వైఎస్సార్ జిల్లా పెద్దపుత్తలో దెబ్బతిన్న శనగ పంటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, కడప: వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర బృందం బాధితులకు హామీ ఇచ్చింది. శాఖల వారీగా నష్టం అంచనాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులకు సూచించింది. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఆదివారం వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని స్పష్టం చేసింది.
ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. ప్రధానంగా చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులతో పాటు రైతులు, వ్యాపారులు, కూలీలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతి మేరకు కేంద్ర బృందం శుక్ర, శనివారాల్లో చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పలమనేరు, రాజంపేట, కడప, కమలాపురం నియోజకవర్గాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించింది.
వరదలకు కొట్టుకుపోయిన నివాసాలు, పంటలు, వంతెనలు, రహదారులు, చెరువులు, కాలువలను ప్రత్యక్షంగా తిలకించి.. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల కలెక్టర్లు హరినారాయణన్, వి.విజయరామరాజులు ఆయా ప్రాంతాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరద నష్టాలను వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ జిల్లా మందపల్లెలో ప్రజలతో మాట్లాడుతున్న కేంద్ర బృందం
పరిశీలన ఇలా..
- తిరుపతి నగరంలో దెబ్బతిన్న ఎస్పీడీసీఎల్ రోడ్డును, ఎంఆర్‌పల్లె కూడలి, ముంపునకు గురైన 20వ వార్డు సచివాలయాన్ని కేంద్ర బృందం సభ్యులు కులాల్ సత్వార్థి, అభే కుమార్, మనోహరన్, శ్రీనివాసు భైరి, శివానీ శర్మ, శ్రవణ్ కుమార్ సింగ్, అనిల్ కుమార్ సింగ్ పరిశీలించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
- పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద దెబ్బతిన్న రోడ్డు, గొల్లవాణిగుంట, కృష్ణారెడ్డి నగర్, పూలవాణిగుంట, కొరమేనుగుంట ప్రాంతాల్లో ముంపునకు గురైన గృహాలు, రోడ్లు, లీలామహల్, కరకంబాడి మార్గంలో దెబ్బతిన్న డ్రైనేజీ కాలువను పరిశీలించారు.
- చంద్రగిరి మండలం నడింపల్లె గ్రామ రహదారిలో కుప్పకూలిన బ్రిడ్జిని, పాతచానంబట్ల వద్ద భారీగా కోతకు గురైన రోడ్డును, దెబ్బతిన్న ప్రాథమిక పాఠశాల, విద్యుత్ సబ్‌స్టేషన్, రాయలచెరువు కట్ట వద్ద లీకేజీ, ముంపునకు గురైన సూరావారిపల్లె రోడ్డును పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని వరద నష్టాల గురించి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు.
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆర్.మల్లవరం, ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేట– గుడిమల్లం, జి.పాళెం–గాజులమండ్యం మధ్య స్వర్ణముఖి నదిపై కొట్టుకుపోయిన ఆర్‌అండ్‌బీ వంతెనలను పరిశీలించారు.
- రేణిగుంట మండలం కెఎల్‌ఎం ఆసుపత్రి వద్ద ముంపునకు గురైన కాలనీల్లో బాధితులతో మాట్లాడారు. గాజులమండ్యం నేషనల్ హైవేపై, పాడిపేట, తనపల్లె రోడ్డులోని వంతెనలను, వీరప్పల్లి ప్రాంతాన్ని, పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
- వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పరిధిలో చెయ్యేరు వల్ల ముంపునకు గురైన పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాలలో నేలమట్టమైన, దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలను, తెగిపోయిన అన్నమయ్య డ్యామ్, బుగ్గవంక ప్రాజెక్టు, వల్లూరు మండలం పెద్దపుత్త గ్రామ పరి«ధిలోని పాపాఘ్ని నది పరివాహక ప్రాంతంలో దెబ్బతిన్న పంటలు, వల్లూరు–కమలాపురం మధ్య కూలిన హైలెవెల్ వంతెనను పరిశీలించారు.
- కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా వ్యాప్తంగా వరద నష్టం వివరాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. వైఎస్సార్ జిల్లాలో రూ.1,320 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఎంపీ అవినాష్‌రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. ఈ మేరకు సమగ్ర వివరాలతో వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో రూ.1,200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు, ప్రజాప్రతినిధులు వివరించారు.
చిత్తూరు జిల్లా వీరప్పల్లిలో వరదలకు దెబ్బతిన్న వరిని కేంద్ర బృందానికి చూపిస్తున్న రైతులు
నష్టం అపారం
- రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లింది. నవంబర్ 19వ తేదీన చిత్తూరు జిల్లా పెద్దమండ్యంలో 200 మి.మీ, అనంతపురం జిల్లా నల్లచెరువులో 193 మి.మీ, నెల్లూరులో 140.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
- చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పలు రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయి. వైఎస్సార్ జిల్లాలో పింఛా, అన్నమయ్య రిజర్వాయర్‌లు తెగిపోవడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి.
