Botsa Satyanarayana On Andhra Pradesh Capital Decentralization - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: వికేంద్రీకరణే మా విధానం

Published Fri, Mar 4 2022 3:07 AM | Last Updated on Fri, Mar 4 2022 10:25 AM

Botsa Satyanarayana On Andhra Pradesh Capital Decentralization - Sakshi

సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. నూటికి నూరుపాళ్లు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, అడ్డంకులన్నీ అధిగమించి వికేంద్రీకరణ చేసి తీరుతామని ఆయన తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదేనని పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ఉద్ఘాటించారు.

రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలని.. రాజధాని ఫలాలు అందరూ అనుభవించాలని చెప్పారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని.. మూడు రాజధానులపై గురువారం హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరంలేదని.. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకెళ్తామని బొత్స స్పష్టంచేశారు. పరిపాలన వికేంద్రీకరణపై తాము అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామన్నారు.  

ఆ కమిటీ సూచనలు పట్టించుకోలేదేం?
పునర్విభజన చట్టం ప్రకారం ఓ కమిటీ వేశారని.. కానీ, గత ప్రభుత్వం ఆ కమిటీ సూచనలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని.. అలాగే, నారాయణ కమిటీ నిర్ణయాన్ని ఎందుకు అనుసరించారని మంత్రి బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కదా హిమాచల్‌ ప్రదేశ్‌లో రెండు, మూడు రాజధానులు పెడుతున్నారని ఆయన చెప్పారు. సమయం, ఖర్చు, నిధులు అనే మూడు అంశాలపై రాజధాని నిర్మాణం ముడిపడి ఉందని, వీటిపై చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. 

అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లు తెస్తాం
ఇక న్యాయస్థానం చెప్పినట్లుగా.. సీఆర్‌డీఏ చట్టంలో ఉన్నట్లుగా.. ల్యాండ్‌ పూలింగ్‌లో రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను అభివృద్ధిచేసి ఇస్తామని అసెంబ్లీలోనే చెప్పామని, దానికి తామేమీ వ్యతిరేకం కాదని బొత్స స్పష్టంచేశారు. కాకపోతే అది మూడు నెలలకు అవుతుందా? ఆరు నెలలకు అవుతుందా? అనే దానిపై సాధ్యాసాధ్యాలను ఆలోచించుకుని అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ఆయన వివరించారు. న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించి అడ్డంకులన్నీ తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తీసుకొస్తామని బొత్స చెప్పారు.

న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ చట్టం అమల్లో ఉందని, అలాగే.. అమరావతి భూములను చంద్రబాబు హయాంలోనే హడ్కోకు తనఖా పెట్టారని.. ఇప్పుడేమీ కొత్తగా జరిగింది కాదని ఆయన గుర్తుచేశారు. ఇక రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇస్తామన్నవి అనీ7ఏ్న ఇస్తున్నాం కదా? మధ్యలో ఎవరికి క్షమాపణ చెప్పాలని పచ్చమీడియా ప్రశ్నకు మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో మీరు చూస్తారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement