బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే... | Badvel Bypoll on October 30, YSRCP, TDP Announce Candidates | Sakshi
Sakshi News home page

Badvel Bypoll: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...

Published Wed, Sep 29 2021 8:47 AM | Last Updated on Wed, Sep 29 2021 9:48 AM

Badvel Bypoll on October 30, YSRCP, TDP Announce Candidates - Sakshi

బద్వేలు బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్టానాలు ఎంపిక చేశాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

డాక్టర్‌ దాసరి సుధ (వైఎస్సార్‌సీపీ)  
పేరు : డాక్టర్‌ దాసరి సుధ 
పుట్టిన తేదీ : 09–02–1972 
భర్త :  దివంగత ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య 
తల్లిదండ్రులు : డాక్టర్‌ డి.ఓబులయ్య, డి.విక్టోరియా 
విద్యార్హత : ఎంబీబీఎస్‌ డి.జి.ఓ. (కర్నూలు)  
పుట్టినిళ్లు: పెద్దుళ్లపల్లె, బి.కోడూరు మండలం  
మెట్టినిళ్లు : వల్లెరవారిపల్లె, గోపవరం మండలం 
సంతానంః కుమార్తె హేమంత ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్,  కుమారుడు తనయ్‌ ఇంటర్మీడియట్‌  
రాజకీయ ప్రవేశం: 2014 నుంచి తన భర్త అయిన దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్యతో పాటు ఆమె కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.  

ఓబులాపురం రాజశేఖర్‌ (టీడీపీ)
బద్వేలు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టీడీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ప్రకటించారు. కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్‌ ఎంబీబీఎస్‌తోపాటు ఆర్థోపెడిక్‌లో ఎంఎస్‌ చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి గత సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, దివంగత వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ దాసరి సుధపై రాజశేఖర్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.   

సాక్షి, కడప: బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 1 న ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.  

బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ వెంకటసుబ్బయ్య బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీచేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్‌పై 44,834 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు. డాక్టర్‌ వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 50,748 ఓట్లు వచ్చాయి. సౌమ్యుడు, మంచి డాక్టర్‌గా సేవలందించి డాక్టర్‌ వెంకటసుబ్బయ్య నియోజకవర్గ ప్రజల మన్ననలందుకున్నారు.   

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ‘డాక్టర్‌’ సుధ విస్తృత ప్రచారం 
బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో దివంగత డాక్టర్‌ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్‌ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు సుధ తో కలిసి ఆగస్టు నెల 14 వ తేదీన కలసపాడు లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక విడత ఎన్నికల ప్రచారం ముగించారు. 

సందిగ్ధంలో టీడీపీ 
బద్వేలు ఉప ఉన్నికకు  కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది.  అయితే ఇప్పటివరకు టీడీపీ ఇక్కడ స్థబ్దుగానే ఉంది. ఈ నెలలో విజయవాడలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం బద్వేలు ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ నేపథ్యంలో ఆ పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అభ్యర్థి పేరును వెల్లడించారు. ప్రచారం విషయంలో టీడీపీ పూర్తిగా వెనుకబడి ఉంది.

బద్వేలు పరిధిలో 272 పోలింగ్‌ స్టేషన్లు... 2,12,739 మంది ఓటర్లు 
బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో జనవరి, 2011వ తేదీ నాటికి  2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మందికాగా 1,06,069 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది. ఆమేరకు ఉప ఎన్నిక జరగనుంది.  

ఎన్నికల ప్రక్రియ వేగవంతం 
బద్వేలు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. మంగళవారం బద్వేలు నియోజకవర్గ పరిధిలోని  అధికారులతో  సమీక్షించారు.  

పటిష్టంగా ఎన్నికల కోడ్‌ అమలు: జేసీ గౌతమి 
కడప సిటీ: జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి(రెవెన్యూ) తెలిపారు. జిల్లాలో ఎన్నికల మోడల్‌ కోడ్‌ పటిష్టంగా అమలు చేయాలని మండల అధికారులను, మున్సిపల్‌ కమిషనర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు ఆదేశాల మేరకు జేసీలు సాయికాంత్‌వర్మ, హెచ్‌ఎం ధ్యానచంద్ర లతో కలిసి మండల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, సబ్‌ కలెక్టర్, ఆర్డీఓలు, జిల్లా నోడల్‌ అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల అనంతరం నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్‌ తదితర ప్రక్రియలు ముగిశాక నవంబర్‌ 5 వ తేదీ నాటికి ఎన్నికల కోడ్‌ ముగుస్తుందన్నారు. 2021 జనవరి 1 తేదీ నాటికి ప్రచురించిన ఎలెక్ట్రోరల్‌ ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మోడల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చినందు వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ప్రజా ప్రతినిధుల ఫొటోలను తీసి భద్ర పరచాలని, బహిరంగ ప్రదేశాలలో విగ్రహాలకు ముసుగు వేయాలని, ప్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. అధికారులు ఎవరూ ప్రజా ప్రతినిధులను కలవరాదని సూచించారు. మోడల్‌ కోడ్‌ ఉన్నందున కొత్త పథకాల అమలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కొనసాగించవచ్చని, కొత్త పథకాలు అమలు చేయరాదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ మాలోల, సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్, ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు,శిక్షణ కలెక్టర్‌ కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు 


               వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జేసీ గౌతమి  

నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ 
కడప కోటిరెడ్డిసర్కిల్‌: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారు, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లేవారు వాటికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.   సరైన ఆధారాలు చూపకపోతే కేసు నమోదుతోపాటు వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయ పన్నుశాఖ, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పగిస్తామన్నారు. అలాగే అధిక మొత్తంలో మద్యం కలిగి ఉన్నా చర్యలు తప్పవన్నారు. ఉప ఎన్నికల్లో ఏమాత్రం చిన్న ఘటనకు కూడా తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement