
గుంటూరు: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పోలీసులపై పలు రకాలుగా ఆరోపణలు చేస్తూ రాజకీయ రంగు పులమడం సరికాదని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంకు చెందిన బాణావత్ యలమంద నాయక్‌ను ఆయన అందుబాటులో లేకపోతే ఆయన కుమారుడు ప్రసన్నకుమార్‌కు సీఆర్‌పీసీ నోటీసును అందజేసిన తర్వాతనే రెవెన్యూ అధికారి సమక్షంలో పోలీసులు అరెస్టు చేశారన్నారు.
లిక్కర్ కేసులో నాయక్ ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిన అనంతరం చర్యలు చేపట్టామన్నారు. కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి, దుర్భాషలాడామని చెప్పడం సరికాదన్నారు. రిమాండ్ కోసం వైద్యుల వద్ద పరీక్షలు జరిపామని, అనంతరం న్యాయమూర్తి వద్ద హాజరుపరిచినప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే అక్కడే చెప్పాల్సి ఉందన్నారు. రిమాండ్ అనంతరం యలమంద నాయక్ తనను కిడ్నాప్ చేసి దుర్భాషలాడి కొట్టారని చెప్పడం ఎంతవరకు వాస్తవమో గుర్తించాలని అన్నారు. గురజాల డీఎస్పీ, సీఐలు ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గుర్తించి వారికి చార్జి మెమోలు జారీ చేశామని, ఆపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు నివేదిక పంపానని, దీని ఆధారంగా ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారన్నారు.