2025లో జన గణనకు కేంద్రం కసరత్తు
కుల గణనకు కేంద్రం అంగీకరించకపోవడంతో రాష్ట్రాలపై ఒత్తిడి
ఇప్పటికే బిహార్‌లో పూర్తి.. తెలంగాణలో పచ్చజెండా
ఏపీలోనూ కుల గణన ప్రక్రియ ప్రారంభించిన వైఎస్ జగన్ ప్రభుత్వం
ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన కుల గణన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కుల గణన చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జన గణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానితోపాటే కుల గణన కూడా చేపట్టాలని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. జనాభా లెక్కల సేకరణ 2011లో దేశవ్యాప్తంగా జరిగింది. మళ్లీ 2021లో జరగాల్సిన ఉండగా, కోవిడ్, ఇతర కారణాల వల్ల జాప్యమైంది. తాజాగా 2025లో జన గణన చేపట్టి 2026కు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.
దీంతో జనాభా లెక్కల ఫార్మాట్‌లో ఈసారి బీసీ కులం కాలమ్ కూడా చేర్చి కుల గణన కూడా చేపట్టాలనే డిమాండ్ కేంద్రం ముందుకు వచ్చింది. ఈ డిమాండ్‌ను అంగీకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గతంలో మాదిరిగానే జనాభా లెక్కల సేకరణ మాత్రమే నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఫలితంగా రాష్ట్రాల్లో కుల గణనకు డిమాండ్ పెరిగింది. ఈ మేరకు మన రాష్ట్రంలో ఉద్యమానికి బీసీ నేతలు సిద్ధమవుతున్నారు.
కుల గణనకు చర్యలు చేపట్టిన జగన్
జనాభా లెక్కల్లోనే కుల గణన ద్వారా ఏయే కులాల జనాభా ఎంత అనేది తేలుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో ఆయా వర్గాల స్థానం ఏమిటీ అనేది తెలుసుకోవచ్చు. తద్వారా దామాషా పద్ధతిలో వారికి తగిన అవకాశాలు కలి్పంచేందుకు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... ముఖ్యమంత్రిగా ఉండగానే బీసీ నేతలు కోరకముందే రాష్ట్రంలో కుల గణన చేపడతామని ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు కూడా చేపట్టారు. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆగిపోయింది.
నైపుణ్య గణన పేరుతో కుల గణనకు బాబు బ్రేక్!
దేశం లోనే బిహార్ రాష్ట్రం మొదట కుల గణన చేపట్టి పూర్తిచేసింది. ఆ తర్వాత ఏపీలోను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కుల గణన ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కుల గణనను పక్కన పెట్టి నైపుణ్య గణన అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచి్చంది. పొరుగున ఉన్న తెలంగాణలోను కుల గణన చేపడతామని తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోను కుల గణనను పూర్తి చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు దశలవారీ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. పలువురు బీసీ నేతలు సైతం సీఎం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని వినతిపత్రాలు అందించారు. అయినప్పటికీ కుల గణన విషయంలో చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రావడంలేదని, బీసీ నేతలు రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment