
కార్యకర్తలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: దసరా సెలవుల్లో న్యాయమూర్తులపై నాట్ బిఫోర్ అస్త్రాలను ప్రయోగించి విఫలమైన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తాత్కాలిక బెయిల్ పొందడంలో సఫలమయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం అనుమతించింది.
కుడి కంటికి శుక్లాల (కాటరాక్ట్) శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఆయనకు నాలుగు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఎడమ కంటికి ఏ ఆసుపత్రిలో (డాక్టర్ ఎల్‌వీ ప్రసాద్) అయితే శస్త్రచికిత్స చేయించుకున్నారో అదే ఆసుపత్రిలో ఇప్పుడు శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అనుమతిచ్చింది. మానవతా దృక్పథంతో పాటు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది.
ఏసీబీ కోర్టు సంతృప్తి మేరకు రూ.లక్షతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సొంత ఖర్చులతో తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు చంద్రబాబుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. తిరిగి లొంగిపోయే సమయంలో తనకు వైద్యులు అందించిన చికిత్స, ఏ ఆసుపత్రిలో చికిత్స పొందారు.. తదితర వివరాలను సీల్డ్ కవర్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు అందచేయాలని చెప్పింది. ఈ సీల్డ్ కవర్‌ను అలాగే ఏసీబీ కోర్టు ముందుంచాలని జైలు సూపరింటెండెంట్‌ను, నవంబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని చంద్రబాబును ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసిన ఏ వ్యక్తిని కూడా ఆ వివరాలు కోర్టుకు, సంబంధిత అథారిటీకి తెలియచేయకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించడం గానీ, భయపెట్టడం గానీ, ప్రలోభాలకు గురి చేయడం గానీ చేయరాదని హైకోర్టు తన 16 పేజీల ఉత్తర్వుల్లో చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జున రావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక బెయిల్ కోసం అనుబంధ పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారానికి తన నిర్ణయాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఆయన ఉత్తర్వులు వెలువరించారు. స్కిల్ కుంభకోణం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. తాత్కాలిక బెయిల్ ఉత్తర్వుల సారాంశం ఇదీ..
ఈ వయస్సులో వృద్ధాప్య సమస్యలు మామూలే
► అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి 2023 జూన్ 21 నుంచి ఆరు నెలల్లో కుడి కంటికి కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని చంద్రబాబుకు వైద్యులు సిఫారసు చేశారు. దూరదృష్టి కలిగిన ఓ వ్యక్తి కేవలం కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేయించుకునేందుకు మాత్రమే బెయిల్ కోరతారని అనుకోవడం అహేతుకమని ఈ కోర్టు భావిస్తోంది.
► ఒకవేళ అదే నిజం అయితే మధ్యంతర బెయిల్ దాఖలు చేసేందుకు 2023 అక్టోబర్ 25 వరకు చంద్రబాబు వేచి చూడాల్సిన అవసరం ఉండేది కాదు. చంద్రబాబు వయసును ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ వయసులో వృద్ధాప్య సమస్యలు రావడం మామూలే. చంద్రబాబు తన అనారోగ్యానికి సంబంధించి సమర్పించిన సర్టిఫికెట్ల యథార్థతను సందేహించే విషయంలో ఈ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు లేవు.
► డాక్టర్ శ్రీనివాసరావు తన రెండో నివేదికలో ఎక్కడా కూడా చంద్రబాబుకు కంటి శస్త్ర చికిత్స అవసరం లేదని చెప్పలేదు. అందువల్ల అదనపు అడ్వొకేట్ జనరల్ సూచించినట్లు చంద్రబాబును మెడికల్ బోర్డు ఎదుట హాజరు కావాలని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఈ కోర్టుకు కనిపించడం లేదు. చంద్రబాబు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కింది కోర్టు నుంచి గానీ, హైకోర్టు నుంచి గానీ బెయిల్ కోరేందుకు ఎంత మాత్రం అడ్డంకి కాదు.
► అనారోగ్య సమస్యల కారణంతో మధ్యంతర బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుందన్నది ఎవరి వాదనా కాదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేంత వరకు ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపరాదన్న అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనను ఆమోదించలేకున్నాం.
కంటికి శస్త్ర చికిత్స అవసరమే
► ఓ వ్యక్తిపై వచ్చిన నేరారోపణల తీవ్రత కంటే అతని అరోగ్యం, క్షేమాన్నే ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. దర్యాప్తులో భాగంగా కస్టడీ విధించడం శిక్షాత్మకం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడం ముఖ్యం. ప్రతి వ్యక్తికి కూడా సంపూర్ణ, సమగ్ర వైద్య సాయం పొందే స్వతఃసిద్ధ హక్కు ఉంటుంది. కస్టడీలో ఉన్న వ్యక్తులు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. వారికి తగిన, సమర్థవంతమైన వైద్య చికిత్స అందించేందుకు అనుమతివ్వడం తప్పనిసరి అని ఈ కోర్టు విశ్వసిస్తోంది.
► ఓ వ్యక్తి జీవితం ప్రమాదంలో ఉన్నప్పుడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని కొన్ని పరిస్థితులకు లోబడి పరిమితం చేయడం సాధ్యం కాదు. చంద్రబాబుకు శస్త్రచికిత్స అవసరం లేదని ఏ వైద్య నివేదికలు కూడా చెప్పడం లేదు. చంద్రబాబు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వారికి వైద్య సాయం అందించడం తప్పనిసరి. ముఖ్యంగా కుడి కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరమని ఈ కోర్టు భావిస్తోంది.
న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకోలేరు
► ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం, న్యాయ ప్రక్రియ నుంచి చంద్రబాబు తప్పించుకుంటారనేందుకు చిన్నపాటి అవకాశం కూడా కనిపించడం లేదు. విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేదు. వైద్య సాయం అవసరమైన వ్యక్తికి తక్షణమే సమర్థవంతమైన సమగ్ర చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు ధృడంగా నమ్ముతోంది.
► బాధాకరమైన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ, ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా, కేవలం శస్త్ర చికిత్స చేయించుకునేందుకు వీలుగా మాత్రమే ఈ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తోంది. అందుకే గతంలో శస్త్రచికిత్స చేయించుకున్న ఆసుపత్రిలో ఇప్పుడు కూడా శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వడం సహేతుకమని ఈ కోర్టు భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment