
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తాము సమర్థిస్తున్నామని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. అయితే అవి పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు లోబడి పనిచేయాలని పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు వంటి ప్రజావ్యతిరేక విధానాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థికభారం మోపుతోందని విమర్శించారు.
ప్రజలపై పడే భారం గురించి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా సమర్థించేరీతిలో వ్యవహరిస్తోందని చెప్పారు. సంఘ్ పరివార్ శక్తులను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నించటంలేదని, మౌనంగా ఉంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోందని, విద్యుత్తు ప్లాంట్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని చెప్పారు. నరేంద్రమోదీ పాలనతో బీజేపీ ప్రజల నుంచి వేరుపడిందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మత ఘర్షణలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment