open heart surgery
-
తల్లడిల్లిన తల్లి గుండెకు ఊరట.. సీఎం జగన్ సత్వర స్పందన
ఆరిలోవ (విశాఖ తూర్పు): పసి వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడంతోపాటు తండ్రిని కోల్పోయి హృద్రోగం బారినపడ్డ ఓ బాలుడి వ్యథ తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరిలోవలోని శ్రీకాంత్నగర్కు చెందిన వానపల్లి పార్వతి కుమారుడు వానపల్లి చరణ్‌సాయి మణికంఠ(12)కు మూడేళ్ల వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి శస్త్ర చికిత్స అవసరమని, అందుకు రూ.8 లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయారు. అపోలో క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంబోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా పెదగదిలి కూడలి వద్ద ‘నా కుమారుడిని రక్షించండి జగనన్నా..’ అంటూ కేకలు వేసింది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ తన కారు ఆపి విషయం తెలుసుకుని చలించిపోయారు. తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఆదేశించారు. జేసీ విశ్వనాథన్, రూరల్ తహశీల్దారు పి.రమణయ్య సాయంత్రం బాలుడి ఇంటికి వెళ్లి తక్షణం సాయంగా రూ.లక్ష చెక్కు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాలుడికి వైద్య సాయం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దేవుడిలా తన కుమారుడిని కాపాడేందుకు వచ్చారని బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మంత్రి గుడివాడ అమర్నా«థ్‌కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. -
ఇకపై ఓపెన్ హార్ట్ సర్జరీల అవసరం లేదు
సాక్షి, విశాఖపట్నం: గుండెకు నిబ్బరాన్నిచ్చే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ హృద్రోగులకు వారి పరిస్థితిని బట్టి స్టెంట్లు వేస్తున్నారు. అందుకు వీలుకాని పరిస్థితి ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సర్జరీకి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. పైగా వారం, 10 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీలు రోగికి నొప్పితోపాటు వైద్యులకు ప్రయాసతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో తాజాగా పర్క్యూటనస్ వ్యాడ్స్ (వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైసెస్) వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం అందుబాటులోకి వచ్చిందని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు ప్రసాద్ చలసాని తెలిపారు. విశాఖపట్నంలో ఏఏఐపీ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. గుండెపోటుకు గురైన వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చిన్నపాటి సర్జరీ ద్వారా ఈ వాల్వులను రీప్లేస్ చేస్తారన్నారు. హృద్రోగికి ఈ వాల్వుల అమరిక కేవలం అర గంట నుంచి గంటలోపే వైద్యులు పూర్తి చేస్తారని చెప్పారు. ఈ శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోపే రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చన్నారు. దీని సక్సెస్ రేటు 99.9 శాతం ఉందని తెలిపారు. అమెరికాలో పర్క్యూటనస్ వ్యాడ్ వాల్వుల వినియోగం జరుగుతోందని, భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ విధానం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఇప్పటివరకు విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లో అతి కొద్దిమందికి మాత్రమే వీటిని అమర్చారన్నారు. ఇందుకయ్యే ఖర్చు రూ.20 లక్షల వరకు ఉందని, అందువల్ల ప్రస్తుతానికి సామాన్యులకు భారమేనన్నారు. మున్ముందు ఖర్చు తగ్గే అవకాశముందని తెలిపారు. 35 ఏళ్లు దాటిన వారెవరైనా హైకొలె్రస్టాల్, మధుమేహం, రక్తపోటు, కాల్షియం, పరీక్షలను విధిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదీ చదవండి: ‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’ -
మంత్రి విశ్వరూప్‌కు గుండె శస్త్రచికిత్స విజయవంతం
అమలాపురం టౌన్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆయనకు గుండెలో ఆరు చోట్ల వాల్వులు బ్లాక్ అయ్యాయి. దీంతో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ శస్త్రచికిత్స జరిగిందని మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి తెలిపారు. మంత్రి శస్త్రచికిత్స విజయవంతం కావాలని.. ఆయన తొందరగా కోలుకోవాలని అమలాపురం నియోజకవర్గంతో పాటు కోనసీమలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పార్టీ నాయకులు, అభిమానులు మోటార్ సైకిళ్ల ర్యాలీగా వెళ్లి పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మసీదులు, చర్చిలో ఆయా మత పెద్దలతో ప్రార్థనలు చేయించారు. -
సగం గుండెతో జన్మించిన చిన్నారి.. పుట్టిన నాలుగో రోజు నుంచే మూడు ఓపెన్ సర్జరీలు
న్యూయార్క్: అమెరికాలో ఐదేళ్ల చిన్నారి అరుదైన వ్యాధితో పోరాడుతోంది. ఆ చిన్నారి పుట్టుకతోనే సగం గుండెతో జన్మించింది. ఆ చిట్టితల్లి పేరు కేథరీన్ లాంగే. ఆమె హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్‌తో జన్మించింది. ఈ గుండె లోపం కారణంగా ఆ చిన్నారికి గుండె ఎడమ భాగం అభివృద్ధి చెందదు. పాపం ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ఆమెకు నయమవుతుందేమోనన్న ఆశతో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అరుదైన వ్యాధిని ఆ చిన్నారి తల్లి 20 వారాల గర్భవతిగా ఉన్నప్పుడే గుర్తించారు వైద్యులు. ఈ విషయాన్ని వైద్యులు ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు కూడా. పైగా మెక్సికోలో ఈ అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స చేసే వైద్యులు కూడా లేరని కొలరాడోకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఆ చిన్నారి పుట్టిన నాలుగు రోజునే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత నాలుగు నెలల వయసులో మరోకటి, రెండున్నర ఏళ్లలో మరొక ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అంతేకాదు ఆ చిన్నారికి దాదాపు 10 హార్ట్ కాథెటరైజేషన్లు(గుండె కొట్టుకునేలా చేసే డివైజ్‌లు) జరిగాయి. కేవలం గత 12 నెలల్లో 40 సార్లుకు పైగా రక్తం తీశారు. ఇప్పడూ 11వ హార్ట్ కాథెటరైజేషన్ ప్రక్రియకు సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి గుండె జబ్బుతో పాటు, లివర్ లీకేజ్‌తో బాధపడుతోంది. దీన్ని ప్రోటీన్ లాసింగ్ ఎంట్రోపతి అని పిలుస్తారు. ఐతే ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ఆ చిన్నారి బతుకుందనే ఆశతో ఉన్నారు. ఒకవేళ వైద్యుల ప్రయత్నాలు విఫలమైతే ప్రత్యక్ష గుండె మార్పిడి చేయాల్సి ఉంటుందని అన్నారు. (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం.. మంటల్లో సైతం ఎగిరి..) -
చిన్నారి శ్రీయాన్కి ఎంత కష్టమో !
మా ఆయన పేరు రాజు. వ్యవసాయం చేసే వాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలో బాగానే బతికే చింత లేని చిన్న కుటుంబం మాది. మా సంతోషాన్ని రెట్టింపు చేయడానికా అన్నట్టుగా వచ్చాడు శ్రీయాన్. ముద్దులొలికే శ్రీయాన్ మా ముద్దుల కొడుకు శ్రీయాన్. వాడి బోసినవ్వులతో మా ఇంట ఆనందాలు వెల్లివిరిసేవి. శ్రీయాన్ ఆలనాపాలన చూడటంతోనే నాకు రోజు గడిచిపోయేది. అయితే ఉన్నట్టుండి శ్రీయాన్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం గమనించాను. శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడే వాడు. నెలల పసిబిడ్డకు ఎందుకిలా జరుగుతుందా అనుకునే లోపే ఒక్కసారిగా బిడ్డ నీరసించిపోవడం మొదలైంది. నా గుండెలో దడ మొదలైంది. నేను నా భర్త రాజు బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. గుండె పగిలింది ఆ యేడు వ్యవసాయంలో వచ్చిన సొమ్ములతో హైదరాబాద్ చేరుకున్నాం. పెద్ద డాక్టర్లను కలిశాం. మా బిడ్డకు అంతా మంచి జరుగుతుందనే అనుకున్నాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ఏడాది కూడా నిండని నా బిడ్డకు లార్జ్ మస్కులర్ వెంట్రిక్యూలర్ సెప్టికల్ డిఫెక్ట్ అని చెప్పారు. అర్థం కాలేదు సార్ అడిగితే నీ బిడ్డ గుండెకు రంధ్రం ఉందంటూ చెప్పారు. ఓపెన్ హర్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. ఆ ఆపరేషన్‌కి రూ,.6,00,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఆపరేషన్ చేయకుంటే బతుకు గండమే అన్నారు. మొదటి పుట్టిన రోజు జరుపుకోవడం కూడా కష్టమే అన్నారు. సాయం చేయండి ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకుంటే గడిచే ఇళ్లు మాది. శ్రీయానే ఇప్పుడు మా ప్రపంచం కానీ. వాడి ఆరోగ్యం బాగాలేదు. వాడు లేకపోతే మాకు బతుకు లేదు. కానీ వాడి ఆపరేషన్‌కి అవసరమైన డబ్బులు మా దగ్గర లేదు. అప్పుడే మెడికల్ ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోను సంప్రదించాం. మా బిడ్డ ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు సమకూరాలని ఆ దేవుళ్లని మొక్కుకుంటున్నాను. మీరు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి -
ఉన్నట్టుండి ఎందుకు కళ్లు తిరిగి పడిపోతున్నాను
నా వయసు 49 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోవడం కూడా జరిగింది. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒక డాక్టర్‌ను సంప్రదించి, బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు ఎందుకిలా జరుగుతోంది? తగిన సలహా ఇవ్వండి. మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. సర్జరీ తర్వాత నుంచి మాట సరిగా రావడం లేదు నాకు ఈమధ్యనే గుండెకు సంబంధించిన ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. అప్పట్నుంచి నాకు మాట సరిగా రావడం లేదు. ఎంత ప్రయత్నించినా స్వరం పెగలడం లేదు. మాట కూడా ఏదో గాలి బయటకు వస్తున్నట్లుగా వస్తోంది. అంతకముందు నాకు ఎప్పుడూ గొంతుకు సంబంధించిన సమస్యలు లేవు. అంతేకాదు... ఇప్పుడు తినేటప్పుడు, తాగేటప్పుడు, మింగే సమయంలో ఇబ్బందిగా ఉంది. గొంతుకు ఏదో అడ్డు పడినట్లుగా ఉంది. పరిష్కారం చెప్పండి. మీ సమస్యకు సంబంధించిన వివరాలు పరిశీలించాక మీకు స్వరపేటికలోని ఒక భాగం అయిన ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్ హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్‌లో కొన్నిసార్లు వోకల్ఫోల్డ్కు ఒత్తిడి తగలడం లేదా అది దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువ. మీకు కూడా అలాగే జరిగినట్లుగా అనిపిస్తోంది. దీని వల్ల మీరు చెప్పిన విధంగానే మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు వోకల్ ఫోల్డ్ పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి మొదట మీరు అనుభవజ్ఞులైన ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించండి. మీకు అవసరాన్ని బట్టి లారింగోస్కోపీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అంతుకాకుండా మీరు స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించి అవసరమైన ఎక్సర్సైజ్లు కూడా ప్రాక్టీస్ చేయాలి. వోకల్ నాడ్యూల్స్ ఎందుకొస్తాయి... పరిష్కారం చెప్పండి నేను వృత్తిరీత్యా టీచర్‌గా పనిచేస్తున్నాను. ఇంటికి వచ్చాక కూడా ట్యూషన్స్ ఎక్కువగా చెబుతుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్ నాడ్యుల్స్’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి. నాకు తగిన పరిష్కారం చెప్పండి. వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించేవారిలో అత్యధికుల్లో వచ్చే సమస్య వోకల్ నాడ్యూల్స్. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్థభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దాని వల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్‌లను కలవండి. మీ నాడ్యూల్స్ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
సూపర్ స్టార్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ
లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ సూపర్ స్టార్ అర్నాల్డ్ స్క్వాజ్నెగ్గర్కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లు.. ఆయన స్పృహలోకి వచ్చినట్లు వ్యక్తిగత సిబ్బంది మీడియాకు వెల్లడించారు. కాగా, 70 ఏళ్ల ఆర్నాల్డ్‌కు గతంలో కూడా ఓసారి గుండెకు శస్త్ర చికిత్స అయ్యింది. 1997లో గుండెకు సంబంధించిన ఓ కృత్రిమ నాళాన్ని డాక్టర్లు అమర్చారు. అయితే అది సరిగ్గా పని చేయకపోవటంతో ఇప్పుడు మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది. గురువారం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఐయామ్ బ్యాక్.. ఆపరేషన్ తర్వాత స్పృహలోకి వచ్చిన దిగ్గజ నటుడు ‘ఐ యామ్ బ్యాక్’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రతినిధి మీడియాకు విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కెనన్ ది బార్బేరియన్, ప్రేడేటర్, టెర్మినేటర్ తదితర చిత్రాలతో ఆర్నాల్డ్ సుపరిచితుడే. కాగా, గతంలో రెండు సార్లు ఆయన కాల్నిఫోరియాకు గవర్నర్‌గా కూడా పని చేశారు. -
పెళ్లి చేస్తేనే ఆపరేషన్ చేయించుకుంటా!
ఈ ఫొటోలోని పాప పేరు సోఫియా.. వయసు ఐదేళ్లు.. ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ ఎంతో అందంగా ఉన్న ఈ సోఫియా వెనుక ఓ కన్నీటి కథ దాగి ఉంది. ఐదేళ్ల వయసులో అందరు చిన్నపిల్లల్లా ఆడుకోవాల్సిన ఈ పాప హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పుట్టుకతోనే జన్యు పరంగా సోఫియాకు ఈ వ్యాధి వచ్చింది. సోఫియా పుట్టగానే రెండేళ్లు కంటే ఎక్కువ కాలం బతకదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అయినా ఇప్పటికీ∙జీవితంతో పోరాడుతూ ఆస్పత్రిలో ఉంటోంది. ఇప్పటికే మూడుసార్లు్ల సోఫియాకు శస్త్రచికిత్సలు జరిగాయి. ఇటీవలే సోఫియాకు మరోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. కానీ అంతకన్నా ముందే పాప తన తల్లిదండ్రులను ఒక విచిత్రమైన కోరిక కోరింది. తన ప్రియ స్నేహితుడైన హంటర్‌ను పెళ్లి చేసుకోవాలని ముద్దుముద్దు మాటలతో తల్లిదండ్రులకు తన కోరికను వెళ్లబుచ్చింది. పాప అడగడమే ఆలస్యం తన కోసం ఏమైనా చేసే తల్లిదండ్రులు హంటర్ పేరెంట్స్‌తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి సందర్భంగా చేసిన ఫొటోషూట్‌లో తీసిందే ఈ ఫొటో. సోఫియా పెళ్లి కోరిక తీరడంతో ఇక తదుపరి శస్త్రచికిత్సపై వైద్యులు దృష్టిపెట్టారు. జీవితంతో పోరాడుతూ ముందుకు సాగుతున్న సోఫియా ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసుకుని చక్కగా అందరి పిల్లల్లా బడికెళ్లాలని కోరుకుందాం!! -
పాక్ మహిళకు సుష్మాస్వరాజ్ అభయం
సాక్షి, న్యూఢిల్లీ : తనకు సాయం చేయాలన్న ఓ పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తికి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఆమె కోరినట్లుగా వీసా మంజూరు చేస్తామని సుష్మా ట్వీట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. నిదా షోయబ్ అనే పాకిస్తాన్ మహిళకు ఏడేళ్ల కూతురు ఉంది. ఆ చిన్నారికి గుండె సంబంధిత సమస్యలున్నాయి. తమ చిన్నారికి భారత్‌లో ట్రీట్మెంట్ ఇప్పించాలని పాక్ మహిళ నిదా షోయబ్ అనుకున్నారు. ఆ మేరకు భారత్ వచ్చేందుకు వీసా కోసం ఆమె గత ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పిటికీ తమ వీసా మంజూరు కాలేదని, ప్రాసెస్‌లోనే ఉందని కేంద్ర మంత్రి సుష్మాకు ట్వీట్లో తెలిపారు. ఆ విషయంపై స్పందించిన సుష్మాస్వరాజ్.. పాక్ మహిళకు అన్ని విధాలా సాయం చేస్తామన్నారు. 'మీ ఏడేళ్ల పాపకు ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించవచ్చు. మీకు వీసా మంజూరు చేస్తాం. మీ పాప త్వరగా కోలుకోవాలని మేం కూడా ప్రార్థిస్తామంటూ' ఆమె రీట్వీట్ చేశారు. Yes, we are allowing Visa for your 7 years old daughter's open heart surgery in India. We also pray for her early recovery. https://t.co/bFmUXriQCC — Sushma Swaraj (@SushmaSwaraj) 27 September 2017 respected @SushmaSwaraj mam my daughter need open heart surgery i aplied in aug stil the visa is in process pls help us i m very thankful u — nida shoaib (@nidashoaib1) 25 September 2017 -
తీవ్ర భావోద్వేగానికి లోనైన ఒబామా
వాషింగ్టన్ : తన కూతురును కాలేజీ చదువు నిమిత్తం ఇంటినుంచి పంపిస్తున్నప్పుడు తనకు డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నట్లుగా అనిపించిందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బ్యూ బిడెన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద కూతురు మలియా ఒబామాను ఇటీవల ఉన్నతచదువుల నిమిత్తం హార్వర్డ్‌కు పంపాను. యూనివర్సిటీలో తనను చేర్పించి తిరిగొచ్చే సమయంలో తనకు బై చెబుతుంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారన్న ఫీలింగ్ కలిగింది. తండ్రులు అందరికీ అలాగే ఉంటుదని భావిస్తున్నాను. మలియాకు తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. ఆ సమయంలో కూతురి ముందు కన్నీరు పెట్టుకోలేదు. నా కూతుళ్లు మలియా, సాశా నాకు మంచి స్నేహితులు. వారిలో ఒకరు నానుంచి కాస్త దూరంగా వెళ్లిపోతున్నారు. కానీ నాకు ఎందుకో చాలా దిగులుగా ఉంది. అయితే కొంతకాలం తర్వాత మా జీవితంలో వారే సంతోషం నింపుతారన్న నమ్మకం ఉందని' ఒబామా పేర్కొన్నారు. గతంలో చికాగోలో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. మీకు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ మలియా, సాశాలనుద్దేశించి చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఒబామా ఓ సాధారణ తండ్రిగా వ్యవహరించి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు -
‘బికినీ కిల్లర్’కు ఓపెన్‌హార్ట్ సర్జరీ
ఖాట్మండూ: అంతర్జాతీయ నేరస్తుడు ఛార్లెస్ శోభరాజ్‌కు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయించేందుకు నేపాల్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వివిధ నేరాల కింద గత పన్నెండేళ్లుగా అతడు ఖాట్మండూ శివారులో ఉన్న సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. శోభరాజ్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యుల బృందం పరీక్షలు జరిపి ఆపరేషన్ అవసరమని స్పష్టం చేసింది. ఖాట్మండూలోని షాహిద్ గంగాలాల్ ఆస్పత్రిలో అతడికి సోమవారం చికిత్స చేయనున్నారు. ఇందుకు అయ్యే ఖర్చునంతా నేపాలీ ప్రభుత్వం భరించనుందని వైద్యులు తెలిపారు. భారత, వియత్నాం దంపతులకు పుట్టిన ఛార్లెస్ శోభరాజ్(73) ఫ్రెంచి పౌరుడు. బికినీ కిల్లర్‌గా గుర్తింపు పొందిన 1970 దశకంలో ఇతడు సుమారు 20 మందిని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. 1975లో జరిగిన అమెరికా దేశస్థురాలు కోనీ జో బ్రొన్జిక్ హత్య కేసులో ఖాట్మండూ జైలులో 2003 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. నేపాల్ జీవిత ఖైదు 20 ఏళ్లు ఉంటుంది. ఇతడిపై మరిన్ని కేసులుండటంతో ఖైదు ముగిసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతడికి స్వేచ్ఛ లభించే అవకాశాలు లేవు. ఇతడి చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది విదేశీ యాత్రికులే కావటం గమనార్హం. -
గౌరిగోపాల్‌లో వంద ఓపెన్ హార్ట్ సర్జరీలు
కర్నూలు(జిల్లా పరిషత్): నగరంలోని గౌరి గోపాల్ హాస్పిటల్లో వంద ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి చైర్మన్ టి.జి.భరత్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ పీఎన్ఎన్ లక్ష్మణస్వామితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్డియాలజీ విభాగం ప్రారంభించిన 8 నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో 60 బైపాస్ సర్జరీలు, 31 వాల్వ్/గుండె కవాటానికి సంబంధించిన ఆపరేషన్లు, 8 పుట్టుకతో గుండెజబ్బు వచ్చిన వారికి ఆపరేషన్లు, ఒకరికి గుండెలో కణితి(మిక్సోమా)కి సంబంధించిన ఆపరేషన్లు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా ప్రమాదాల్లో రక్తనాళాలు తెగిపోయిన 8 మందికి చికిత్స చేశామన్నారు. రక్తనాళాలు బ్లాక్ అయి కాలు, చేతిలో రక్తప్రసరణ లేక నొప్పి ఉన్న వారికి మరో ఆరుగురికి విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. కిడ్నీ ఫెయిల్ అయిన వారికి ఏవీ ఫిస్టులా ఆపరేషన్లు 150 జరిగాయన్నారు. అదేవిధంగా టీబీ జబ్బు వల్ల ఊపిరితిత్తులు పాడైన 5గురికి, ఊపిరితిత్తుల్లో హైడాటెడ్ లాగ్ ఉన్న ఇద్దరికి విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. సిరలలో జబ్బు(డీవీటీ/వెరికోస్ వీన్స్) ఉన్న 50 మందికి వైద్యం చేశామన్నారు. ఇక కేథలాబ్‌లో 780 మందికి యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించామని, అందులో 300 మందికి స్టెంట్స్ వేశామని వివరించారు. 14 మందికి కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉన్న వారికి పేస్‌మేకర్ వేశామన్నారు. టీబీతో గుండెచుట్టూ చెడు నీరు చేరిన వారికి పిగ్‌టైల్ క్యాథటర్ ద్వారా వైద్యం చేశామన్నారు. ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ), ఉద్యోగశ్రీ రోగులకు లాభాపేక్ష లేకుండా ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ ఆంథోనిరెడ్డి మాట్లాడుతూ 1991లో ఆసుపత్రి ఏర్పాటైందని.. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్, బెంగళూరు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక టెక్నాలజితో కూడిన క్యాథల్యాబ్‌లో 300 స్టెంట్స్, 770 యాంజియోగ్రామ్‌లు, 14 పర్మినెంట్ పేస్మేకర్లు అమర్చినట్లు చెప్పారు. గుండెపోటు వచ్చిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వెంటనే ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ మాలకొండయ్య, అనెస్తెటిస్ట్ డాక్టర్ అజయ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ మహ్మద్ అలి పాల్గొన్నారు. -
ఇక బైపాస్ సర్జరీకి బై బై!
గుండె రంధ్రాలకు మాసికతో అతుకు: పరిశోధనలో శాస్త్రవేత్తల విజయం ♦ ప్రత్యేక కాథెటర్ ద్వారా ఐదు నిమిషాల్లో చికిత్స పూర్తి ♦ ఓపెన్ హార్ట్ సర్జరీ, గుండెకు కుట్లు అవసరమే లేదు వాషింగ్టన్: గుండెలో రంధ్రాలను నయం చేయటానికి గుండెను తెరిచి శస్త్రచికిత్స (బైపాస్ సర్జరీ) చేసే అవసరం లేకుండా.. అతుకువేయటం ద్వారా వాటిని మూసివేసే ప్రత్యేక కాథెటర్ (నాళిక)ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీలోని విస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయొలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్, బ్రిఘామ్లోని కార్ప్ ల్యాబ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ సంస్థలకు చెందిన పరిశోధకులు.. జంతువులపై పరిశోధనల్లో గుండె రంధ్రాలను అతుకు ద్వారా మూసివేయటానికి ఈ కాథెటర్‌ను విజయవంతంగా వినియోగించారు. బైపాస్ సర్జరీ అవసరం లేకుండా గుండె రంధ్రాలకు ఈ అతుకు వేయటం కోసం అల్ట్రా వయొలెట్ వెలుగు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. మెడ లేదా, తొడ లోని ఏదైనా నరం ద్వా రా.. గుండెలో రంధ్రం ఉన్న ప్రాంతాని కి ఈ కాథెటర్ సాయంతో మాసికను పంపిస్తారు. సరిగ్గా రంధ్రం ఉన్న ప్రాంతానికి మాసిక చేరుకోగానే.. కాథెటర్‌కు ఇరువైపులా ఉన్న బుడగలు విచ్చుకునేలా చేస్తా రు. ఒక బుడగ గుండెరంధ్రం లోపలి వైపు కు, మరొక బుడగ గుండె గోడ వెలుపలి వైపుకు విచ్చుకుని మాసిక కదలకుండా ఉం డేలా చేస్తుంది. అప్పుడు కేథటర్లో యూవీ వెలుతురును వెలిగిస్తారు. ఈ వెలుతురు దాని బుడగల్లో ప్రతిఫలించి మాసికపై ఉన్న జిగురు పొరను క్రియాశీలం చేస్తుంది. ఈ జిగురు వల్ల మాసిక అక్కడ అతుక్కుంటూ ఉండగా.. కేథటర్కు ఉన్న బుడగల ఒత్తిడితో అది రంధ్రాన్ని మూసివేస్తూ సరైన స్థానంలో నిలిచిపోతుంది. ఆ తర్వాత రెండు బుడగలనూ ఆర్పివేసి.. కేథటర్‌ను వెనక్కు తీసివేస్తారు. కాలం గడిచేకొద్దీ.. ఈ మాసిక చుట్టూ, దానిపైనా మామూలు గుండె కణజాలం పెరిగి రంధ్రం దానికదే మూసుకుపోతుంది. మాసిక ఇక తన అవసరం లేదన్నపుడు గుండె కణజాలంలోనే కరిగిపోతుంది. ఈ విధానం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకపోగా గుండెకు కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు. -
‘మ్యాక్స్‌కేర్’లో విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ
హన్మకొండ చౌరస్తా : వరంగల్ జిల్లాలో మొదటిసారిగా హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఓపెన్‌హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ చైర్మన్ కె.కరుణాకర్‌రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ జి.రమేష్ తెలిపారు. ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీ వివరాలను వారు వెల్లడించారు. మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులోకి వచ్చిన మొదటి వారంలో స్టంట్స్‌ను అమర్చామని, అనంతరం రెండు నెలల్లోనే గుండె జబ్బుతో ఆస్ప త్రిలో అడ్మిట్ అయిన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన మణిమోహన్ చక్రవర్తికి విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ సంతోష్ మంథాని... గుండె వ్యాధిగ్రస్తుడైన చక్రవర్తికి అన్ని రకాల పరీక్షలు చేసి గుండెకు రక్తం సరఫరా చేసే మూడు రక్తనాళాలు మూసుకుని ఉన్నట్లు గుర్తించారని వెల్లడించారు. దీనికి ‘కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ’ అవసరమని నిర్ధారించిన డాక్టర్ సంతోష్ మంథాని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారన్నారు. హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలోని మ్యాక్స్కేర్లో గుండె శస్త్ర చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యరంగంలో పేద ప్రజలకు మరింత సేవలందించాలని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సర్జరీ నిర్వహించామన్నారు. నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకందించడమే తమ లక్ష్యమన్నా రు. సమావేశంలో ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు లక్ష్మీనారాయణ, విజయ్‌కుమార్, అనిల్‌రెడ్డి, మ్యాక్స్‌కేర్ ఆస్పత్రి డెరైక్టర్లు డాక్టర్లు మహేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కె.రమేష్, రాజీవ్‌రంజన్, సుమన్, టి.మోహన్‌రావు, గుండె వైద్య నిపుణులు డాక్టర్లు వెంకన్న, దినేష్ పాల్గొన్నారు. -
చిగురించిన ఆశలు సూపర్ వైద్యం
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇటీవల నర్సీపట్నంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలపై ఇచ్చిన మాట జిల్లాలోని పేద రోగుల్లో ఆశలు చిగురింపజేసింది. పేదలకు మెరుగైన వైద్య సేవలందుతాయన్న భావన ఆ యన మాటల్లో బలీయంగా వినిపిం చింది. కొండంత భరోసా నింపింది. జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలు వైద్య వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఈ సందర్భం గా కేజీహెచ్‌లోని సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలపై ఒకసారి సాక్షి ఫోకస్..కేజీహెచ్‌లో 10 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలున్నాయి. నేటికీ అవి సింగిల్ యూనిట్లుగా నీరసించిపోతున్నాయి. ఉత్తరాం ధ్ర జిల్లాల రోగులకు స్పెషాలిటీ వైద్య అవసరాలకు తగ్గా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది లేరు. సదుపాయాలు, పరికరాలు లేవు. దీంతో సూపర్ స్పెషాలిటీ వైద్య లక్ష్యం నెరవేరలేదు. కార్డియాలజీ విభాగంలోని మూడుయూనిట్లలోనూ కార్డియాలజిస్టుల కొరత వెంటాడుతోంది. ఫలితంగా రె ండే పనిచేస్తున్నాయి. గతంలో ఉన్న ఐదుగురు వైద్యులను తొలగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. కీలకమైన ఓపెన్ హార్ట్ సర్జరీలు నిర్వహించే కార్డియో థొరాసిక్ విభాగంలో విభాగాధిపతి మాత్రమే ఉన్నారు. అర్హులైన సర్జన్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఈ విభాగం మిస్మ్యాచ్లకు నిలయమైంది. న్యూరోసర్జరీ విభాగం కూడా సింగిల్ యూనిట్‌తో నడుస్తోంది. తల, వెన్నుగాయాలపాలైన క్షతగాత్రులకు సరైన చికిత్సలు అందించలేని స్థితిలో నడుస్తోంది. నిత్యం ఇక్కడ పడకలకు డిమాండ్ ఉంటోంది. పడకలు చాలక ఫ్లోర్బెడ్పై రోగులను ఉంచి చికిత్సలు చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. నెఫ్రాలజీ ఇన్చార్జి అధిపతి పాలనలో నడుస్తోంది. ఉస్మానియా, కేజీహెచ్‌లకు ఒకే అధిపతిని నియమించడం వల్ల కిడ్నీ రోగుల వైద్యానికి తీవ్ర అసౌకర్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయాయి. బర్న్స్ వార్డులో సదుపాయాలు, పరికరాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చుకున్న కేసులకు సైతం ఉన్న సదుపాయాలతోనే చికిత్సలు అందించడం దయనీయంగా ఉందని రోగులు వాపోతున్నారు. వైఎస్ చొరవతో.. టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తొలుత కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, మరుసటి రోజే సీఎం పదవి కోల్పోయారు. ఆయన స్థానంలో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం వైపు కన్నెత్తి చూడలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవ తీసుకుని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణానికి తొలి విడతగా రూ.10 కోట్లు మంజూరు చేశారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి రోశయ్యతో శంకుస్థాపన చేయించి స్పెషాలిటీ వైద్యానికి పునాది వేశారు. రెండు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయింది. మరో రెండు ఫ్లోర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మహానేత వైఎస్ మరణం తర్వాత దీని అభివృద్ధిని పట్టించుకొనే వారే కరువయ్యారు. దీంతో భవనాలున్నా ఇక్కడ పరికరాల లేమి, అరకొర వైద్య సిబ్బందితో కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడం అంత సులభం కాదనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఉత్తరాంధ్ర రోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. జగన్ అధికారంలోకి రాగానే తమకు వైద్య సేవలందుతాయని నిరుపేద రోగులు ముక్త కంఠంతో చెబుతున్నారు. కేజీహెచ్‌లో సూపర్‌స్పెషాలిటీ బ్లాకులకు మంచిరోజులొస్తున్నాయనే సంతోషం అందరిలోనూ వ్యక్తమవుతోంది.