
శ్రీకాకుళంలోని మహాలక్ష్మీనగర్ కాలనీలో పింఛన్ తీసుకుంటూ ఆనందంగా నవ్వుతున్న వృద్ధురాలు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: నూతన సంవత్సరాదిన పింఛన్ లబ్ధిదారుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పింఛన్ డబ్బుల పంపిణీ 25.11 లక్షల మంది లబ్దిదారులకు తొలిరోజే పూర్తయింది. ఇంతకు ముందు రూ.2,250 చొప్పున చెల్లించే పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచే కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వలంటీర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. జనవరి నెలలో 61,74,593 మంది లబ్ధిదారులకు రూ.1,570.06 కోట్ల మొత్తం పంపిణీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. శనివారం రాత్రి పది గంటల వరకు 25,11,909 మంది లబ్ధిదారులకు రూ.639.04 కోట్ల మొత్తాన్ని అందజేశారు. కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో అత్యధికంగా 50 శాతానికి పైగా పంపిణీ పూర్తయింది.
లబ్ధిదారులతో ఎమ్మెల్యేలు ముఖాముఖీ
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేలా అన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక టీవీలను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో జిల్లా ఇన్‌చార్జి, స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో పింఛన్ల పెంపు కార్యక్రమాలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లతో పాటు పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించారు. పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచిన సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు రాసిన లేఖ ప్రతులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.
పండుగలా పింఛన్ల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా కొనసాగింది. పింఛను రూ.2,500 అందుకోవడంతో అవ్వాతాతల ముఖాల్లో సంతోషం కన్పించింది. ఐదు రోజుల పాటు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించనున్నారు. పింఛన్ మొత్తాన్ని పెంచి, ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు ప్రశంసించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే సమర్థవంతమైన పాలన అందిస్తున్న దమ్మున్న నాయకుడిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలిచిపోతారని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment