durgi
-
ఖండాంతరాలు దాటిన ‘దుర్గి’ ఖ్యాతి
సాక్షి, అమరావతి బ్యూరో, మాచర్ల ఆ గ్రామం అమరశిల్పులకు పుట్టినిల్లు. జీవంలేని బండరాళ్లను ఉలిదెబ్బతో గాయం చేసి.. జీవం పోసి.. అందమైన కళాకృతులుగా మలచడం ఆ గ్రామం శిల్పుల ప్రత్యేకత. రాజులు పోయినా, రాజ్యాలు కూలినా ఆనాటి శిల్పకళను మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు.. ఆ గ్రామానికి చెందిన శిల్పులు. ఖండాంతరాలు దాటి ఖ్యాతినార్జించిన ఆ గ్రామమే గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి. ఆ గ్రామంలో శాలివాహనులు, కాకతీయుల కాలం నాటి ప్రాచీన శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంది. ఆరు అంగుళాల నుంచి ఆరడుగులు, ఇంకా ఎత్తయిన శిల్పాలు చెక్కడంలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. దేవతామూర్తులు, బుద్ధుడు, రాధాకృష్ణులు, పల్లెపడుచుల విగ్రహాలను సజీవరూపం ఉట్టిపడేలా చెక్కుతారు. క్రీ.శ 12వ శతాబ్దంలోనే ఆరంభం.. క్రీస్తుశకం 12వ శతాబ్దంలోనే దుర్గి శిల్ప కళకు బీజం పడింది. ఆచార్య నాగార్జునుడు పెందోట వాసి అని ప్రసిద్ధి. పెందోట నుంచి కొంతమంది శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారు. ప్రకృతి వైపరీత్యమో, శత్రువుల దాడుల కారణంగానో క్రీ.శ 11వ శతాబ్దంలో ద్వారకపురి నాశనం అయింది. ఈ క్రమంలో ద్వారకాపురి నుంచి వలస వచ్చిన కొందరు శిల్పులు ఓ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, శత్రువుల నుంచి రక్షణ కల్పించమని దుర్గా దేవి విగ్రహాన్ని ఒకటి చెక్కి అక్కడ ప్రతిష్టించారు. శిల్పులు ఆ ప్రాంతానికి ‘దుర్గి’గా నామకరణం చేశారు. అమరావతి, నాగార్జున కొండల్లోని బౌద్ధ స్తూపాలను దుర్గి కళాకారులే మలిచారని చరిత్రకారులు చెబుతుంటారు. విజయపురిసౌత్, నాగార్జున కొండకు వచ్చే దేశ, విదేశీ బౌద్ధ ఆరాధికులు దుర్గి గ్రామాన్ని సందర్శించి ఇక్కడి శిల్పులు మలచిన బౌద్ధ విగ్రహాలు కొని తీసుకెళ్తుంటారు. రాష్ట్రంలోని పలు నగరాల్లోని దేవాలయాలు, పార్కులు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో దుర్గి విగ్రహాలు ఠీవిగా నిలబడి దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం 30 కుటుంబాలే... దుర్గి శిల్ప కళ నానాటికి అంతరించిపోయే దిశగా అడుగులు వేస్తోందని ఇక్కడి శిల్పులు చెబుతున్నారు. 1960 నుంచి 2000 సంవత్సరాల మధ్య 300 మంది వరకూ శిల్పులు గ్రామంలో ఉండేవారు. కాల క్రమంలో వీరి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 30 కుటుంబాలు మాత్రమే గ్రామంలో శిల్ప కళా వృత్తిలో ఉన్నారు. 2017లో జియోగ్రాఫికల్ గుర్తింపు దుర్గి శిల్పాలకు ఖండాంతర ఖ్యాతి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఇక్కడి విగ్రహాలు ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా ఇక్కడ మలిచే చిన్న చిన్న బుద్ధుడు, వినాయకుడు, రాధాకృష్ణుల విగ్రహాలకు దేశ విదేశాలలో ఎక్కువ గిరాకీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం బుద్ధవనానికి విగ్రహాలను అందించిన దుర్గి కళాకారుడు శ్రీనివాసరావును ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ సత్కరించారు. 2017లో దుర్గి శిల్పాలకు కేంద్రప్రభుత్వం జియోగ్రాఫికల్ గుర్తింపును అందజేసింది. గ్రామంలో నాగార్జున శిల్ప కళా శిక్షణ కేంద్రంతో పాటు, మరో నాలుగు శిల్ప తయారీ కేంద్రాలున్నాయి. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.. దేశవ్యాప్తంగా దుర్గి కళలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా లభించే దుర్గి రాయి ద్వారా అద్భుతమైన శిలలను తయారు చేస్తాం. కరోనా కాలంలో రెండు సంవత్సరాలు పనులు లేక ఇబ్బంది పడ్డాం. 30 కుటుంబాలున్న మాకు ప్రభుత్వం చేయూతనిచ్చి శిల్ప కళలను ప్రోత్సహించాలి. – చెన్నుపాటి శ్రీనివాసాచారి, నాగార్జున శిల్ప కళా కేంద్రం నిర్వాహకుడు, దుర్గి -
అబ్బురం.. దుర్గి హస్త కళావైభవం
సాక్షి, గుంటూరు/మాచర్ల: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు’ అని సినీ కవి రాసిన పాటకు నిలువుటద్దంలా నిలుస్తున్నారు.. ఈ శిల్పకారులు. దేవ శిల్పి.. మయుడిని కూడా వీరు మరిపించగల నేర్పరులంటే అతిశయోక్తి కాదు. ఏ ఆకృతి లేని బండరాళ్లను తమ అద్భుత నైపుణ్యంతో సజీవశిల్పాలుగా మలిచే శిల్పకారులకు నెలవు.. దుర్గి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం ఉలితో అద్భుత శిల్పాలను చెక్కే శిల్పకారులకు నిలయంగా భాసిల్లుతోంది. దుర్గిలో అడుగుపెడితే.. శాలివాహనులు, కాకతీయుల కాలం నాటి ప్రాచీన శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంటోంది. ఇక్కడ ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు, అవసరమైతే ఇంకా ఎత్తయిన శిల్పాలను చెక్కడంలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. వీరు రూపొందించే వివిధ దేవతామూర్తులు, బుద్ధుడు, రాధాకృష్ణులు, పల్లె పడుచుల విగ్రహాల్లో కళా నైపుణ్యం తొణికిసలాడుతుంటోంది. 12వ శతాబ్దంలోనే బీజం.. దుర్గి శిల్ప కళకు క్రీ.శ.12వ శతాబ్దంలోనే బీజం పడింది. ఆచార్య నాగార్జునుడు పెందోట వాసి అని ఐతిహ్యం. పెందోట నుంచి కొంతమంది శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారు. ప్రకృతి వైపరీత్యమో, శత్రువుల దాడుల కారణంగానో 11వ శతాబ్దంలో ద్వారకాపురి కాలగర్భంలో కలిసిపోయింది. ఈ క్రమంలో ద్వారకాపురి నుంచి వలస వచ్చిన కొందరు శిల్పులు ఓ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఆ ప్రాంతానికి ‘దుర్గి’గా నామకరణం చేశారు. 15వ శతాబ్దం నాటికి దుర్గిలో 300 మంది శిల్పులు ఉండేవారని తెలుస్తోంది. అమరావతి, నాగార్జునకొండల్లోని బౌద్ధ స్థూపాలను దుర్గి కళాకారులే మలిచారని చరిత్రకారులు చెబుతుంటారు. విజయపురి సౌత్, నాగార్జునకొండకు వచ్చే బౌద్ధులు దుర్గి గ్రామాన్ని సందర్శించి.. ఇక్కడి శిల్పులు మలచిన బౌద్ధ విగ్రహాలను కొని తీసుకెళ్తుంటారు. విదేశాలకు ఎగుమతి కనుమరుగవుతున్న దుర్గి శిల్పకళను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో 1962లో అప్పటి ప్రభుత్వం దుర్గిలో శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రం ద్వారా వందల మంది శిల్ప కళలో శిక్షణ పొంది తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో రాణిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఇక్కడి విగ్రహాలు ఎగుమతి అవుతున్నాయి. 1984లో హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల ప్రదర్శనలో దుర్గి శిల్పులు చెక్కిన వాటిని మెచ్చుకున్న అప్పటి సీఎం ఎన్టీ రామారావు తర్వాత దుర్గిని సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దేవాలయానికి దశావతరాల విగ్రహాలను దుర్గి శిల్పకారులే అందించారు. తెలంగాణలోని బుద్ధ వనానికి విగ్రహాలను అందించిన దుర్గి కళాకారుడు శ్రీనివాసరావును ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ సత్కరించారు. 2017లో దుర్గి శిల్పాలకు భారత ప్రభుత్వం ఇచ్చే జియోగ్రాఫికల్ గుర్తింపు లభించింది. ఇక్కడ మలిచే లైమ్ హార్డ్ రాయి విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. అరుదైన ఈ రాయి దుర్గి గ్రామంలోనే ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ క్వారీలోనే లభిస్తుందని శిల్పులు చెబుతున్నారు. ప్రస్తుతం 15 కుటుంబాలే.. దుర్గి శిల్పకళ నానాటికి అంతరించిపోయే దిశగా అడుగులు వేస్తోందని ఇక్కడి శిల్పులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 300 కుటుంబాలు శిల్పకళలో ఉండగా ఇప్పుడు 15 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 2004కు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే శిల్పకళా శిక్షణా కార్యక్రమం కూడా ఆగిపోవడంతో కొత్తవారు రావడం లేదు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి కరోనా వైరస్ ప్రభావం శిల్పకళా రంగంపై కూడా పడింది. పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఉత్పత్తులు సరిగా అమ్ముడుపోవడం లేదు. శుభకార్యాల సీజన్లో చిన్న విగ్రహాలకు డిమాండ్ ఉండేది. గతంతో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ పడిపోయింది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తయారు చేసిన విగ్రహాలు అలానే ఉండిపోయాయి. మాకు కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి. – చెన్నుపాటి శ్రీనివాసాచారి, నాగార్జున శిల్ప కళా కేంద్రం నిర్వాహకుడు, దుర్గి వృత్తిపై మక్కువతోనే.. రెండేళ్ల క్రితం నేను బీటెక్ పూర్తి చేశాను. మా కుటుంబం మొత్తం ఈ రంగంలోనే రాణిస్తోంది. మా కుటుంబంలో నేను నాలుగో తరం శిల్పకారుడిని. వృత్తిపై మక్కువతో ఇందులో రాణిస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో 150 మంది శిల్పులు పాల్గొనగా నేను రన్నరప్‌గా నిలిచాను. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరికొందరు యువకులు ఈ రంగంలో రాణించడానికి ముందుకొస్తారు. – సాయి వినయ్, యువ శిల్పకారుడు, దుర్గి -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
దుర్గి: గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివారం జరిగింది. శనివారం సాయంత్రం నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వెళ్లాలని అడిగొప్పల చేరుకుని ఆటోలు లేకపోవటంతో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బస చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆ వృద్ధుడు మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న దుర్గి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. వృద్ధుడి వయసు సుమారు 75 సంవత్సరాలు ఉండవచ్చని, తెల్లపంచ, తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. అతని వద్ద సంచిలో దుప్పటి, కండువా, జేబులో బస్సు టికెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వృద్ధుడు నర్సరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాలకు చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఎడ్లబండ లాగుడు పోటీలు ప్రారంభం
దుర్గి: మండలంలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం శ్రీహరిహర బాలనాగేంద్రస్వామి వార్షిక మహోత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ఎడ్లబండలాగుడు పోటీలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పోటీలలో సేద్యపు విభాగంలో 14 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని, రానున్న జగనన్న పాలనలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు కొత్తా వెంకటేశ్వర్లు, అరిగెల ఏడుకొండలు, గుండా వెంకటేశ్వర్లు, యరబోతుల శ్రీనివాసరావు, నల్ల వెంకటరెడ్డి, వెలిదండి గోపాల్, మొగిలి బాలశ్రీను, అడిగొప్పల చిన్నబ్బాయి, కర్నాటి సుబ్బారావు, బసవయ్యగారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో మహిళ మృతదేహం
దుర్గి (గుంటూరు) : నాగార్జున సాగర్ కుడి కాలువలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎన్ఎస్పీ కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిందా.. లేక ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దుర్గిలో ఆటో బోల్తా..ఒకరి మృతి
దుర్గి: గుంటూరు జిల్లా దుర్గి మండల సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ప్రమాదవశాత్తూ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అడిగొప్పుల గ్రామానికి చెందిన బస్సు వెంకటేశ్వర్లు(58) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో దుర్గి నుంచి అడిగొప్పుల వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చితకబాది చంపేశారు!
నిజామాబాద్: బిక్నూరు మండలం దుర్గిలో ఓ దారుణం జరిగిపోయింది. దొంగ అనే నెపంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాది చంపేశారు. షేక్ సలీం అనే వ్యక్తిని దొంగ అనే నెపంతో గ్రామస్తులు అతనిపై దాడి చేశారు. చితకబాదడంతో అతను మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. **