
సాక్షి, విజయవాడ : రక్తదానంపై యువకులు, విద్యార్థులు మరింత స్పూర్తి నింపుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లయోలా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం వల్ల ఎంతో ప్రాణాలను రక్షించగలుతామన్నారు. పెద్దమొత్తంలో విద్యార్థులు తరలివచ్చి రక్త దానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జరుతుందని ప్రశంసించారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటుందని కొనియాడారు. రక్తదానంపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. సమానత్వం సాధించేలా యువత కృషి చేయాలని సూచించారు.