మెట్రో రైల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా విశాఖలో లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదివారం మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు డీపీఆర్, కారిడార్లలో మార్పులు చేర్పులపై అధికారులు మంత్రులకు వీడియో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
మెట్రో ప్రాజెక్టు పీపీపీ విధానంలోనా, ప్రభుత్వమే నేరుగా చేపడుతుందా అనే విషయంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నవంబర్ రెండోవారంలో లైట్‌మెట్రో, డిసెంబర్ రెండోవారంలో మోడరన్ ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌లను యూఎంటీసీ కన్సల్టెంట్ సంస్థ ఇవ్వనుందని చెప్పారు. ముందుగా చేపట్టే లైట్‌మెట్రో ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభమై మార్చి నాటికి పూర్తవుతుందన్నారు. నాలుగు కారిడార్లలో 75.31 కిలోమీటర్ల మేర 52 స్టేషన్లు ఏర్పాటు చేసేలా మొదటి విడత ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని చెప్పారు.
విభజన చట్టంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు అంశం ఉన్న నేపథ్యంలో నిధుల గురించి కేంద్రాన్ని అడుగుతామని తెలిపారు. కేంద్ర సహకారం అందినా, అందకపోయినా.. మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటిదశలో స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, వీఎంఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment