేసిన ఈ వజ్రకిరీటం తయారీకి సుమారు సంవత్సరకాలం పట్టింది. కాగా ఈ వజ్రకిరీటాన్ని అప్పట్లో హడావుడిగా తయారు చేయించడంతో కొన్ని వజ్రాలు సరిగా తాపడం అవలేదు. ఆ కారణంగా ఈ వజ్రకిరీటంలోని కొన్ని వజ్రాలు రాలేందుకు సిద్ధంగా ఉండటంతో 1990 జనవరి నుంచి శ్రీవారికి వజ్రకిరీటం అలంకరించలేదు. అదే ఏడాది సెప్టెంబర్‌ 22 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటంతో శ్రీవారి వజ్రకిరీటానికి లోపలి వైపు బంగారు రేకు తయారు చేయించి, వజ్రాలు రాలకుండా ఏర్పాటు చేశారు. ఈ వజ్రకిరీటాన్ని తిరిగి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజున శ్రీవారికి అలంకరించారు. ప్రస్తుతం కిరీటం ఖరీదు సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. వజ్రకవచధారి అయిన శ్రీవారు ఈ కిరీటధారణతో వజ్రకిరీటధారిగా తన దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement