
బ్లడ్ డోనర్ వ్యాన్స్‌ను జెండా ఊపి ప్రారంభిస్తున్న గవర్నర్ హరిచందన్
సాక్షి, అమరావతి: ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్‌ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భారత రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏపీ శాఖకు సమకూర్చిన రక్తదాతల శకటాలను (బ్లడ్ డోనర్ వ్యాన్స్)ను విజయవాడ రాజ్‌భవన్ నుంచి గవర్నర్ జెండా ఊపి శనివారం ప్రారంభించారు.
ఒక కరోనా పరీక్ష శకటంతో సహా ఐదు రక్తదాతల వాహనాలను సేవకు అంకితం చేశారు. వీటిని విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు నగరాల్లో అందుబాటులో ఉంచనున్నారు. గవర్నర్ మాట్లాడుతూ ఎక్కడ దాతలు సిద్ధంగా ఉంటే అక్కడికే వెళ్లి రక్తసేకరణ చేస్తున్నారని.. ఇందుకోసం 18004251234లో సంప్రదించవచ్చన్నారు. రెడ్‌క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజల అభిమానం మరువలేనిది
ఏపీ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది. ఏపీ గవర్నర్‌గా పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందగలనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.