సాక్షి, కృష్ణా జిల్లా : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టంపై సమీక్షించేందుకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాలైన ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంత జిల్లాల్లో పర్యటిస్తోంది. సోమవారం కృష్ణా జిల్లాలోని కొటికల పూడికి చేరుకున్న బృందం వరదల వలన నష్టపోయిన ప్రత్తి, మినుము, బెండ, వంగ పంటలను పరిశీలించింది. కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీ లతలు వరద వలన నష్టపోయిన పంట వివరాలను వారికి వివరించారు. వరదలతో కష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు కేంద్ర బృందాన్ని వేడుకున్నారు.
అనంతరం, కంచికచర్లకు వెళ్లే మార్గంలో నేల కొరిగిన వరిపంటను సైతం కేంద్ర బృందం పరిశీలించింది. వర్షాల కారణంగా కొంత, పంట కాలువ పొంగటం వల్ల మరికొంత వరికి నష్టం జరిగిందని కలెక్టర్ వివరించారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లలో కేంద్ర బృందం ముందుకు సాగింది. కాగా, వరదల కారణంగా కొటికల పూడిలో దాదాపు 351 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ( సీఎస్‌తో కేంద్ర బృందం భేటీ.. వరద నష్టంపై సమీక్ష )
అనంతపురం : జిల్లాలోనూ కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఉరవకొండ, గుంతకల్లు, రాగులపాడు, వజ్రకరూరు, గూళ్యపాల్యం నియోజకవర్గాల్లో వారు పర్యటించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలతో పాటు రైతుల నుంచి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment