సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు దోషులను గుర్తించడం మీద కంటే మీడియాలో తప్పుడు ప్రచారానికే సీబీఐ ప్రాధాన్యమిస్తోంది. తాము చెప్పినట్టుగా స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ పోలీసు అధికారినే బెదిరించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ‘నిన్ను ఉరి తీయాలి.. నీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా’ అంటూ గతంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్యను సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ బెదిరించడం చర్చనీయాంశమైంది. తాను చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు సీఐ నిరాకరించడంతోనే రామ్‌సింగ్ ఆ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది.
సీఐ శంకరయ్య చెప్పకున్నా సరే.. ఆయన చెప్పినట్టుగా తమకు నచ్చిన విషయాలను స్టేట్‌మెంట్‌గా రాసేసుకున్నారు. అదే విషయాన్ని న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. ఇదంతా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగింది. రామ్‌సింగ్ వేధింపులతో విసిగిపోయిన సీఐ శంకరయ్య ఆయనపై కడప జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తాము సీఐని బెదిరించిన విషయాన్ని, ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని దాచివేసి.. సీఐ పేరిట తాము రాసుకున్న స్టేట్‌మెంట్‌ను సీబీఐ మంగళవారం మీడియాకు లీకు ఇచ్చి హడావుడి చేసింది. ఎప్పుడో జరిగిన విషయాన్ని.. ఇప్పుడే జరిగినట్టుగా టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేసింది.
తప్పుడు స్టేట్‌మెంట్‌కోసం సీఐపై ఒత్తిడి..
ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్న రామ్‌సింగ్ తీరు.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుగాంచిన సీబీఐకి మచ్చతీసుకువస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ సింగ్‌పై 2021, అక్టోబర్ 7న కడప ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నఅంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఫిర్యాదులో ఏముందంటే.. సీబీఐ అధికారులు సీఐ శంకరయ్య నుంచి 2020, జూన్ 27, 28 తేదీల్లోనే పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా 2021, ఆగస్టు 10న సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ సీఐ శంకరయ్యను పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు పిలిపించారు. అక్కడ శంకరయ్యను చూస్తూనే ‘నిన్ను ఉరి తీయాలి’ అని తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. తానేం చేశానని శంకరయ్య అనగా.. తాము చెప్పినట్టుగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు.
ఆ వాంగ్మూలం ఎలాగంటే.. వివేకా హత్య జరిగిన రోజున సీఐ శంకరయ్య వెళ్లేసరికి ఆయన మృతదేహం బాత్రూమ్‌లో ఉందని, ఆయన సమక్షంలోనే రక్తపు మరకలు తుడిచివేశారని, మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బెడ్‌రూమ్‌లోకి తీసుకువచ్చారని చెప్పమని రామ్‌సింగ్ సీఐ శంకరయ్యకు చెప్పారు. అందుకు సీఐ శంకరయ్య సమ్మతించక జరిగింది వివరించారు. తాను వెళ్లేసరికే వివేకానందరెడ్డి మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బెడ్‌రూమ్‌లోకి తీసుకువచ్చేశారని, అక్కడ రక్తపు మరకలు తుడిచివేశారని శంకరయ్య చెప్పారు. కానీ రామ్‌సింగ్ అవేవీ వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా సేŠట్‌ట్‌మెంట్ ఇవ్వాలని గట్టిగా అరుస్తూ బెదిరించారు. అంతేకాదు.. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ను ఉద్దేశించి ‘లాఠీ తీసుకురా.. వీడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా’ అన్నారు. సీఐ శంకరయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ రాసి ఆ విధంగా చెప్పాలని ఒత్తిడి చేశారు.
శంకర్‌రెడ్డి బెదిరించారని చెప్పు...
ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తనను పక్కకు తీసుకువెళ్లి బెదిరించినట్టుగా కూడా చెప్పాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ తనపై ఒత్తిడి చేశారని సీఐ శంకరయ్య ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నేను పోలీస్ అధికారిని. ఆ సమయంలో నా వద్ద 9ఎంఎం పిస్టల్ కూడా ఉంది.. నన్ను ఎవరూ బెదిరించ లేదు. బెదిరించలేరు కూడా’ అని సీఐ స్పష్టం చేశారు. దాంతో సీఐ స్టేట్‌మెంట్‌ను అంతకుముందే 2020, జూన్ 27న సీబీఐ తీసుకుందని చెబుతూ ఇక అవసరం లేదని సీఐ శంకరయ్యను రామ్‌సింగ్ పంపించివేశారు.
మీడియాకు లీకులతో రాజకీయ డ్రామా
వాస్తవాలు కాకుండా తాము రాసుకున్న స్క్రిప్ట్‌ను చెప్పించాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ సీఐ శంకరయ్యను తీవ్రంగా బెదిరించారు. కానీ అందుకు ఆయన సమ్మతించకపోయేసరికి మిన్నకుండిపోయారు. ఈ విధంగా పలువురిని రామ్‌సింగ్ బెదిరిస్తున్న విషయం వివాదాస్పదమైంది. ఆయన బెదిరింపులకు భయపడిన ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే ఉద్యోగి పోలీసులకు, న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. దాంతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సీబీఐ కొత్త ఎత్తుగడ వేసింది. గతంలో సీఐ శంకరయ్య పేరుతో తాము రాసుకున్న వాంగ్మూలం అంటూ మీడియాకు మంగళవారం లీకులు ఇచ్చింది. అందులో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేసింది. అయితే సీబీఐ ముందుగా రాసుకున్న అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సీఐ శంకరయ్య సమ్మతించ లేదు. సీబీఐ అధికారి రామ్‌సింగ్ తనను ఉరి తీస్తామన్నా, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామన్నా, తిరిగి కేసు పెడతామన్నా సరే ఆయన బెదరిపోలేదు. పైగా తనను రామ్‌సింగ్ వేధిస్తున్న తీరుపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జరిగింది ఇదైతే.. సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారానికి తెగబడటంపట్ల విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా కేసు దర్యాప్తు చేయాల్సిన సీబీఐ అధికారి రామ్‌సింగ్, రాజకీయ పార్టీల మాదిరిగా మీడియాకు లీకుల పేరుతో తప్పుడు సమాచారమిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇవ్వాలి..
రామ్‌సింగ్ 2021, సెప్టెంబర్ 28న తనకు వాట్సాప్ కాల్‌చేసి కడపలోని గెస్ట్‌హౌస్‌కు పిలిపించి కోర్టులో 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇవ్వాలని చెప్పారని సీఐ శంకరయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలిసిన విషయాలు చెప్పేందుకు సమ్మతమేనని సీఐ ఆయనతో చెప్పారు. కానీ రామ్‌సింగ్ అప్పటికే తయారు చేసిన వాంగ్మూలాన్ని ఇచ్చి చదువుకోవాలని సీఐకు చెప్పారు. అందులో ఉన్నట్టుగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లేకపోతే ఐపీసీ 201 కింద కేసు పెడతానని కూడా సీఐ శంకరయ్యను హెచ్చరించారు. దాంతో ఆయన ముందుగానే రాసినట్టుగా వాంగ్మూలం ఇచ్చేందుకు సీఐ శంకరయ్య సమ్మతించలేదు. అందుకే తాను సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధంగా లేనని తేల్చిచెప్పేశారు.
Comments
Please login to add a commentAdd a comment