అవినీతి దురుద్దేశాలపై దర్యాప్తు చేయొద్దా? | Supreme court of India On TDP Leader Varla Ramaiah | Sakshi
Sakshi News home page

అవినీతి దురుద్దేశాలపై దర్యాప్తు చేయొద్దా?

Published Thu, Nov 17 2022 4:59 AM | Last Updated on Thu, Nov 17 2022 4:59 AM

Supreme court of India On TDP Leader Varla Ramaiah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అవినీతి చేయాలనే దురుద్దేశాలపై దర్యాప్తు చేయకూడదా? ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం వృథా, దుర్వినియోగం లాంటివి ఉంటే దర్యాప్తు వద్దా..?’’ అని టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఒక పోలీసు స్టేషన్‌లో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. విధాన నిర్ణయాలు, టెండర్, కాంట్రాక్టులకు సంబంధించిన కేసుల్లో సారూప్యం చూడాలని కోరారు. కోర్టు సమీక్ష అధికారాలను ప్రభుత్వాల సమీక్ష అధికారాలతో పోల్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎం. ఆర్‌. షా గతంలో ఇచ్చిన ఓ తీర్పులో కొంత భాగాన్ని సింఘ్వి చదివి వినిపించారు. 

గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చు..
రాజకీయ శత్రుత్వంతో కమిషన్ల నియామకంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు పలు తీర్పులు ఇచ్చాయని సింఘ్వి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్ధారణపై నిషేధం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

జగన్నాధరావు కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో కొంత భాగాన్ని చదివి వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని స్టే ఇస్తే ఇక విచారణ అధికారం రాష్ట్రానికి ఎక్కడుంటుందని, ఇలా చేయడం దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడమేనన్నారు. ఎఫ్‌ఐఆర్‌పై విచారణ చేయవద్దని అనడం అవగాహన లేకపోవడమేనని, ఇది జాతీయ దర్యాప్తు సంస్థ విచారించదగిన కేసు అని పేర్కొంటూ సింఘ్వి వాదనలు ముగించారు. సీబీఐ విచారించాలా వద్దా? అనే అంశంపై చర్చిద్దామని ధర్మాసనం పేర్కొంది.

క్రిమినల్‌ కేసుల కోసమే..
టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపిస్తూ ఇది పాలనా ప్రతీకార కేసుగా అభివర్ణించారు. సిట్‌ ఉద్దేశం నిజ నిర్ధారణ మాత్రమే కాదని, క్రిమినల్‌ కేసులతో అనుసంధానానికి మార్గాలను అన్వేషించేందుకేనని ఆరోపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా? అని ప్రశ్నించింది.

ఎక్కడ దుర్వినియోగం జరిగిందో చెప్పకుండా నోటిఫికేషన్‌ ఇచ్చి సిట్‌ ఏర్పాటు చేశారని దవే పేర్కొన్నారు. కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించడం ఏకపక్షంగా ఉందన్నారు. ఎలాంటి దర్యాప్తు నివేదిక రాకుండా అలా ఎలా అంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి కూడా కేబినెట్‌ సబ్‌కమిటీల సమావేశానికి హాజరయ్యేవారని దవే పేర్కొన్నారు. కొందరిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్న ఉద్దేశంతోనే సిట్‌ ఏర్పాటైందన్నారు. పాలనా చర్యలంటూ క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అనంతరం విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement