సాక్షి, కోవెలకుంట్ల (కర్నూలు): మాంసంలో ఎముక రుచి..పుంటికూర(గోంగూర)లో పుడక రుచి అన్నారు పెద్దలు.. సామెత సంగతేమోగాని ఆదివారం వచ్చిందంటే కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. బంధువులు వచ్చినారనో..చిన్నోడు కలవరిస్తున్నాడనో..ఇంట్లో బాలింత ఉందనో..బలం రావాలనో.. ఏదో సాకు చూపి కూరాకు (మాంసం) తెచ్చుకునే వారు ఎక్కువే. జిల్లా జనాభా 44 లక్షలకు పైగా ఉంటే అందులో 70 శాతం మంది మాంస ప్రియులే. వీరిలో చికెన్ తినేవారు కొద్ది మంది అయితే.. మటన్ లాగించేవారు మరికొంత మంది. ధర ప్రియం అయినా చాలా మంది మటన్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి ఆదివారం జిల్లాలో 40 టన్నుల వినియోగం ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కిలో రూ.600 నుంచి రూ. 800 లెక్కన రూ.3 కోట్ల మటన్‌ను జిల్లా వాసులు ఆరగించేస్తున్నారు అన్నమాట.
జిహ్వకో రుచి..
తలకూర, రాగి సంకటిని ఇష్టపడే వారు కొందరైతే..జొన్న రొట్టె, బోటీ రుచి అమోఘం అనే వారు మరికొందరు. కైమాతో వేపుడు చేసుకొని కమ్మగా లాగించేవారు ఇంకొందరు. ఎవరి రుచులు ఎలా ఉన్నా..దేవనకొండ మండలం ఈదులదేవరబండలో చీకులకు సాటిరావు అనే వారు కూడా ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే కోసిగి, గాజులదిన్నె, సుంకేసుల ప్రాంతాల్లోనూ కడ్డీ మాంసం నిప్పులపై వేగుతూ మాంసప్రియులను ఊరిస్తూ ఉంటుంది. ఆదోనిలో అల్పాహారంగా ‘పాయ’ ప్రత్యేకంగా నిలుస్తోంది.
కోవెలకుంట్లలో మటన్ విక్రయిస్తున్న దృశ్యం
ధర అధికమైనా..
సంపూర్ణ పోషక విలువలు, సంతృప్తికరమైన రుచి రెండూ ఒకేదాంట్లో దొరికే తక్కువ పదార్ధాల్లో ఒకటైన మటన్‌ను మాంసం ప్రియులు ఎంతోగానో ఇష్టపడుతున్నారు. ధర అధికమైనా కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.800 అమ్ముతుండగా పల్లె ప్రాంతాల్లో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు.
ఎన్‌ఆర్‌సీఎం ధ్రువీకరణ
జిల్లాలోని పొట్టేళ్ల మాంసం రుచికరంగా ఉంటుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. జిల్లాలో నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌన్ అనే రెండు రకాల పొట్టేళ్లు పెంచుతుంటారు. సారవంతమైన నేలల్లో మొలిచే గడ్డిని మేయడంతో వీటి మాంసం రుచికరంగా ఉంటుంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం(ఎన్‌ఆర్‌సీఎం) ధ్రువీకరించింది.
ప్రత్యేక సంతలు..
జిల్లాలో 25.90 లక్షల మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఆదోని, డోన్, ఆలూరు, మంత్రాలయం, సంజామల, శిరివెళ్ల, కొలిమిగుండ్ల, రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు ప్రాంతాల్లో గొర్రెల పెంపకం దారులు అధికంగా ఉన్నారు. పత్తికొండ, నందికొట్కూరులో సోమవారం, ఆలూరులో బుధవారం, ఆదోని, గూడూరులో శుక్రవారం, కోడుమూరు, కల్లూరులో శనివారం, ఎమ్మిగనూరులో ఆదివారం ప్రత్యేక సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో జీవాల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నంద్యాల, ఆదోని, బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల తదితర పట్టణాల్లో 2,500 మటన్ షాపులు ఉన్నాయి.

మటన్ అంటే ఇష్టం
చికెన్ కంటే మటన్ అంటేనే ఇష్టం. కార్తీకమాసం, శ్రావణ మాసం తప్ప మిగిలిన అన్ని ఆదివారాల్లో క్రమం తప్పకుండా మటన్ తెచ్చుకుంటాం. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. తినడానికి రుచికరంగా ఉంటుంది.
– నాగభూషణంరెడ్డి, కోవెలకుంట్ల
40 కిలోలు అమ్ముతున్నాం
బనగానపల్లె మార్కెట్ నుంచి పొట్టేళ్లు తెచ్చుకుంటాం. ప్రతి ఆదివారం 40 కిలోల మటన్ అమ్ముతున్నాం. రెండు నెలల క్రితం వరకు కిలో 660 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ. 600లకు విక్రయిస్తున్నాం.
– మద్దిలేటి, మటన్ వ్యాపారి, కోవెలకుంట్ల
Comments
Please login to add a commentAdd a comment