- నాలుగు జిల్లాల్లో 199 మండలాలు, 1,990 గ్రామాలకు భారీ ఎత్తున నష్టం సంభవించింది. 211 గ్రామాలు, 23 పట్టణాలు ముంపునకు గురయ్యాయి. 2.31 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- నాలుగు జిల్లాల్లో 44 మంది చనిపోయారు. 15 మంది గల్లంతయ్యారు. 98,514 గృహాలు ముంపునకు గురయ్యాయి. 5,740 గృహాలు దెబ్బతిన్నాయి.
- 2.86 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. కడప జిల్లాలో 56,139 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 28 వేల హెక్టార్లు, చిత్తూరు జిల్లాలో 12,744 హెక్టార్లలో కోతకు వచ్చిన వరి పంట నాశనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 4.78 లక్షల మంది రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వరి పంట దెబ్బతినింది.
- పంచాయతీ రాజ్ సెక్టార్‌లో 3,129 రోడ్లు, 20 భవనాలకు నష్టం వాటిల్లింది. ఆర్‌అండ్‌బీ రోడ్లు, ఇరిగేషన్, భారీ, చిన్న నీటి వనరులు, ట్రాన్స్‌కో పోల్స్, సబ్ స్టేషన్‌లు, గృహాలు తదితర శాఖల్లో భారీగా నష్టం వాటిల్లింది.
తిరుపతిలో ఫొటో ప్రదర్శన ద్వారా నష్టాన్ని తెలుసుకుంటున్న కేంద్ర బృందం
కనీవినీ ఎరుగని నష్టం
వరద ఉప్పెనలో కొట్టుకుపోయాం. ఇళ్లు, పొలాలు పోయాయి. పంటలు నాశనమయ్యాయి. ప్రాజెక్టులు, రోడ్లు, బ్రిడ్జిలు తెగిపోయాయి. మనుషులతో పాటు పశువులు ప్రాణాలు కోల్పోయాయి. సర్వం కోల్పోయాం. కట్టుబట్టలతో మిగిలాం. కనీవినీ ఎరుగనంత నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా మేరకే వేల కోట్ల నష్టం వాటిల్లింది. కేంద్రం ఉదారంగా ఆదుకోవాలి. – బాధితులు, అధికారులు, ప్రజాప్రతినిధులు
కష్టం కళ్లారా చూశాం
తుపాను వల్ల కలిగిన నష్టాన్ని, ప్రజల కష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో అధికారులు వివరాలన్నీ పొందుపరిచారు. నష్టం ఏ మేరకు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. శాఖల వారీగా నష్టం అంచనాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళతాం. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. వరద సమయంలో ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలు అభినందనీయం.
అధికారుల స్పందన, ఫైర్, పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలు ప్రశంసనీయం. – కేంద్ర బృందం
వేగంగా సహాయ కార్యక్రమాలు
- రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణం స్పందించి హైదరాబాద్ నుంచి 2 హెలికాప్టర్లను రప్పించారు. భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు.
- నాలుగు జిల్లాల్లో 25 బృందాలు, 260 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్, 300 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్, 54 ఫైర్ సెర్వీస్, 22 బోట్లు, రెండు హెలికాప్టర్ల ద్వారా ప్రజలకు సత్వరం సహాయ సహకారాలు అందించాం. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసింది.
- 319 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, ముంపుకు గురైన 79,590 మందికి ఆహారంతో కూడిన వసతి కల్పించాం. 747 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం.
తీవ్రంగా నష్టపోయాం
వరదతో చెయ్యేరు నది పొంగి పొర్లడంతో నాలుగు ఎకరాల్లో సాగు చేసిన వరి పూర్తిగా మునిగిపోయింది. వరద నీటి ఉధృతికి పొలంలో మీటరు ఎత్తున ఇసుక పేరుకుపోయింది. పొలం తయారు చేసుకునే పరిస్థితి లేదు. నా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నాకు న్యాయం చేసి ఆదుకోవాలి. – రామ్మూర్తి, రైతు, మందపల్లె, వైఎస్సార్ జిల్లా
రైతులను ఆదుకోవాలి
శనగ, మినుము విత్తాము. వరదతో మొత్తం పంట పనికి రాకుండా పోయింది. ఎకరా వరి పంట పూర్తిగా నాశనమైంది. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాము. డిసెంబరు నెల వచ్చింది. మళ్లీ పైరు పెట్టుకునే పరిస్థితి లేదు. రైతులను ఆదుకోవాలి. – లోకేశ్వరరెడ్డి, రైతు, పెద్దపుత్త, వైఎస్సార్ జిల్లా
దిక్కుతోచడం లేదు
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. అందులో అప్పు చేసి అరటి తోట సాగు చేశా. ఆశలన్నీ పంట పైనే పెట్టుకున్నాం. అయితే భారీ వర్షాలకు పంట మొత్తం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచడంలేదు. మీరు ఆదుకోకపోతే కుటుంబం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – చలపతి, రైతు, చిత్తూరు జిల్లా
మోకాటి లోతు నీళ్లల్లో గడిపాం
అయ్యా.. వారం రోజులుగా మోకాటి లోతు నీళ్లల్లో గడిపాం. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వరద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయాయి. వర్షమంటేనే చాలా భయంగా ఉంది. మీరు ఆదుకోకపోతే మేమంతా రోడ్డున పడాల్సి వస్తుంది. – శ్రీరామ్ నగర్‌కాలనీ మహిళలు, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment