సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, దీనిపై అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రక్తదానం అంటే జీవన దానమే అని స్పష్టం చేశారు. కృత్రిమ శ్వాస పరిజ్ఞానం (సీపీఆర్) పట్ల ప్రజల్లో విస్తృత అవగావన కల్పించాలన్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సొసై టీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె 50సార్లకుపైగా రక్తదానం చేసిన దాతలు, అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను టీసీఎస్, ఎస్‌బీఐ స్టాఫ్ కళాశాల, ఉస్మానియావర్సిటీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ, నిజామాబాద్ యూనిట్లు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను పొందడాన్ని అభినందిస్తూ ఇందుకు కృషి చేసిన స్థానిక ప్రతినిధులు డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్, బుస్సా అంజన్నకు సైతం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 139 సార్లు రక్తదానం చేసిన అంజయ్య, 50 సార్లు రక్తదానం చేసిన అతడి భార్య పి.మనోరమతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు కుర్రె సిద్ధార్‌్థ, శ్రీలేఖ, మరో పీజీ వైద్య విద్యార్థిని ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ తెలంగాణ చైర్మన్ అజయ్‌మిశ్రా, వైస్ చైర్మన్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలి
రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో ఎన్‌ఐఆర్‌డీ, పీఆర్ సీనియర్ అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటివనరుల మ్యాపింగ్‌తోపాటు వాటి నిర్వహణ, పునరుజ్జీవనానికి ప్రాధాన్యతతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కష్టసాధ్యంగా మారుతున్నందున ప్రపంచస్థాయిలో ప్రత్యేకంగా ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశలో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment