
గ్రామంలోని పాఠశాలను పరిశీలిస్తున్న మలీష
నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లో పేదవారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని బ్రెజిల్‌కు చెందిన సోషల్ సర్వీస్ బృందం ప్రతినిధి మలీష చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి పరిస్థితి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బ్రెజిల్‌కు చెందిన ఈ బృందం గురువారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామానికి వచ్చింది.
మలీష తదితరులు సహాయకుడు జయరాజు, కేడీసీసీబీ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయం, గ్రామీణ బ్యాంకులు, జగనన్న లేఅవుట్‌లో నిర్మిస్తున్న ఇళ్లు, ,గ్రామంలో ప్రజలు నివసిస్తున్న తీరు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి పరిస్థితులపై అధ్యయనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రెజిల్‌లో ఉచితంగా స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించే పద్ధతి లేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందడం అభినందనీయమన్నారు. పేదవారి అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అడిగి తెలుసుకొని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment