సాక్షి,అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది.
► కేంద్ర బడ్జెట్‌లో విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం విస్మయం కలిగిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు జోన్‌కు సంబంధించిన డిమాండ్‌ను గట్టిగా వినిపించారు.
► రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. అయినప్పటికీ పెద్దగా కేటాయింపులు లేవు. పూర్తి వివరాలతో బ్లూ బుక్ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులకే ఏ మేరకు నిధులు కేటాయించారన్నది స్పష్టం కాదు.
► వాస్తవానికి 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది.
► కానీ గత రెండు బడ్జెట్‌లలోనూ రైల్వే జోన్‌పై కేంద్రం మొండిచేయి చూపించింది. గత బడ్జెట్‌లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది. ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే ప్రయోజనాలకు పెద్దపీట వేసింది.
► రైల్వే శాఖ ద్వంద్వ వైఖరి రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. కొత్త రైల్వే జోన్‌లు ఏర్పాటు చేసే ఉద్దేశంలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
► ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినందున విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం రాష్ట్రానికి కాస్త ఊరట నిచ్చింది. అయినప్పటికి మరోసారి మోసపూరిత వైఖరే అవలంబించింది.
Comments
Please login to add a commentAdd a comment