సాక్షి, అమరావతి: రకరకాల పదవులు చేపట్టి రాజకీయ సాధికారతతో బీసీ ప్రతినిధులు భారీ ఎత్తున ‘జయహో బీసీ’ సభకు తరలి రావటం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మహాసభ జరుగుతున్నంత సేపూ వారంతా ‘‘జయహో బీసీ... జయహో జగన్’’ అంటూ ఉరిమే ఉత్సాహంతో నినదించటంతో అంచనాలకు మించి మహాసభ సక్సెస్ అయినట్లు పార్టీ భావిస్తోంది.
రాష్ట్ర మంత్రులు మొదలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో పాటు వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల వైస్ ప్రెసిడెంట్‌లు, ప్రెసిడెంట్‌లు, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్‌పర్సన్లు, వాటి డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వాటి డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు వాటి మెంబర్లు, ఆలయ బోర్డు చైర్మన్లు... ఇలా దాదాపు 85 వేలకు పైగా బీసీ ప్రతినిధులు రాష్ట్రం నలుమూలల నుంచీ కదలిరావటమనేది గతంలో ఎన్నడూ జరగలేదని, ఒక్క వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే ఇది సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశిస్తున్నట్లు 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి ఈ సభను ఓ కొత్త ఆరంభంగా చూడాలనేది వారి భావన. గత ఎన్నికలకు ముందు... అంటే 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో తాము అధికారంలోకి వస్తే.. బీసీలకు చేసే మేలుపై బీసీ డిక్లరేషన్‌ను వైఎస్ జగన్ అప్పట్లో ప్రకటించారు. ఆ డిక్లరేషన్‌ను ఇపుడు తుచ తప్పకుండా అమలు చేస్తున్నారు.
తొలి మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు స్థానం కల్పించి... పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశమిచ్చారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అన్నింటా బీసీలకే సింహభాగం పదవులిచ్చారు. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపకపోతే.. మూడున్నరేళ్లుగా రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే... అందులో వాటిలో నాలుగింటిని బీసీలకే ఇచ్చి... నలుగురిని రాజ్యసభకు పంపారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.63 లక్షల కోట్లను బీసీలకు అందిస్తే.. అందులో కేవలం డీబీటీ రూపంలోనే రూ.86 వేల కోట్లను ఆ వర్గాల ఖాతాల్లో జమ చేశారు. వీటన్నిటి ఫలితం ఈ జయహో బీసీ సభలో కనిపించిందనేది పార్టీ వర్గాల మాట.
వైఎస్సార్‌సీపీకి వెన్నెముకలా నిలిచిన బీసీలు..
తమను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తా, అంతుచూస్తానంటూ బెదిరించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన హయాంనూ... రాజ్యాధికారంలో, బడ్జెట్‌లో తమకు సింహభాగం వాటా ఇచ్చి సమున్నత గౌరవం ఇస్తున్న సీఎం జగన్ పాలనను బీసీలు పోల్చి చూసుకుంటున్నారు. బుధవారంనాటి బీసీ నేతల ప్రసంగాలన్నిటా ఇది స్పష్టంగా కనిపించింది కూడా.
దేశ చరిత్రలో బీసీ సీఎం కూడా ఇవ్వని రీతిలో.. తమకు సమున్నత గౌరవం ఇస్తూ, కాలరెగరేసుకుని సగర్వంగా తిరిగేలా పాలిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు వెన్నెముకలా నిలబడాలని వారంతా సభాముఖంగా నినదించారంటే ఈ పాలన ఫలితమేనని వేరే చెప్పాల్సినపనిలేదు కూడా. మళ్లీ వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుంటేనే.. తాము మరింత పురోభివృద్ధి సాధించగలుగుతామని బీసీలు భావిస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
కదంతొక్కుతున్న శ్రేణులు
అధికారంలోకి వచ్చాక తొలిసారి జులైలో నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్‌సక్సెస్ అయ్యింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను వివరిస్తూ గడపగడపకూ వెళ్తోన్న వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్చార్జ్లకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు జేజేలు పలుకుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈక్రమంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభ గ్రాండ్ సక్సెస్ కావడమనేది తదుపరి ఎన్నికలకు కావాల్సిన కదనోత్సాహాన్ని శ్రేణుల్లో నింపిందనే చెప్పాలి.
85వేల గళాల నినాదం...‘జయహో బీసీ’
Published Fri, Dec 9 2022 4:21 AM | Last Updated on Fri, Dec 9 2022 4:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment