నూరు గొడ్లను తిన్న ఒకానొక రాబందు ఓ చిరుగాలి వానకు గాయపడిందట! ఈ గాయం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమట! కానీ, గాయపడిన పిట్టల కోసం, రాలిపడిన పువ్వుల కోసం పరితపించడం మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమట! పిట్టల గాయాలు మాన్పి నింగి లోకి ఎగరేయడం నేరమట! రాలిన పువ్వులను మాల కూర్చి మందిరానికి చేర్చడం పాపమట! తీతువులు నీతులు చెబుతున్నాయ్. గ్రద్దలు క్రుద్ధమవు తున్నాయ్. తోడేళ్లు తొడలు చరుస్తున్నాయ్!
ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ నేడు ప్రజాస్వామ్య పాఠాలను బోధిస్తున్నది. దాని తాబేదార్లు తందానా అంటున్నారు. పెత్తందారీ ప్రజా స్వామ్యం కోసం వందిమాగధులు, భజంత్రీలు సహస్ర గళార్చన చేస్తున్నారు. రాబందుల స్వేచ్ఛపై ఆంక్షలేమిటి? రామోజీల ‘చీట్’లకు ఆటంకాలేమిటని ప్రశ్నిస్తున్నారు. తోడేళ్ల మందలు స్వైర విహారం చేసినంత మాత్రాన బంధిస్తారా? ప్రభుత్వ పెద్దలు ఖజానాకు కన్నం వేస్తే అరెస్టు చేస్తారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టిందని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊరేగుతున్నారు.
ఇప్పుడక్కడ ఒక ప్రజాస్వామ్య యుద్ధం జరుగుతున్నది. కులం,మతం, ప్రాంతం, జాతి, స్త్రీ–పురుష వివక్ష లేకుండా భారత రాజ్యాంగం ప్రజలందరికీ ప్రసాదించిన హక్కులను వారికి దఖలు పరచడానికి, ఆదేశిక సూత్రాలను శిరసావహించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షం, దాని తైనాతీల రూపంలో ఘనీభవించిన పెత్తందారీ వ్యవస్థ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నది. దాని దశకంఠాలు రణరంకెలు వేస్తున్నయ్. దాని వేయి చేతులు కత్తులు దూస్తున్నయ్.
పేద ధనిక తేడా లేకుండా పుట్టిన ప్రతిబిడ్డ ఆనందంగా ఆరోగ్యంగా పెరగడం కోసం, ఉన్నత లక్ష్యాల వైపు స్వేచ్ఛగా పరుగెత్తగలగడం కోసం, అందలాలు అందుకోవడం కోసం సమానావకాశాలుండాలని రాజ్యాంగం వాంఛించింది. ఆ వాంఛితానికి వాస్తవ రూపు కట్టడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పెత్తందారీ వ్యవస్థ ప్రయోజనాలకు ఈ ప్రయత్నాలు వ్యతిరేకం. కనుకనే తెలుగుదేశం – యెల్లో మీడియాల సేనాధిపత్యంలో మోహరించిన పెత్తందారీ వ్యవస్థ యుద్ధం ప్రకటించింది. అందుకే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పోరాటాన్ని ‘క్లాస్ వార్’గా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
‘వర్గ పోరాటానికి’ తన సేనావాహినిని సమాయత్తం చేస్తూ ఈ వారం విజయవాడలో వైఎస్ జగన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలం, ఆ పైస్థాయి పార్టీ నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘మీరే నా సేనాపతులు. మీరే నా దళపతులు’... అంటూ ఈ సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. నిజానికది ప్రసంగం కాదు. ఒక మార్చింగ్ సాంగ్. కవాతు గీతం. ‘పదండి ముందుకు, పదండి తోసుకు... పోదాం పోదాం పైపైకి! కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ’ అని శ్రీశ్రీ చెప్పినట్టుగా సాగిందా ప్రసంగ పాఠం. ప్రజలందరికీ సమాన హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం తన ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘మాగ్నా కార్టా’పై ఆయన తన దళపతులకు సంపూర్ణ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
నా... నా... నా... నా... నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్రకులాల పేదలు అని పదేపదే సంబోధిస్తూ ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీని ఘంటాపథంగా ప్రకటించారు. ఆ ఫిలాసఫీని పార్టీ నాయకశ్రేణుల మెదళ్లలోకి బలంగా జొప్పించే ప్రయత్నం చేశారు. గడిచిన ఎన్నికల్లో మేనిఫెస్టో రూపంలో ప్రకటించిన ‘మాగ్నాకార్టా’ను 99 శాతం అమలు చేశామని ఆయన ఈ సభలో ప్రకటించారు. ‘‘ఈ 52 మాసాల్లో మనం చేసిన మంచే మన బలం... మన ధైర్యమని చెబుతూ ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాం. దేవుడి దయ మనకు తోడుగా ఉన్నది. చేసిన అభివృద్ధి కళ్లెదుట కనిపిస్తున్నది. కనుక ’వై నాట్ 175‘ అనేది మన లక్ష్యం కావాల’’ని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు.
ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలుచేస్తూ సాగిన ఐదేళ్ల పదవీ కాలానికి ఒక వినూత్నమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని ప్రజా ఉద్యమ రూపంగా మలిచి ఆయన పార్టీ శ్రేణుల ముందుంచారు. ఈ ఉద్యమం నాలుగు రూపాల్లో సంక్రాంతి పండుగ దాకా కొనసాగుతుంది. ఆ తర్వాత పెన్షన్ల పెంపుతో సహా మరో మూడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖాన్ని పూరించబోతున్నది.
ఈ నాలుగంచెల ఉద్యమంలో భాగంగా పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ, ప్రతి ఓటరుకూ చేరువవుతాయి. ‘మా పరిపాలనలో మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండ’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క మాటతోనే ఆయన పార్టీ సగం యుద్ధాన్ని గెలిచింది. అదే సందేశాన్ని పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి గడప ముందు వినిపిస్తారు.
క్లైమాక్స్‌లోని మొదటి ఉద్యమ రూపం – ‘జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం’. ఇది ప్రారంభమై పదిహేను రోజులు విజయవంతంగా నడిచింది. ఇంకో ఇరవై ఐదు రోజులు కొనసాగుతుంది.
ఇందులో భాగంగా పదిహేను వేల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామాన్నీ, ఇంటినీ జల్లెడపడుతున్నారు. ఈ శిబిరాలు అందరికీ పరీక్షలు చేసి, సమస్యలున్నవారికి మందులు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కావడం లేదు – జబ్బులున్న వారినీ, దీర్ఘకాలిక రోగా లున్నవారినీ కూడా గుర్తించి వారికి చేయూతనిచ్చి రోగం నయమయ్యే దాకా నిలబెట్టే కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేశారు.
ఈ శిబిరాలు జరిగినన్ని రోజులు ఊరూవాడా అంతటా ఆరోగ్య రంగంపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వైద్య సేవలు నాడు ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. యాభై వేలకు పైగా వైద్య సిబ్బందిని కొత్తగా నియమించడం, ఊరూరా వెలసిన ఆరోగ్య కేంద్రాలు, పటిష్ఠమైన పీహెచ్‌సీలు, అందు బాటులోకి ఫ్యామిలీ డాక్టర్ పథకం, అంబులెన్స్ సర్వీసులు, కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు వగైరా విషయాలన్నింటిపై జనంలో చర్చ జరుగుతుంది. వారికి అవగాహన పెరిగి, వైద్య సేవలను గరిష్ఠంగా వినియోగించు కోగలుగుతారు.
‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనేది రెండో దశ కార్యక్రమం. ఇది కూడా నలభై రోజుల దీక్ష. ఇందులో కూడా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపునూ తడతారు. ఐదేళ్లలో వచ్చిన మార్పులను గుర్తు చేస్తారు. పరిపాలనా వికేంద్రీకరణనూ, కొత్త జిల్లాలను, గ్రామ సచివాలయాలను, వలంటీర్ వ్యవస్థను, వాటి ప్రయోజనాలనూ గుర్తు చేస్తారు. చేరువైన ఆరోగ్యరంగాన్నీ, మెరుగైన విద్యా వ్యవస్థనూ పరిశీలించాలని చెబుతారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఆర్‌బీకే సెంటర్లనూ, వాటి ప్రయోజనాలనూ వివరిస్తారు. మొత్తంగా ఆ ఇంటికీ, ఊరికీ, ఆ ప్రాంతానికీ జరిగిన మేలును విడమర్చి చెబుతారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల పనితీరును తులనాత్మక పరిశీలనకు పెడతారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులంతా పాల్గొనే సామాజిక బస్సు యాత్రలు రెండు మాసాలపాటు సాగుతాయి. సామాజిక న్యాయానికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత, వేసిన పెద్దపీట ఈ యాత్రలలో హైలైట్ అవుతుంది. రాజకీయ ఆర్థిక ఆధ్యాత్మిక విద్యా రంగాల్లో ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన సామాజిక న్యాయం, బాబు హయాంలో జరిగిన దురన్యాయాలు చర్చకు వస్తాయి. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? బీసీలు జడ్జీలుగా పనికిరారు, బీసీల తోకలు కత్తిరిస్తా..’ అనే భావజాలానికీ, ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’ అనే భావ జాలానికీ మధ్య ఉన్న తేడాను జనం గుర్తిస్తారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అనే పురుషాహంకారానికీ, మహిళా సాధికా రత స్వరానికీ మధ్య గల తేడాను ప్రజలు అర్థం చేసుకుంటారు.
ఆఖరి దశలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ అనే కార్యక్రమం ఒక యువ చేతనా ఉద్యమం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా క్రీడా రత్నాలను వెలికితీసే యజ్ఞం. లక్షలాదిమంది యువకులు ప్రత్యక్షంగా ఈ యజ్ఞంలో పాల్గొంటారు. ఎన్ని కల ప్రచారానికి ముందు ఐదేళ్ల పాలనా కాలానికి వైసీపీ అధినేత రూపకల్పన చేసిన భారీ క్లైమాక్స్ సన్నివేశం ఇది. ఐదేళ్లు ఆధికారంలో ఉన్న తర్వాత ప్రతి గడప తొక్కడానికీ, ప్రతి గుండెను తడమడానికీ ఎంత ధైర్యం కావాలి? ‘నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి’ అని చెప్పడానికిఎంత నైతిక స్థైర్యం కావాలి? ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్న వైసీపీ ప్రభు త్వంతో తలపడేందుకు ప్రతిపక్ష శిబిరం దగ్గర ఉన్నదేమిటి?
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి చట్టానికి దొరికిపోయి సెంట్రల్ జైల్లో సేద తీరుతున్న అధినాయకుడు. తండ్రి అరెస్టు తర్వాత పార్టీ శ్రేణులకు ధైర్యం ఇచ్చి నిలబడకుండా ఢిల్లీకి పారిపోయిన వార సుడు. నాయకుడు చేసిన అవినీతి గురించి వాదనలొద్దు, గవర్నర్ అనుమతి తీసు కోలేదు కనుక కేసు కొట్టేయాలని వాది స్తున్న ఖరీదైన లాయర్లు. ఒక సిద్ధాంతం, నిబద్ధత, మాట నిలకడ, విలువల కట్టు బాటు వంటివేమీ లేని ఒక నట భాగ స్వామి.
ప్రతిపక్ష నేత సొంత పార్టీ కోమాలోకి జారుకోగా ఆయన సొంత కులం వారిని రెచ్చగొట్టి ఏవో కొన్ని కార్య క్రమాలను మమ అనిపిస్తున్న కోటరీ... ఇదీ ప్రస్తుత టీడీపీ, దాని మిత్ర పక్షాల పరిస్థితి. పెత్తందారీ శిబిరానికి అర్థబలం, అంగబలం దండిగానే ఉండ వచ్చు గాక. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దానికి నైతిక బలం హీనదశలో ఉన్నది. సాను భూతి కోసం నాటకాలాడే దుఃస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. పేదవర్గాలు చైత న్యంతో మెలిగితే మరో ఐదేళ్లలో ఆ వర్గాల సాధికారత ఇంకో వంద రెట్లు పెరుగుతుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
మార్చింగ్ సాంగ్
Published Sun, Oct 15 2023 4:45 AM | Last Updated on Sun, Oct 15 2023 4:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment