కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల మలయప్ప పెళ్లికొడుకై త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి కలియుగంలో పద్మావతి అమ్మవారిని వివాహమాడి, నడయాడిన క్షేత్రంగా చిత్తూరుజిల్లా నారాయణవనం భాసిల్లుతోంది. వేదవతీ (పద్మావతి), గోదాదేవి(అలివేలు మంగమ్మ)ల సమేతుడై కొలువుదీరిన పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్యంగా పెళ్లి కాని యువతకు కోర్కెలు తీర్చే కల్యాణ ప్రదాతగా దర్శనమిస్తున్నారు. మూడు ప్రాకారాలలో 120 అడుగుల ఎతై ్తన రాజగోపురంతో 14వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించిన ఆలయంలో ఎడమచేతిలో హస్తం, కుడిచేతికి కల్యాణ కంకణం, వక్షస్థలంలో లక్ష్మి, దశావతార వడ్యాణం, సాలిగ్రామ హారంతో నిత్య నేత్రదర్శనంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. నిత్యకల్యాణంతో వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలతో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలను అందుకొంటున్న వేంకటేశ్వరుడు ఇద్దరు తాయార్లతోపాటు కొలువుదీరిన ఏకైక క్షేత్రం.
కోర్కెను తీర్చడానికై..
త్రేతాయుగంలో వేదవతికి రాముడు ఇచ్చిన వరంతో కలియుగంలో పద్మావతి అమ్మవారిగా అవతరించి వేంకటేశ్వరుడు వివాహమాడటానికి నారాయణవనం వచ్చారని వరాహపురాణం పేర్కొంటోంది. అమ్మవారి వివాహ సందర్భంగా నలుగుపిండిని తయారు చేయడానికి వినియోగించిన తిరగలిని కూడా ఆలయంలో చూడవచ్చు.
స్థల పురాణం
ఆకాశరాజు కుమార్తె పద్మావతీ అమ్మవారు చెలికత్తెలతో నారాయణపురం సమీపంలోని వనంలో విహరిస్తుండగా మదించిన ఏనుగు వెంబడించింది. లక్ష్మిని వెతుకుతూ వచ్చిన వేంకటేశ్వరుడు ఏనుగు బారి నుండి పద్మావతీదేవిని రక్షించాడు. సుందర, సుకుమార, కోమలాంగి అయిన పద్మావతీదేవిని మొదటి చూపుతోనే మోహించిన వేంకటేశ్వరుడు వివాహమాడదలిచాడు. రాజమాత ధరణీదేవిని ఒప్పించడానికి వెంకన్నకు ఎరుకలసానిగా ఆకాశరాజు రాజప్రాసాదానికి చేరుకుని సోది చెపుతానమ్మ.. సోది చెబుతానంటూ.. పద్మావతీదేవి జన్మరహస్యాన్ని చెప్పి సరైన వరుడు మలయప్పగా వివరించగా ఆకాశరాజు, ధరణీదేవీలు మలయప్పకు ఆశ్రయాన్ని కల్పించిన వకుళమాత సమ్మతితో విళంబి నామ సంవత్సరం తమిళ పంగుణి శుద్ధ ఉత్తర నక్షత్రయుక్త శుభ ఘడియల్లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.పద్మావతి, వెంకన్నల వివాహవేదికపై ఆకాశరాజు నిర్మించిన ఆలయమే నేడు పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంగా భాసిల్లుతోంది.
ఆలయ విశిష్టత
పద్మావతీ, గోదాదేవిలు ఇద్దరూ మహావిష్ణువును వివాహమాడాలన్న తలంపుతో వరం పొందినవారే. వీరిరువురిని వివాహమాడి కల్యాణ వేంకటేశ్వరస్వామిగా నారాయణవనంలో కొలువై ఉన్నారు. ఆలయ ప్రాకారంలో హైందవ వైవాహిక సాంప్రదాయానుసారం స్వామి వారి గర్భాలయానికి వెనుకగా కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి కొలువై ఉన్న ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే... తిరుమలతో సహా అన్ని వైష్ణవాలయాల్లో ఉత్సవ మూర్తికి శ్రీదేవీ, భూదేవి సమేతంగా ఆర్జిత కల్యాణాన్ని నిర్వహిస్తుంటారు. అయితే నారాయణవనంలో ఉభయ నాంచారులతో పాటు పద్మావతీ అమ్మవారితో కల్యాణ వెంకటేశ్వరస్వామికి నిత్యకల్యాణం చేయడం ఇతిహాస గా«థకు దర్పణం పడుతుంది. కల్యాణోత్సవంలో పాల్గొన్న అవివాహ యువతీయువకులు కంకణాన్ని ధరిస్తే వివాహం జరుగుతుందని భక్తుల
విశ్వాసం.
ధనుర్మాస శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) రోజున వైష్ణవాలయాల్లో ఉత్తరముఖ ద్వార ప్రవేశాన్ని భక్తులకు కల్పిస్తారు. అయితే నారాయణవనం కల్యాణ వెంకన్న ఆలయంలో ద్వాదశి రోజున ద్వారప్రవేశ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సాంప్రదాయాన్ని తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి అలయంతో పాటు నారాయణవనం కల్యాణ వెంకన్న ఆలయంలో మాత్రమే నిర్వహిస్తారు.విళంబినామ సంవత్సరం తమిళ పంగుణి నెల ఉత్తరా నక్షత్రయుక్త శుభ ఘడియల్లో పద్మావతీ అమ్మవారిని కల్యాణ వెంకన్న వివాహమాడారు. ఏటా అదేరోజున వెంకన్న ఆలయంలో పంగుణోత్తర ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతిరోజూ సుప్రభాత, ఏకాంత సేవలను అందుకునే భోగశ్రీనివాసుడు పంగుణోత్తరం రోజులలో పద్మావతీ అమ్మవారి సన్నిధిలో అమ్మవారితో కలిసి ఏకాంత, సుప్రభాత సేవల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవాన్ని ఒక్క నారాయణవనంలో మాత్రమే జరుపుతారు. పంగుణోత్తర ఉత్సవాన్ని ప్రతిబింబించే విధంగా చాంద్రమానం ఆధారంతో ఫాల్గుణ మాసంలో నారాయణగిరి ప్రాంతంలో పద్మావతీ పరిణయోత్సవాలను నిర్వహిస్తారు.
వెంకన్న కొలిచిన ఆమ్నాయాక్షి
పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు కులదైవమైన ఆమ్నాయాక్షి(అవనాక్షమ్మ) ఆలయం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలోని సముదాయం గ్రామ శివారుల్లో వెలసి ఉంది.వేదాలను అపహరించిన సోమకాసురుడిని సంహరించడానికి పార్వతీదేవి కాళికగా అవతారమెత్తింది. సోమకాసురుడిని చంపి వేదాలను సంరక్షించిన అమ్మవారిని ఆమ్నాయాక్షిగా (ఆమ్న అంటే వేదాలను, అక్షి అంటే కన్నులుగా గల) ఆకాశరాజు కొలిచాడు. వివాహానికి ముందు పద్మావతీ అమ్మవారు గౌరీపూజను ఆమ్నాయాక్షి ఆలయంలో చేశారని, వివాహానంతరం నవదంపతులైన పద్మావతీ, కల్యాణ వేంకటేశ్వరస్వామివారలు అమ్మవారిని కొలిచినట్లు వరాహ పురాణం పేర్కొంది. ఆలయానికి పైభాగాన రాజధాని నగరం నారాయణపురం పూర్తిగా శి«థిలమైపోయింది. భిన్న స్థితిలోని ఆమ్నాయాక్షి ఆలయాన్ని 4వ శతాబ్దంలో చోళరాజులు మళ్లీ నిర్మించారు. టీటీడీ ఈ ఆలయాన్ని 1967లో స్వాధీనం చేసుకుని నిత్యపూజలను నిర్వహిస్తోంది.
నారాయణవనమే.. వరం
శ్రీమన్నారాయుణుడి అంశ అయిన వేంకటేశ్వరస్వామి తిరుగాడి, పద్మావతీ అమ్మవారితో వివాహం చేసుకున్న క్షేత్రం నారాయణవనంగా పిలువబడుతోంది. వేటకై వచ్చిన వెంకన్న వరుడై అమ్మవారిని వివాహం చేసుకోవడంతో నారాయణవరంగా కూడా పిలవబడుతోంది. కాలక్రమంలో నారాయణపురం శిథిలమై, అరుణానది తీరాన పద్మావతీ, వెంకన్నల వివాహ చిహ్నంగా ఆకాశరాజు నిర్మించిన ఆలయం చుట్టూ ఏర్పడిన గ్రామమే నారాయణవనంగాను, నారాయణవరంగాను పిలవబడుతోంది.
ఇలా చేరుకోవచ్చు..
విమానంలో వచ్చే వారు తిరుపతి విమానాశ్రయం చేరుకుని వాహనంపై సుమారు 24 కిలోమీటర్ల మేరకు పుత్తూరు మీదుగా ప్రయాణించి నారాయణవనం చేరుకోవచ్చు. రైలుప్రయాణంలో తిరుపతి, రేణిగుంట, పుత్తూరు రైల్వే స్టేషన్లకు చేరుకుని నారాయణవనం రావచ్చు. బస్సులో తిరుపతి, చెన్నైల నుండి నారాయణవనం చేరుకోవచ్చు.
విశేష పూజలు
ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవలో మేల్కొన్న స్వామిని నిత్య పూజాకైంకర్యాల అనంతరం రాత్రి 8 గంటల వరకు దర్శించుకొనవచ్చు. ప్రతి మంగళవారం ఉదయం 10.30 గంటలకు అష్టదళ పద్మారాధన సేవ, శుక్రవారం ఉదయం 7.30 గంటలకు వెంకన్న, పద్మావతీ అమ్మవార్లకు అభిషేకం, సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఊంజల్ సేవ, శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకన్నకు ఊంజల్‌సేవను నిర్వహిస్తారు. 500 రూపాయలు చెల్లించి, ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు ఉభయ నాంచారుల సమేత పద్మావతీ అమ్మవారితో కల్యాణ వెంకన్నకి నిర్వహించే ఆర్జిత కల్యాణంలో పాల్గొనవచ్చు.
– ఎ. శ్రీధర్, నారాయణవనం
వెంకన్న పెళ్లికొడుకాయెనే....
Published Sun, Oct 7 2018 1:58 AM | Last Updated on Sun, Oct 7 2018 1:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment