సాక్షి, అమరావతి బ్యూరో, మాచర్ల ఆ గ్రామం అమరశిల్పులకు పుట్టినిల్లు. జీవంలేని బండరాళ్లను ఉలిదెబ్బతో గాయం చేసి.. జీవం పోసి.. అందమైన కళాకృతులుగా మలచడం ఆ గ్రామం శిల్పుల ప్రత్యేకత. రాజులు పోయినా, రాజ్యాలు కూలినా ఆనాటి శిల్పకళను మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు.. ఆ గ్రామానికి చెందిన శిల్పులు. ఖండాంతరాలు దాటి ఖ్యాతినార్జించిన ఆ గ్రామమే గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి. ఆ గ్రామంలో శాలివాహనులు, కాకతీయుల కాలం నాటి ప్రాచీన శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంది. ఆరు అంగుళాల నుంచి ఆరడుగులు, ఇంకా ఎత్తయిన శిల్పాలు చెక్కడంలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. దేవతామూర్తులు, బుద్ధుడు, రాధాకృష్ణులు, పల్లెపడుచుల విగ్రహాలను సజీవరూపం ఉట్టిపడేలా చెక్కుతారు.
క్రీ.శ 12వ శతాబ్దంలోనే ఆరంభం..
క్రీస్తుశకం 12వ శతాబ్దంలోనే దుర్గి శిల్ప కళకు బీజం పడింది. ఆచార్య నాగార్జునుడు పెందోట వాసి అని ప్రసిద్ధి. పెందోట నుంచి కొంతమంది శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారు. ప్రకృతి వైపరీత్యమో, శత్రువుల దాడుల కారణంగానో క్రీ.శ 11వ శతాబ్దంలో ద్వారకపురి నాశనం అయింది. ఈ క్రమంలో ద్వారకాపురి నుంచి వలస వచ్చిన కొందరు శిల్పులు ఓ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, శత్రువుల నుంచి రక్షణ కల్పించమని దుర్గా దేవి విగ్రహాన్ని ఒకటి చెక్కి అక్కడ ప్రతిష్టించారు. శిల్పులు ఆ ప్రాంతానికి ‘దుర్గి’గా నామకరణం చేశారు. అమరావతి, నాగార్జున కొండల్లోని బౌద్ధ స్తూపాలను దుర్గి కళాకారులే మలిచారని చరిత్రకారులు చెబుతుంటారు. విజయపురిసౌత్, నాగార్జున కొండకు వచ్చే దేశ, విదేశీ బౌద్ధ ఆరాధికులు దుర్గి గ్రామాన్ని సందర్శించి ఇక్కడి శిల్పులు మలచిన బౌద్ధ విగ్రహాలు కొని తీసుకెళ్తుంటారు. రాష్ట్రంలోని పలు నగరాల్లోని దేవాలయాలు, పార్కులు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో దుర్గి విగ్రహాలు ఠీవిగా నిలబడి దర్శనమిస్తుంటాయి.
ప్రస్తుతం 30 కుటుంబాలే...
దుర్గి శిల్ప కళ నానాటికి అంతరించిపోయే దిశగా అడుగులు వేస్తోందని ఇక్కడి శిల్పులు చెబుతున్నారు. 1960 నుంచి 2000 సంవత్సరాల మధ్య 300 మంది వరకూ శిల్పులు గ్రామంలో ఉండేవారు. కాల క్రమంలో వీరి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 30 కుటుంబాలు మాత్రమే గ్రామంలో శిల్ప కళా వృత్తిలో ఉన్నారు.
2017లో జియోగ్రాఫికల్ గుర్తింపు
దుర్గి శిల్పాలకు ఖండాంతర ఖ్యాతి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఇక్కడి విగ్రహాలు ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా ఇక్కడ మలిచే చిన్న చిన్న బుద్ధుడు, వినాయకుడు, రాధాకృష్ణుల విగ్రహాలకు దేశ విదేశాలలో ఎక్కువ గిరాకీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం బుద్ధవనానికి విగ్రహాలను అందించిన దుర్గి కళాకారుడు శ్రీనివాసరావును ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ సత్కరించారు. 2017లో దుర్గి శిల్పాలకు కేంద్రప్రభుత్వం జియోగ్రాఫికల్ గుర్తింపును అందజేసింది. గ్రామంలో నాగార్జున శిల్ప కళా శిక్షణ కేంద్రంతో పాటు, మరో నాలుగు శిల్ప తయారీ కేంద్రాలున్నాయి.
ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి..
దేశవ్యాప్తంగా దుర్గి కళలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా లభించే దుర్గి రాయి ద్వారా అద్భుతమైన శిలలను తయారు చేస్తాం. కరోనా కాలంలో రెండు సంవత్సరాలు పనులు లేక ఇబ్బంది పడ్డాం. 30 కుటుంబాలున్న మాకు ప్రభుత్వం చేయూతనిచ్చి శిల్ప కళలను ప్రోత్సహించాలి.
– చెన్నుపాటి శ్రీనివాసాచారి, నాగార్జున శిల్ప కళా కేంద్రం నిర్వాహకుడు, దుర్గి
Comments
Please login to add a commentAdd a comment