సాక్షి, అమరావతి: బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని వచ్చేనెల 8న విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని సంకల్పించినట్లు రాష్ట్ర బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఈ సమ్మేళనానికి సీఎం వైఎస్ జగన్‌ను కూడా ఆహ్వానిస్తామని వారు తెలిపారు. సీఎం జగన్ మూడున్నరేళ్ల పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును గుర్తుచేసుకుంటూ, గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. తమది బీసీల ప్రభుత్వమని, బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతి మాటను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని నేతలు తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. ఆయా కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఘనత సీఎం జగన్‌దేనని వివరించారు.
నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం బీసీలకే ఇచ్చారని గుర్తుచేశారు. అందువల్ల బీసీలంతా క్విట్ బాబూ... అంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, పార్థసారథి, హాజరయ్యారు. వారు మీడియాతో మాట్లాడారు.
బీసీల కల ఇన్నాళ్లకు సాకారం
పాలనలో బడుగులకు భాగస్వాములుగా చేయాలని స్వాతంత్య్ర కాలం నుంచి పోరాటం జరుగుతోంది. కానీ, ఇన్నేళ్లకు సీఎం జగన్ సాకారం చేశారు. 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17 మందికి స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అంబేద్కర్ సూర్తితో రాష్ట్రంలో పాలన సాగుతోంది. చంద్రబాబు ఆటలు ఇక ఏపీలో సాగవు.
– విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరా?
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బీసీలకు దాదాపు రూ.86 వేల కోట్లకు పైగా మూడున్నరేళ్లలో సీఎం ఇచ్చారు. చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరా? జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనే.
– మార్గాని భరత్, ఎంపీ, రాజమహేంద్రవరం
బీసీలకు మేలు చేసింది జగనన్నే
రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా, బీసీలను గుర్తించి, బీసీలకు మేలు చేసింది జగనన్నే. కాబట్టి బీసీ సమాజం అంతా ఆయనకు అండగా నిలబడుతుంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటే బీసీల రాష్ట్రం. భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలన్న దానిపై బీసీల సమ్మేళనంలో మేధోమథనం చేస్తాం. విజయవాడలో 10 వేల మంది ప్రజాప్రతినిధులతో దీనిని నిర్వహించాలని నిర్ణయించాం.
– కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
బీసీ కార్పొరేషన్లు ఏర్పడి రెండేళ్లు పూర్తి
మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు జరిగిన మేలు, బీసీల జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయి, గ్రామస్థాయి నుంచి బీసీ వర్గాలకు పెరిగిన రాజకీయ ప్రాధాన్యత.. తదితర అంశాలపై చర్చించాం. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, వందల మంది డైరెక్టర్లను నియమించాం. అన్ని స్థాయిల్లోని బీసీ ప్రజాప్రతినిధులతోపాటు కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యులు, డైరెక్టర్లు అందర్నీ ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తాం.
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు
నీకా దమ్ము, ధైర్యం ఉందా బాబూ?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 70 శాతం పదవులిస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా బాబు నీకు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నువ్వు ఏనాడైనా ఆ వర్గాల బాగును పట్టించుకున్నావా? మన సీఎంను చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడవాలని చూస్తున్నాయి.
– గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
చెప్పనివి కూడా చేస్తున్నాం
బీసీల అభ్యున్నతికి దిశ, దశ నిర్దేశించిన నాయకుడు సీఎం జగన్. గత ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి అధికారంలోకి వచ్చాక అందులో చెప్పిన ప్రతి అంశాన్నీ అమలుచేశారు. డిక్లరేషన్‌లో చెప్పని అంశాలనూ అమలుచేస్తున్నారు. మూడున్నరేళ్ళలో ఈ ప్రభుత్వం రూ.1.76 లక్షల కోట్లను డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే, అందులో 50 శాతానికి పైగా బీసీలకు అందాయి.
– పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, విప్ జంగా కృష్ణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment