![Born Baby Found On Road Side Dustbin In Narasannapeta Srikakulam - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/22/Born-Baby.jpg.webp?itok=C2WyqGgb)
ప్రతీకాత్మక చిత్రం
నరసన్నపేట: ఆ లేలేత కళ్లతో తల్లిని చూసిందో లేదో..? ఆ చిట్టి చేతులతో తండ్రిని తాకిందో లేదో..? పుట్టాక చనుబాలైనా తాగిందో లేదో..? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి తుప్పల్లోకి చేరిందో పసిపాప. అప్పుడే పుట్టింది కదా.. అమ్మను విసిగించి ఉండదు. తొమ్మిది నెలలు గర్భంలోనే ఉంది కదా.. నాన్న మనసు కష్టపెట్టే ప్రసక్తే లేదు. అసలు తాను ఆడపిల్లనని కూడా తనకు తెలిసి ఉండదు. మరేం నేరం చేసిందని.. పాపకు ఇంత శిక్ష విధించారు ఆ తల్లిదండ్రులు...? నరసన్నపేట–జలుమూరు మండలాల బోర్డర్ కంబకాయ సమీపంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన బుధవారం ఓ పసిపాప తుప్పల్లో స్థానికులకు దొరికింది.
వివరాల్లోకి వెళితే.. కంబకాయ రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం స్థానికులు సూర్యనారాయణ, బసివాడకు చెందిన యూత్ స్టార్ సభ్యులు సాయిమణికంఠ, తేజ, కృష్ణలు రన్నింగ్ చేస్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ పసి బిడ్డ ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే అప్పుడే పుట్టిన ఆడ శిశువు రక్త కారుతూ కనిపించింది. వెంటనే వారు బిడ్డను బయటకు తీసి అదే రోడ్డుపై వెళ్తున్న మహిళల సాయంతో సపర్యలు చేశారు. వేకువజామున ఎవరో వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. శిశువుకు సపర్యలు చేశాక వెంటనే ఆటోలో నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. సకాలంలో స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఆ శిశువుకు సపర్యలు చేశారు. సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్‌ఐ వి.సత్యనారాయణ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు వచ్చి బిడ్డను పరిశీలించారు. ఊపిరి పీల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతుండటంతో మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది బాలరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment