శ్రీవారి దర్శనం కోసం నిత్యం తరలివచ్చే లక్షలాది మంది భక్త జనులకు సేవలు అందించడంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. కొండంత పాలన జరిగేది తిరుపతిలోని కార్యాలయం నుంచే. ఒక్కమాటలో చెప్పాలంటే కొండను నడిపేది కింది కార్యాలయ ఉద్యోగులే. వేలాది మంది ఉద్యోగులు స్వామి సన్నిధి(టీటీడీ)లో ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నప్పటికీ సేవాభావంగానే విధులు నిర్వహిస్తున్నామన్న భావనతో జీవితాలు కొనసాగిస్తున్నారు.
22వేలకు పైగా ఉద్యోగులు
టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా 30కి పైగా విభాగాలు, దాదాపు 52 అనుబంధ శాఖలు ఉన్నాయి. వాటిలో 22వేలకు పైగా పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా వేకువ జామున 3 గంటలకే నిద్రలేచి తిరుమలలోనూ, తిరుపతిలోనూ రాత్రివేళ 11 వరకు వంతులవారీగా దేవస్థానానికి, తద్వారా భక్తులకు సేవగా భావించి పనిచేస్తున్నారు. టీటీడీ లెక్కల ప్రకారం వీరందరికీ జీతభత్యాల కోసం ఏటా సుమారు రూ.490 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు.
ఆలయం నుంచి భక్తుల సౌకర్యాల వరకు
వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు తిరుమల శ్రీవారి ఆలయంలో నుంచి తిరుపతిలోని పరిపాలనా విధానాలు రూపొందించే పాలనా భవనం, భక్తులకు సౌకర్యాలు కల్పించే విభాగాల్లోనూ సేవగానే విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా జీయంగార్ల వ్యవస్థ పరిధిలోకే వస్తారు.
∙స్వామివారి ఆలయంలో జీయర్ల ఆధ్వర్యం, పర్యవేక్షణలో అర్చకులు దేవదేవునికి నిత్య పూజలు, కైంకర్యాలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు.
∙స్వామివారికి వేదమంత్రాలతో అర్చనాది సేవలు అందించేందుకు వేదపండితులు తమ నిత్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ∙ వీరితో పాటు ఆలయంలో భక్తులకు దర్శనం, ఇతర పూజాది కైంకర్యాలు క్రమబద్ధంగా, నిర్ణీత సమయానికి నిర్వహింపచేసేందుకు ఏఈవోలు, సూపరిం టెండెంట్‌లు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తి తన్మయత్వంతో విధులు నిర్వహిస్తున్నారు. ∙ఆలయం వెలుపల నిత్యం స్వామివారి ఉత్సవవర్లకు వాహన బేరర్లు, మంగళ వాయిద్యాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు మాత్రం స్వామివారి ఉత్సవవర్లను మోయడం వల్ల నేరుగా స్వామికే సేవ చేసినంత భావనతో విధులు నిర్వహించి పులకించిపోతుంటారు. ∙మిగిలిన సేవల్లో తిరుమల, తిరుపతిలో గదుల కేటాయింపు, అన్నప్రసాదాల పంపిణీ, ఇందుకోసం అవసరమైన సరుకుల కొనుగోళ్లు, దాతల నుంచి విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలను తిరుపతిలోని పరిపాలనా భవనం పరిధిలో కొనసాగుతున్నాయి. ఇవి నిరంతరం కొనసాగితేనే స్వామివారి పూజలు, అందుకు విచ్చేసే లక్షలాది భక్తులకు అన్ని సేవలు నిరాటంకంగా సాగుతాయి. ∙భక్తుల సదుపాయాలకు సంబంధించి ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయాలను అమలుపరచేందుకు కూడా జీయంగార్ల సూచనలు, సలహాలను పాటించి పనులు చేపడుతుంటారు. ∙స్వామివారి మూలమూర్తితో పాటు అనుబంధ దేవతలకు, టీటీడీ అనుబంధ ఆలయాలకు పుష్పాలంకరణ, సరఫరా చేపట్టేందుకు కొనసాగుతున్న ఉద్యానవన విభాగంలోనూ వందలాది మంది ఉద్యోగులు, చిరుద్యోగులు సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నారు.
∙అభివృద్ధి పనులు, భక్తుల క్యూలైన్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు పనిచేసే ఇంజనీరింగ్ విభాగానిది టీటీడీలో ప్రధాన పాత్రనే చెప్పాలి. దీని పరిధిలోకే వచ్చే ఎలక్ట్రికల్ విభాగంలో అనేక మంది ఇంజనీరింగ్ అధికారులు, వందల సంఖ్యలో ఉద్యోగులు, వేల సంఖ్యలో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.
∙టీటీడీకి సంబంధించి భక్తులకు కావాల్సిన సమస్త సమాచారం తెలిపేందుకు పౌర సంబంధాల శాఖ పరిధిలో పనిచేస్తున్న కాల్‌సెంటర్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు.
నిఘా, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం
తిరుమల పుణ్యక్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడితో పాటు అత్యున్నత నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అటు తిరుమల ఆలయానికి, ఇటు భక్తులకు ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా నిరంతరం టీటీడీ కోసం ప్రత్యేక నిఘా, ¿¶ ద్రత వ్యవస్థ పనిచేస్తోంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే మార్గంలోని టోల్‌గేట్ నుంచి తిరుమల టోల్‌గేట్లు, ఆలయం, తిరుమలలో అణువణువూ జల్లెడ పట్టేలా అత్యాధునిక పరిజ్ఞానంతో భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు. క్షణం కూడా రెప్పవాల్చకుండా పటిష్టమైన నిఘా పహారా సాగుతోంది. ఈ విభాగంలోనూ పదుల సంఖ్యలో అధికారులు, వందల్లో ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
స్వచ్ఛతలో దేశంలోనే అగ్రస్థానం
దేశంలోని అనేక ప్రభుత్వ శాఖల్లోకెల్లా టీటీడీకి చెందిన పారిశుద్ధ్య, ఆరోగ్య విభాగాల సమన్వయం తో పనిచేసే పారిశు«ధ్ధ్య కార్మికుల నిరంతర కృషి ఫలితంగా తిరుమలకు స్వచ్ఛతలో దేశంలోనే అగ్రస్థానం దక్కింది. భక్తులకు క్షణక్షణం సేవలు అందించడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మాత్రం వెలకట్టలేనివి. సుమారు 9 వేల మంది కార్మికులు నిత్యం షిప్టుల వారీగా పనిచేస్తూ తిరుమల పుణ్యక్షేత్రం, స్వామివారి ఆలయం లోపల ప్రాంతాలు, ఘాట్‌రోడ్డు పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. టీటీడీ అన్నదాన భవనం, ఇతర క్యాంటీన్లు, హోటళ్ల ప్రాంతాల్లో సైతం పారిశుద్ధ్యాన్ని నిర్వహించడంలో పారిశుద్ధ్య విభాగం కార్మికులు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారు.వీటన్నిటితో పాటు స్వామివారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాపితం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వివిధ ప్రాజెక్టుల ఉద్యోగులు, కళాకారులు, ప్రచురణల విభాగం, ధర్మప్రచార సంస్థలు, భక్తుల సేవలో తరించే కళ్యాణకట్ట ఉద్యోగులు, తిరుమలలో ఉచిత రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న ట్రాన్స్‌పోర్టు విభాగంలోని ఉద్యోగుల సేవలు స్వామివారికే అన్నట్లు నిత్యం కొనసాగుతూ భక్తుల మన్ననలు పొందుతున్నాయి.
– పి.గురుమూర్తి తిరుపతి అర్బన్
తిరుమల ఆలన... పాలన
Published Sun, Oct 7 2018 2:02 AM | Last Updated on Sun, Oct 7 2018 2:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment