తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు | Cancellation Of Traditional Meal Program In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు

Published Mon, Aug 30 2021 9:33 AM | Last Updated on Mon, Aug 30 2021 9:52 AM

Cancellation Of Traditional Meal Program In Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: సంప్రదాయ భోజనంపై సోషల్‌ మీడియాలో‌ దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనాన్ని నేటి నుండి నిలిపి వేస్తున్నామని తెలిపారు.

తిరుమలలో ఏ ఆహారమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందువలనే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం‌ తీసుకున్నట్లు ఆయన వివరించారు. సోషల్‌ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. భక్తులు నమ్మొద్దని ఆయన కోరారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

టీటీడీలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గుడికో గోమాత, గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నవనీత సేవ లాంటి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి నైవేద్యం, కైంకర్యాలకు కావాల్సిన పదార్ధాలు సాంప్రదాయ బద్ధంగా గోవు నుండి పాలు,నెయ్యి, వెన్నను సేకరించి స్వామి వారికి అందింస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వ దర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement