CBI Chargesheet Against MP Raghu Rama Krishna Raju, Here Is The Reason - Sakshi
Sakshi News home page

రఘురామకృష్ణరాజుపై సీబీఐ చార్జ్‌షీట్‌

Published Sat, Jan 1 2022 4:20 AM | Last Updated on Sat, Jan 1 2022 5:45 PM

CBI chargesheet against Raghu Rama Krishna Raju - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక సంస్థలు, బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని ట్యూటీకొరిన్‌లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినందున 2019 ఏప్రిల్‌ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్‌ భారత్‌ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్‌ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ న్యాయస్థానంలో శుక్రవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు పేరిట ఆర్థిక సంస్థలను రఘురామకృష్ణరాజు ఎలా మోసం చేశారనేది సీబీఐ ఓ ప్రకటనలో సవివరంగా వెల్లడించింది.  

ఇండ్‌ భారత్‌ పవర్‌ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణం రాజు పక్కా పన్నాగంతోనే బ్యాంకులను మోసం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడులోని ట్యూటికోరిన్‌లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి రూ.947.71 కోట్లు రుణం తీసుకున్నారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌సీఎల్‌)లతో కూడిన కన్సార్షియం రుణం మంజూరు చేసింది. కానీ రఘురామకృష్ణరాజు తమిళనాడులో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేదు. రుణ ఒప్పంద నిబంధనలను పాటించలేదు. రుణం ద్వారా తీసుకున్న నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు.

ఆ నిధులను కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించేందుకుగాను బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. అనంతరం ఆ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు హామీగా చూపించి ఆ రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటితో కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్టుగా చూపించారు. ఆ తర్వాత ఆ రెండు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించనే లేదు. దాంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లను ఆ రుణం కింద జమ చేసుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థల కన్సార్షియం పూర్తిగా మోసపోయింది. ఆ విధంగా ఆర్థిక సంస్థల కన్సార్షియంను రఘురామకృష్ణరాజు రూ.947.71 కోట్ల మేర మోసం చేశారని సీబీఐ దర్యాప్తులో నిగ్గు తేలింది. పూర్తి ఆధారాలు సేకరించిన సీబీఐ ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో సంచలన చర్యలకు ఉపక్రమించనుందని సమాచారం. 

సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులు 
► ఇండ్‌ భారత్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ కంపెనీ,కె.రఘురామకృష్ణరాజు, చైర్మన్, ఎండీ, ఇండ్‌
► భారత్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ కంపెనీ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్, ఇండ్‌ భారత్‌ పవర్‌
► మద్రాస్‌ లిమిటెడ్‌ కంపెనీ
► ఇండ్‌ భారత్‌ పవర్‌ ఇన్ఫ్రా లిమిటెడ్‌
► ఆర్కే ఎనర్జీ లిమిటెడ్‌
► శ్రీబా సీబేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
► ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌
► ఇండ్‌ భారత్‌ ఎనర్జీ ఉత్కళ్‌ లిమిటెడ్‌
► ఇండ్‌ భారత్‌ పవర్‌ కమాడిటీస్‌ లిమిటెడ్‌
► ఇండ్‌ భారత్‌ ఎనర్జీస్‌ మహారాష్ట్ర లిమిటెడ్‌
► ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌
► సోకేయి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
► వై.నాగార్జున రావు, ఎండీ, సోకేయి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
► ఎం.శ్రీనివాసుల రెడ్డి, చార్టెడ్‌ అకౌంటెంట్‌
► ప్రవీణ్‌ కుమార్‌ జబద్, చార్టెడ్‌ అకౌంటెంట్‌
► సి.వేణు, ఇండ్‌ భారత్‌ గ్రూప్స్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement