బాధితుడు జమాల్‌బాషా, భార్య పర్వీన్
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మలసత్రం సమీపంలో ఉన్న ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికుడు జమాల్‌బాషాను ఫ్యాక్టరీ యాజమాన్యం ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
బాధితుడు జమాల్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన అతను కొన్నేళ్లుగా ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. కార్మికులకు యాజమాన్యం అక్కడే భోజనాలు పెడతారు. జమాల్‌బాషా తనకు పరిచయం ఉన్న బియ్యం వ్యాపారితో ఫ్యాక్టరీకి బియ్యం సరఫరా చేయిస్తున్నాడు. బియ్యం వ్యాపారి నుంచి జమాల్‌బాషా కమీషన్ తీసుకుంటున్నట్లు అనుమానించి ఫ్యాక్టరీ మేనేజర్ శేషిరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ మహేశ్వరరెడ్డిలు గత శుక్రవారం దాడి చేశారు. ఫ్యాక్టరీలోని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
విషయం తెలుసుకున్న భార్య పర్వీన్ ఫ్యాక్టరీ ఎండీ సుజల వద్దకు వెళ్లి తన భర్తను విడిచి పెట్టాలని కోరింది. రూ.15 లక్షలు చెల్లిస్తేనే విడిపిస్తామని చెప్పడంతో పర్వీన్ బంధువుల సహాయంతో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు జమాల్‌ను విడిపించి కారకులపై కేసు నమోదు చేయాలని నంద్యాల జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి జమాల్‌బాషాను విడిపించారు. బాధితుని ఫిర్యాదు మేరకు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు.
చదవండి: (అస్వస్థతతో వైఎస్సార్‌సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment