సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలను సెల్‌ఫోన్ ఆపరేటర్లు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ప్రముఖుల నంబర్లను ట్యాపింగ్ చేయాలని కోరుతూ ఇంటెలిజన్స్ అధికారుల నుంచి ఏడాది కాలంగా తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటే చెప్పినంతసులభం కాదని, ఎన్నో నిబంధనలు ఉంటాయని కమ్యూనికేషన్ విభాగానికి చెందిన అధికారులు వ్యాఖ్యానించారు.
► ఇంటర్సెప్ట్ కోసం గతంలో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగం సెల్‌ఫోన్ ఆపరేటర్లకు నంబర్లు అందచేసేవి. 2016 తరువాత నిబంధనలు కఠినతరమయ్యాయి.
► కొత్త నిబంధనల ప్రకారం ఇంటర్సెప్ట్ కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి 1885 టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. అత్యవసర సందర్భాల్లో ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కూడా అనుమతి ఇవ్వవచ్చు.
ప్రముఖుల నంబర్లు ఉంటే తిరస్కృతి..
► ఇంటర్సెప్ట్ చేసే నంబర్లను అనుమతి పత్రంలోపొందుపరచాలి. హోంశాఖ కార్యదర్శి లిఖితపూర్వక అనుమతి ఇచ్చిన తరువాత ఆ నెంబర్లను డీవోటీకి సమర్పించాలి. డీవోటీ ఆ వివరాలను సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఆయా సెల్‌ఫోన్ ఆపరేటర్లకు పంపుతుంది. సీఎంఎస్ ద్వారా వచ్చిన అభ్యర్థనను మాత్రమే సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఆమోదిస్తారు. హోంశాఖ కార్యదర్శి అనుమతి లేకుండా వచ్చే ఏ అభ్యర్థననూ సెల్‌ఫోన్ ఆపరేటర్లు స్వీకరించరు.ఒకవేళ ఇందులో ప్రముఖుల నంబర్లు ఉంటే తిరస్కరిస్తారు.
ఏడాదిగా ఎలాంటి అభ్యర్థన రాలేదు..
► గత ఏడాది కాలంగా ఇంటర్సెప్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని అతి పెద్ద సెల్‌ఫోన్ ఆపరేటర్లలో ఒకటైన ’బీఎస్‌ఎన్‌ఎల్’కు చెందిన ఓ అధికారి ధృవీకరించారు. అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులు తమ కంపెనీ సిమ్‌లనే ఉపయోగిస్తారని, వారి నెంబర్లు ఇంటర్సెప్ట్ కోసం వస్తే వెంటనే గుర్తించి తిరస్కరిస్తామన్నారు.
గడువు మేరకే..
► అత్యంత విపత్కర పరిస్థితుల్లో, విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నప్పుడు మాత్రమే నిబంధనలను కొద్దిగా సడలించడం జరుగుతుందని మరో సంస్థకు చెందిన అధికారి తెలిపారు. ఢిల్లీ మర్కజ్ యాత్రికుల వివరాలు దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ’ఇంటర్సెప్ట్‌అభ్యర్థన గడువు కేవలం 60 రోజులు మాత్రమే. ఆ తరువాత మరో అభ్యర్థన తప్పనిసరి. ఇలా 180 రోజుల వరకు మాత్రమే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment