పేదలు మరింత నిరుపేదలుగా మారాలి.. పెత్తందార్లకు జీ హుజూర్ అంటూ బతకాలి.. పేదల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవరాదు.. ఇంగ్లిష్ చదువులు అసలే చదవకూడదు.. కనీసం వారికి నిలువ నీడ కూడా లేకుండా ఉంటేనే తమ ఆటలు సాగుతాయన్నది చంద్రబాబు అండ్ కో మానసిక పరిస్థితి. అమరావతి ప్రాంతంలో వారికి ప్రభుత్వం సెంటు భూమి ఇస్తామంటే ఇదే పచ్చ గ్యాంగ్, ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెట్టింది.
బాబు 3డి గ్రాఫిక్స్ రాజధానిలోని సింగపూర్, మలేషియా, జపాన్‌లు మురికి కూపాలైపోతాయని ఆందోళనలు, చర్చోపచర్చలతో ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేసింది. నిస్సిగ్గుగా కోర్టులకూ ఎక్కింది. ‘రాజధాని అయినంత మాత్రాన అక్కడ పేదలు ఉండకూడదంటే ఎలా?’ అని హైకోర్టు తలంటినప్పటికీ ఈ పచ్చ గ్యాంగ్‌కు బుద్ధి రాలేదు. రైతుల పేరుతో సుప్రీంకోర్టులోనూ వంకర బుద్ధి చూపించబోయింది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏ విధంగా అన్యాయం?
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టలేం’ అని తాజాగా గడ్డి పెట్టింది. అయినా వీళ్లలో మార్పు వస్తుందని ఆశించలేం. ఈ పెత్తందార్ల యుద్ధాన్ని ఎదిరిస్తూ.. వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతూ సీఎం వైఎస్ జగన్ గట్టిగా నిలవడం వల్లే పేదలకు న్యాయం జరిగింది. ఇది పేదల కోసం నిలబడ్డ ప్రభుత్వ ఘన విజయం.
సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు స్థానమే లేకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రలు, కుతంత్రాలను సుప్రీంకోర్టు పటాపంచలు చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూమి కేటాయించాలన్న సీఆర్‌డీఏ చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు శక్తివంచన లేకుండా తెలుగుదేశం పార్టీలు పెద్దలు చేసిన యత్నాలను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చేసేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయలను వెదజల్లినా టీడీపీ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.
పేదలకు వ్యతిరేకంగా రైతుల ముసుగులో పిటిషన్లు దాఖలు చేయించి, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. చట్ట ప్రకారం రాజధాని ప్రాంతంలో వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిరోధించేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులు రాజధాని ప్రధాన కేసులో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోండి
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్‌డీఏకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి వాటిని కొట్టేసింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీఆర్‌డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపించారు. ఈ విచారణకు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు.
ఎలా చూసినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, పిటిషన్లు దాఖలు చేసిన పిటిషన్‌లకు ఎలాంటి విచారణ అర్హత లేదన్నారు. వేలాది మంది రైతుల్లో కనీసం పది మంది కూడా కోర్టుకు రాలేదన్నారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం కూడా ఐదు శాతం భూమి ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) వర్గాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రధాన కేసులో అనుకూలంగా తుది తీర్పు రాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఒకవేళ అలా జరిగినా ప్రస్తుతం పేదలకు చేస్తున్న కేటాయింపులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎందుకంటే సీఆర్‌డీఏ చట్టమే పేదలకు ఐదు శాతం భూమి ఇవ్వాలని చెబుతోందని తెలిపారు. కాని ఇప్పుడు పేదలకు ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 3.1 శాతం భూమి మాత్రమేనన్నారు. 34 వేల ఎకరాల్లో సుమారు 1,200 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించామని తెలిపారు.
సీఆర్‌డీఏ చట్టంలో సెక్షన్ 53 డీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఆర్–5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ఎలక్ట్రానిక్ సిటీ (ఈ–సిటీ)కి వచ్చిన ఇబ్బందేంటో తెలియడం లేదన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని తుది విచారణ జరగాల్సి ఉందన్నారు. కోర్టులో దాఖలు అవుతున్నవన్నీ వ్యక్తిగత పిటిషన్లేనని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కాదని వివరించారు.
ఈ పది మంది వెనుక ఎవరున్నారో పరిశీలించండి
వేల మంది భూములిచ్చిన రైతులుండగా, కేవలం పది మందే కోర్టుకు ఎందుకొచ్చారో, దీని వెనుక ఎవరున్నారో పరిశీలించాలన్నారు. ప్రస్తుతం పేదలకు కేటాయించిన స్థలాల వల్ల పిటిషనర్లకు చెందిన రిటర్నబుల్ ప్లాట్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని సింఘ్వి తెలిపారు. పేదలకు ప్రస్తుతం కేటాయించిన స్థలాలు ఈ–సిటీ దగ్గర్లో ఉన్నాయని, 6,500 ఎకరాల ఈ–సిటీలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలం చాలా తక్కువని చెప్పారు. అసలు ఆర్–5 జోన్‌లోనే ఎందుకు.. మరెక్కడైనా ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించినా సమాధానం చెప్పగలమన్నారు.
ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లలో జోన్–1ను ప్రస్తుతం ఉన్న గ్రామాల కారణంగా ముట్టుకునే పరిస్థితి లేదని, జోన్–2 స్పెషల్ ఏరియా అని.. ఢిల్లీలో లుటియన్స్ ఢిల్లీ మాదిరి అని తెలిపారు. జోన్–3 భూములిచ్చిన వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న ప్రాంతమని, జోన్–4 హై డెన్సిటీ ప్రాంతం అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే పేదల కోసం ఆర్–5 జోన్‌ను సృష్టించామని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్లు ఒక చోట, ఈ–సిటీ మరో చోట అని తెలిపారు.
ఒకవేళ పిటిషనర్లు హైకోర్టులో గెలిచినా కూడా సీఆర్‌డీఏ చట్టం ప్రకారం పేదలకు ఐదు శాతం భూమి కేటాయించాల్సిందేన్నారు. రాజధాని ప్రధాన వ్యాజ్యాలు జూలైలో విచారణకు రానున్నాయని, ఒకవేళ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చినా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని, అప్పుడు కూడా ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించాల్సి ఉంటుందని వివరించారు.
మాస్టర్ ప్లాన్‌ను మార్చలేదు
సీఆర్‌డీఏ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మాస్టర్ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. కేటాయించిన స్థలాల్లో నివాసాలు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. చట్ట ప్రకారం పేదలకు ఐదు శాతం స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. భూసేకరణ అనేది ప్రభుత్వం ప్రజల కోసమే చేస్తుందని, దాన్ని ఇతరత్రా ప్రజా ప్రయోజనాల కోసం కూడా వినియోగిస్తుందని తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ వర్గాలకు స్థలాల కేటాయింపు ప్రజా ప్రయోజనం కాదని అనడం ఎంత మాత్రం సబబు కాదన్నారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. 29 గ్రామాలకు చెందిన 33 వేల మంది రైతులు భూ సమీకరణ కింద ప్రభుత్వానికి రాజధాని కోసం భూములు ఇచ్చారన్నారు. అమరావతిలో మీడియా సిటీ, నాలెడ్జి సిటీ, జస్టిస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఇలా తొమ్మిది రకాల సిటీలు అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్‌లో ఉందన్నారు.
ఒరిజినల్ మాస్టర్ ప్లాన్‌లో 5 శాతం పేదలకు ఇళ్ల స్థలాలను తొమ్మిది సిటీలకు విస్తరించాలన్నారు. మాస్టర్ ప్లాన్‌లో 17 వేల ఎకరాలు రెసిడెన్షియల్ జోన్లకు కేటాయించారని పేర్కొన్నారు. జూలైలో తుది తీర్పు రానుందని, అంతకు ముందుగానే పట్టాలు కేటాయించడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. అటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment