సాక్షి, విశాఖపట్నం: గుండెకు నిబ్బరాన్నిచ్చే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ హృద్రోగులకు వారి పరిస్థితిని బట్టి స్టెంట్లు వేస్తున్నారు. అందుకు వీలుకాని పరిస్థితి ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సర్జరీకి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. పైగా వారం, 10 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీలు రోగికి నొప్పితోపాటు వైద్యులకు ప్రయాసతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో తాజాగా పర్క్యూటనస్ వ్యాడ్స్ (వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైసెస్) వాల్వ్ రీప్లేస్‌మెంట్ విధానం అందుబాటులోకి వచ్చిందని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు ప్రసాద్ చలసాని తెలిపారు.
విశాఖపట్నంలో ఏఏఐపీ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. గుండెపోటుకు గురైన వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చిన్నపాటి సర్జరీ ద్వారా ఈ వాల్వులను రీప్లేస్ చేస్తారన్నారు. హృద్రోగికి ఈ వాల్వుల అమరిక కేవలం అర గంట నుంచి గంటలోపే వైద్యులు పూర్తి చేస్తారని చెప్పారు. ఈ శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోపే రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చన్నారు. దీని సక్సెస్ రేటు 99.9 శాతం ఉందని తెలిపారు. అమెరికాలో పర్క్యూటనస్ వ్యాడ్ వాల్వుల వినియోగం జరుగుతోందని, భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ విధానం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఇప్పటివరకు విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లో అతి కొద్దిమందికి మాత్రమే వీటిని అమర్చారన్నారు. ఇందుకయ్యే ఖర్చు రూ.20 లక్షల వరకు ఉందని, అందువల్ల ప్రస్తుతానికి సామాన్యులకు భారమేనన్నారు. మున్ముందు ఖర్చు తగ్గే అవకాశముందని తెలిపారు. 35 ఏళ్లు దాటిన వారెవరైనా హైకొలె్రస్టాల్, మధుమేహం, రక్తపోటు, కాల్షియం, పరీక్షలను విధిగా చేయించుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’
Comments
Please login to add a commentAdd a comment