Interstate Bus Services, AP And TG Cancelation of Transport Services - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు రద్దు

Published Sat, May 8 2021 4:04 AM | Last Updated on Sat, May 8 2021 10:45 AM

Cancellation of RTC interstate services - Sakshi

సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ రాకముందు రోజుకు 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించేది. కానీ, ప్రస్తుతం రోజుకు 3,000 షెడ్యూళ్లే నిర్వహిస్తోంది. అంటే కేవలం 30 శాతం సర్వీసులనే కొనసాగిస్తోంది. వీటిలో కూడా గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతిస్తోంది.

కరోనా ఉధృతితో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రయాణాలను విరమించుకుంటున్నారు. దాంతో బస్సుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదు. దీనికితోడు తాజాగా 1,450 అంతర్రాష్ట్ర సర్వీసులను పూర్తిగా రద్దు చేయడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడనుంది. సాధారణ రోజుల్లో ఆర్టీసీకి టిక్కెట్ల ద్వారా రోజుకు సగటున రూ.15 కోట్లు ఆదాయం వచ్చేది. కరోనా రెండో వేవ్‌ ఉధృతి పెరిగాక రోజువారి ఆదాయం రూ.7 కోట్లకు పడిపోయింది. ఇక కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రావడంతో రోజువారీ ఆదాయం కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే వస్తోంది. మే అంతా దాదాపు ఇలానే ఉంటుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప ఆర్టీసీ ఆదాయం మళ్లీ గాడిన పడే అవకాశాల్లేవని అధికారులు చెబుతున్నారు. 

కర్ఫ్యూలోనూ పార్సిల్‌ సేవలు
కర్ఫ్యూ పరిస్థితుల్లోనూ పార్సిల్‌ సర్వీసులు నిరం తరాయంగా కొనసాగేలా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం డెడికేటెడ్‌ కారిడార్‌ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు హైదరాబా ద్‌ను అనుసంధానిస్తూ రోజుకు 9 ప్రత్యేక పార్సిల్‌ సర్వీసులను నిర్వహిస్తోంది.
► గుంటూరు–విశాఖపట్నం, తిరుపతి–విజయవాడ, అనంతపురం–విజయవాడ మధ్య రెండేసి పార్సిల్‌ సర్వీసులు నిర్వహిస్తోంది. రోజూ అటు వైపు నుంచి ఒక బస్సు, ఇటువైపు నుంచి ఒక బస్సు నడుస్తుంది. 
► రాజమండ్రి–హైదరాబాద్, గుంటూరు–విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–అనంతపురం మధ్య ఒక్కో పార్సిల్‌ సర్వీసు నిర్వహిస్తున్నారు. 
► విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పార్సిళ్లను ప్రయాణికుల బస్సుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చేరవేస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌ను అనుసంధా నిస్తూ పార్సిల్‌ సేవలు అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement