
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ)లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆమెతో సమావేశమైన మంత్రి బుగ్గన పోలవరంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. భావితరాలకు మంచి చదువులు, ఉపాధి కల్పన, సాంకేతిక అభివృద్ధికి కళాశాలలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ రెండు విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో చర్చించానన్నారు. విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఆన్‌రాక్ అల్యూమినియం కంపెనీ వివాదానికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న ఆర్బిట్రేషన్ కేసుపైనా ఆమెతో చర్చించానన్నారు. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే ఓ పెద్ద సంస్థ రాష్ట్రానికి వస్తుందన్నారు. పోలవరం నిధుల విడుదల పురోగతిలో ఉందని వివరించారు.
టీడీపీ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బ తీస్తోంది
టీడీపీ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బ తీస్తోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. దీని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం పాడైపోయినా ఫర్వాలేదు.. తమకు రాజకీయ లబ్ధి కలిగితే చాలనే ధోరణిలో టీడీపీ ఉందన్నారు. కరోనా కష్టకాలంలోనూ పేదలను కాపాడటం కోసం అప్పులు చేస్తుంటే అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ దుర్మార్గానికి టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కరోనా వంటి మహమ్మారి లేకపోయినా టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు చేశారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment