
సాక్షి, అమరావతి: టిడ్కో గృహాల లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్ల పంపిణీ, బ్యాంకు రుణాల మంజూరు విషయంలో అలసత్వం వహించొద్దని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
లబ్ధిదారులు బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తులకు, మంజూరైన రుణాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అధిగమించేందుకు అధికారులు బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా రుణాలు విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. టిడ్కో చైర్మన్ జె.ప్రసన్న కుమార్, ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఉన్నతాధికారులతో పాటు జిల్లాల్లోని బ్యాంకుల సమన్వయకర్తలు పాల్గొన్నారు.