సాక్షి, అమరావతి: మీ పిల్లల జనన ధ్రువీకరణ పత్రం ఇంకా తీసుకోలేదా.. తీసుకోవచ్చులే అనుకుంటున్నారా? అయితే మీరు ఇబ్బందుల్లో ఉన్నట్టే. మీకు కావాల్సినప్పుడు బర్త్ సర్టిఫికెట్ పొందాలనుకుంటే కొంత ప్రయాస పడక తప్పదు. పిల్లలు పుట్టిన 21 రోజుల్లోపు అయితే మీ ఊళ్లలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా జనన ధ్రువీకరణ పత్రం పొందొచ్చు. 21 రోజుల గడువు దాటితే.. చిన్నారి పుట్టిన 30 రోజుల వరకు ఆ గ్రామ పంచాయతీలోనే బర్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. అయితే దానికి పంచాయతీని బట్టి రూ.20 నుంచి రూ.100 పై వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
చిన్నారి పుట్టి 30 రోజులు దాటిపోతే..
ఇక పుట్టిన 30 రోజుల తర్వాత గ్రామ పంచాయతీలో బర్త్ సర్టిఫికెట్లు పొందాలంటే స్థానిక తహసీల్దార్ అనుమతి అవసరం. అంతేకాకుండా సర్టిఫికెట్ కోసం అదనపు ఆలస్య ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక పుట్టిన ఏడాది తర్వాత బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఎగ్జిక్యూటివ్ లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మాత్రమే గ్రామ పంచాయతీ కార్యదర్శులు బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆర్డీవో ఆపై మేజిస్ట్రేట్ స్థాయి అధికారులకు మాత్రమే ఈ అధికారాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment