BCom Course Comes Under Arts And Humanities - Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌లోనే కామర్స్‌ కూడా.. ఏపీ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు..

Published Sat, May 20 2023 3:41 AM | Last Updated on Sat, May 20 2023 3:39 PM

Becom course comes under Arts and Humanities - Sakshi

సాక్షి, అమరావతి : బీకాం కోర్సు ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగం కిందకు వస్తుందా రాదా అంటూ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. బీకాం కోర్సు ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగం కిందకే వస్తుందని తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు బీకాంను ఈ విభాగం కిందే బోధిస్తున్నాయని గుర్తు  చేసింది. బీకాం, ఆర్ట్స్‌ విభాగం కిందకు రాదనేందుకు ఆధారాలేవీ అధికారులు సమర్పించలేదంది. కామర్స్‌ కోర్సు ఆర్ట్స్‌ కిందకు వస్తుందని యూజీసీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చిందని వివరించింది.

వార్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ (గ్రేడ్‌–2) పోస్టుకు బీకాం చదివిన వారు అర్హులు కాదనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారు ఈ విధులు నిర్వర్తించలేరన్న అధికారుల వాదనను తోసిపుచ్చింది. నోటిఫికేషన్‌లో ఈ ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వర్తించాలో ఎక్కడా ప్రస్తావించలేదని, ఆర్ట్స్‌ నేపథ్యం ఉన్న వారు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని కూడా చెప్పలేదంది. క్రీడాకారులు, ఎక్స్‌ సర్విస్‌మెన్, ఎన్‌సీసీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన వారికి అవకాశం ఇచ్చారని, వయో పరిమితిని సైతం సడలించారని గుర్తు చేసింది. వీరంతా వార్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు, బీకాం చదివిన వారూ అర్హులవుతారని హైకోర్టు  ధర్మాసనం తేల్చి చెప్పింది.

రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో అనర్హులుగా తేల్చిన అభ్యర్థులను ఆ పోస్టుకు అర్హులుగా పరిగణించాలని అధికారులను ఆదేశించింది. పిటిషనర్లను ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకుని, నియామకాలు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌ తదితరులతో కూడిన ధర్మాసనం గత వారం తీర్పు వెలువరించింది. 

విచారణ ద్వారా తేల్చాలన్న సింగిల్‌ జడ్జి 
వార్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ పోస్టుకు పురపాలక శాఖ 2019లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు బీకాం చదివిన వారూ దరఖాస్తు చేయగా, వారిని అధికారులు రాతపరీక్షకు అనుమతించారు. సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో బీకాం కోర్సు ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ విభాగం కిందకు రాదని, పోస్టుకు అర్హులు కారని అధికారులు తిరస్కరించారు. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారులకు పూర్తిస్థాయి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. దానిపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పింది.

అభ్యర్థులు పురపాలక శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించగా, దానిని తిరస్కరిస్తూ కమిషనర్‌ 2020లో ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. పిటిషనర్లు చదివిన బీకాం కోర్సు ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ కిందకు వస్తుందో లేదో తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.
చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ?

ఈ అప్పీళ్లపై జస్టిస్‌ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. అభ్యర్థుల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుదీర్‌ వాదనలు వినిపిస్తూ.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బీకాం ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ కిందకే వస్తుందని యూజీసీ సమాధానం ఇచ్చిందంటూ, ఆ వివరాలను కోర్టు ముందుంచా­రు. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు బీకాంను ఆర్ట్స్‌ విభాగం కింద పేర్కొంటూ ఇచ్చిన డిగ్రీ సర్టీఫికేట్లను ధర్మాసనం ముందుంచారు.

ప్రభుత్వ న్యా­యవాది వాదనలు వినిపిస్తూ, యూజీసీ 2014లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగానే నిర్ణ­యం తీసుకున్నామన్నారు. వార్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ పోస్టు అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిందని, కార్పొరేట్‌ అకౌంటింగ్‌ తదితర సబ్జెక్టులు ఈ పోస్టు కింద నిర్వర్తించే విధులకు సరిపోవన్నారు. అందువల్ల పురపాలక శాఖ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement