2018లో పోస్టు పెడితే ఇప్పుడు అరెస్టా? | - | Sakshi
Sakshi News home page

2018లో పోస్టు పెడితే ఇప్పుడు అరెస్టా?

Published Wed, Nov 6 2024 2:24 AM | Last Updated on Wed, Nov 6 2024 1:54 PM

-

వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌నుభయపెట్టడానికే కేసులు 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు

 ఆ క్రమంలోనే వల్లభాపురం రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డి అరెస్టు

 అది చాలదన్నట్టు తెనాలిలోనూ మరో కేసు దారుణం

 జగదీష్‌రెడ్డికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తాం 

తెనాలి వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌

తెనాలి: సోషల్‌ మీడియాలో పవన్‌కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌లను 2018లో విమర్శిస్తూ పెట్టిన పోస్టును షేరింగ్‌ చేసిన కారణంతో వల్లభాపురానికి చెందిన రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేయటం దారుణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. దాంతోపాటు తెనాలి పోలీసులు మరో కేసును నమోదు చేయడం తగదని చెప్పారు.

 స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించారు. జగదీష్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని, కేసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కొల్లిపర మండల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన ఆళ్ల జగదీష్‌రెడ్డిని విజయవాడ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. పోలీసులు విడుదల చేయటంతో ఇంటికొచ్చిన జగదీష్‌రెడ్డిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌ పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అక్కడే మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సోషల్‌మీడియా కార్యకర్తలపై కేసులతో భయభ్రాంతుల్ని చేయటాన్ని పెద్ద ఎత్తున ఇలా చేస్తున్నారని గుర్తుచేశారు. ఆ క్రమంలోనే జగదీష్‌రెడ్డిని తెల్లవారుజామున ఇంటికొచ్చి మరీ తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎవరు తీసుకెళ్లిందీ తెలీక, ఆ కుటుంబంతోపాటు గ్రామస్తులంతా ఆందోళన చెందారని తెలిపారు. తీరా చూస్తే సైబర్‌క్రైం పోలీసులని తెలిసిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు... ఈ రోజు అధికారం వచ్చిందనే గర్వంతో తమ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా నియోజకవర్గంలో ఏనాడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. 

‘మీరు చూపిస్తున్న కొత్తమార్గాన్ని భవిష్యత్‌లో మేమూ అనుసరిస్తాం’ అంటూ కూటమి నేతలను శివకుమార్‌ హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీని, క్యాడర్‌ను బెదిరించే ధోరణులను మానుకోవాలని, నాదెండ్ల మనోహర్‌ ఇప్పటికై నా దీనిపై ఆలోచన చేయాలని కోరారు. పార్టీ కొల్లిపర మండల కన్వీనర్‌ అవుతు పోతిరెడ్డి మాట్లాడుతూ.. జగదీష్‌రెడ్డిని ఎవరో తీసుకెళ్లారని తెలిసిన దగ్గర్నుంచి మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌ మనోధైర్యం కల్పిస్తూ వచ్చారని చెప్పారు. పార్టీ క్యాడర్‌కు ఏ చిన్న ఆపద వచ్చినా పార్టీ యంత్రాంగం, లీగల్‌సెల్‌ సహకరిస్తుందని పేర్కొంటూ ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ధైర్యంగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement