
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో నవంబర్ 15 నుంచి సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతున్నట్టు బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలియజేశారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల గణన ద్వారా ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ వర్గాలను సైతం గుర్తిస్తామన్నారు. అనంతరం వారి అభ్యున్నతి కోసం వివిధ కులాలకు చెందిన కార్పొరేషన్ల ద్వారా తగిన పథకాలు రూపొందించి అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
ప్రతి పదేళ్లకు ఒక సారి జరిగే జనగణనతో పాటు సమగ్ర కులగణన జరిపించాలని గత బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినా ఇప్పటి వరకు సమాధానం రాలేదన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు అనుగుణంగా ఏపీలో కులగణన చేయించాలని ఇటీవల శాసన సభ సమావేశాల్లో తీర్మానించినట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గ్రామ, వార్డు సచివాలయ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
ఈ కమిటీ నేతృత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల సహకారంతో ప్రత్యేక యాప్ ద్వారా కులగణన ప్రారంభిస్తున్నట్టు వివరించారు. బీసీ నాయకుల సూచనలు, సలహాల కోసం ప్రాంతాల వారీగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వ్యక్తిగతంగా సలహాలు, సూచనల ఇచ్చేవారి కోసం ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ అందుబాటులో పెడతామన్నారు.
1931లో జరిగిన కుల గణనే చివరిది..
దేశంలో బ్రిటిష్ కాలంలో 1872లో కులగణన ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి చెల్లుబోయిన చెప్పారు. ఇది 1941 వరకు ప్రతి పదేళ్లకోసారి జరిగిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1941 కులగణను పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్ల 1931 కులగణనే చివరిదని మంత్రి చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951 నుంచి జనగణన మాత్రమే చేస్తున్నారన్నారు.
ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలను మినహా మిగిలిన అన్ని కులాలను గంపగుత్తగా లెక్కిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా కులగణన డమాండ్ వినిపిస్తోందన్నారు. బీసీ వర్గాల కులగణన వినతులను గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 139 బీసీ కులాలను గుర్తించి వాటికి ప్రత్యేకకార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మంత్రివర్గంలో ఏకంగా 10 మంది బీసీలకు స్థానం కల్పించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment