
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. శుక్రవారం పోలవరంలో పర్యటించిన అనంతరం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
దేశంలో బీజేపీ ఒకటి నుంచి మొదలు పెట్టి ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని, ఈ విజయ పయనం వెనుక ఎంతోమంది కృషి ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశంలో మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో షెకావత్ సమావేశమయ్యారు. ఏపీకి మోదీ అందిస్తున్న వరం పోలవరం అని అన్నారు.