ప్రకాశం జిల్లా దొనకొండలో రచ్చ
సమావేశానికి రాకుండా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లనే అడ్డుకొని రసాభాస
బూచేపల్లికి అండగా భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రొటోకాల్ ప్రకారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డినే అడ్డుకొన్నారు. కార్యాలయం గేట్లు మూసేసి రసాభాస చేశారు. శుక్రవారం దొనకొండలో మండల పరిషత్ సర్వసభ్య ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. అధికారుల ఆహ్వానం మేరకు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అక్కడికి వచ్చారు.
పథకం ప్రకారం ముందుగానే అక్కడికి చేరుకున్న టీడీపీ నేతలు గేట్లు మూసివేసి వారిద్దరినీ అడ్డుకున్నారు. ఎంపీడీవో గేటువద్దకు వచ్చి వారిని లోపలికి పంపాలని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ మూకలు ఆయన్ని బెదిరించి లోపలకు పంపేశారు. బూచేపల్లిపై దాడి చేయడానికి టీడీపీ మూకలు రాళ్లు కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నాయి. ‘మా ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మీకేం పని’ అంటూ టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించారు. ఉద్రిక్తత సృష్టించారు. గంటన్నరకుపైగా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌ను గేటు బయటే నిలబెట్టారు. సీఐ సుబ్బారావు పోలీసు సిబ్బందితో వచ్చి వారిద్దరినీ లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయి పోలీసులను సైతం అసభ్య పదజాలంతో దూషించారు. జై చంద్రబాబు అని నినాదాలు చేస్తూ కార్యాలయంలో రాళ్లు పెట్టుకుని హంగామా సృష్టించారు. సీఐ సుబ్బారావు పోలీస్ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌ను లోనికి తీసుకెళ్లారు. వారు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment