పేదలను బెదిరించారు..‘అసైన్డ్‌’ కాజేశారు | Chandrababu Govt assigned lands grabbing with Perfect Plan | Sakshi
Sakshi News home page

పేదలను బెదిరించారు..‘అసైన్డ్‌’ కాజేశారు

Published Fri, Sep 29 2023 2:13 AM | Last Updated on Fri, Sep 29 2023 2:13 AM

Chandrababu Govt assigned lands grabbing with Perfect Plan - Sakshi

(వడ్డాది శ్రీనివాస్‌/సాక్షి, అమరావతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బరితెగించి పాల్పడిన భారీ భూదోపిడీ బండారం బట్టబయలైంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను కొల్లగొట్టేందుకు పక్కాగా అమలుచేసిన కుతంత్రం ఆధారాలతో సహా నిగ్గుతేలింది. ఏకంగా రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల అసైన్డ్‌ భూదోపిడీ విస్మయపరుస్తోంది.

ఈ భూములకు పరిహారం ఇవ్వబోమని అప్పట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూము­లను చంద్రబాబు, నారాయణ, తదితర టీడీపీపెద్దలు 814 మంది బినామీల ముసుగులో హస్తగతం చేసుకుని దేశ చరిత్రలోనే అత్యంత భారీ అసైన్డ్‌ భూకుంభకోణానికి తెగబడ్డారు. అనంతరం..  అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ప్రకటించి వారి కుతంత్రాన్ని చాటుకున్నారు.

ఈ భూములను అన్యాక్రాంతం చేయడానికిగానీ దాన్ని అధికారికంగా గుర్తించడానికిగానీ వీల్లేదన్న ఉన్నతాధికారుల లిఖితపూర్వక అభ్యంతరాలను వారు బేఖాతరు చేశారు. పైగా.. రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్‌ భూముల రికార్డులను గల్లంతు చేసేసి.. అసలు 1954 నుంచి 2014 వరకు అమరావతి పరిధిలో పేదలకు భూ పంపిణీనే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్ని మోసంచేసిన తీరు వ్యవస్థలను మోసం చేయడంలో చంద్రబాబు తెగింపునకు అద్దంపడుతోంది.

కానీ, ఇప్పుడు వీరి పాపం పండింది.. కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌ల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సాగిన ఈ అసైన్డ్‌ భూదోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల పంపిణీ రికార్డులు కూడా వెలుగులోకి రావడంతో పచ్చముఠా పన్నాగం బెడిసికొట్టినట్లయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు ‘సాక్షి’ సేకరించింది. పచ్చ గద్దల అసైన్డ్‌ భూదోపిడీపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి భాగం ఇది..

జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో దోపిడీ
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్‌ వేశారు. అసైన్డ్‌ భూములను కొల్లగొట్టేందుకు దేశ చరిత్రలో ఏ పాలకుడు కూడా పాల్పడని దారుణానికి తెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి మరీ వారి అసైన్డ్‌ భూములను చేజిక్కించుకున్నారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ నంబరు 1ను జారీచేశారు.

ఆ జీఓలో అమరావతిలోని ప్రైవేటు భూములకు మాత్రమే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్‌ భూములకు ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్‌ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతోకొంతైనా డబ్బులు వస్తాయని మభ్యపెట్టారు.

అందుకోసం ఆర్కే హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి దుష్ప్రచారం చేయించారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు సేల్‌డీడ్ల ద్వారా తమ అసైన్డ్‌ భూములను విక్రయించారు. అలా.. ఆ ముఠా ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలుచేసి అసైన్డ్‌ భూములన్నింటినీ తమ బినామీల పరం చేశారు.

ఆ తరువాత చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్‌ భూములకు కూడా ఆరు కేటగిరీల కింద విభజించి 2016, ఫిబ్రవరి 17న జీఓ నంబరు 41 ద్వారా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. అప్పటికే అసైన్డ్‌ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. ఎంతగా అంటే.. ఎకరాలోపు ఉన్న భూమికి కూడా ఎకరా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు.

ఎందుకంటే అసైన్డ్‌ భూములను చిన్నచిన్న బిట్లుగానే తమ బినామీల పేరిట పచ్చ ముఠా చేజిక్కిచ్చుకుంది. తద్వారా ఎక్కువ ప్యాకేజీ వచ్చేలా కథ నడిపింది. ఆ మేరకు చంద్రబాబు, నారాయణ, టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్‌ భూముల సమీకరణ ప్యాకేజీని సీఆర్‌డీఏ వర్తింపజేసింది. అలా చంద్రబాబు చట్ట ప్రకారం ఆ ప్యాకేజీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను దారుణంగా మోసగించారు.

ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతరు..
నిజానికి.. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. అలా చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసిన వారికి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడానికే వీల్లేదు. చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశముంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం.

అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులు అసైన్డ్‌ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్‌తోపాటు సీఆర్‌డీఏ, సీసీఎల్‌ఏ అధికారులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తంచేశారు.

కానీ, అప్పటి మున్సిపల్‌–సీఆర్‌డీఏ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ ఉన్నతాధికారలుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అది మీకు సంబంధంలేని వ్యవహారం. మేం చెప్పినట్లు చేయండి. పైస్థాయిలో నేను మాట్లాడతాను’.. అని వారికి హుకుం జారీచేశారు. అప్పటి అడ్వకేట్‌ జనరల్‌ కూడా అసైన్డ్‌ భూముల అన్యాక్రాంతాన్ని గుర్తించడానికి చట్టం అనుమతించదని స్పష్టంచేశారు. ఈ మేరకు అప్పటి కలెక్టర్, సీఆర్‌డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్‌ జనరల్‌ తమ అభ్యంతరాలను జీఓ–41 నోట్‌ ఫైళ్లలో లిఖితపూర్వకంగా తెలిపారు. కానీ, వారి అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేశారు. 

కోర్టును సైతం మోసం చేసి మరీ..
అసైన్డ్‌ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. చట్ట ప్రకారం 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కానీ, తమ కుట్రను అమలుచేసేందుకు ఏకంగా అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్‌ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించారు.

ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అంటే.. అమరావతి పరిధిలో ఉన్న అసైన్డ్‌ భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే తప్ప.. ఆ తరువాత 2015లోగా అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే పక్కదారి పట్టించారు. కానీ, 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్‌ భూములు పంపిణీ చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా 2004–05లో అసైన్డ్‌ భూములు పంపిణీ చేశారు. కానీ, ఆ రికార్డులన్నీ మాయం చేసేశారు. అమరావతిలో ఉన్న భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే అని చెబుతూ, వాటిని విక్రయించేందుకు.. కొనుగోలు చేసేందుకు చట్టం అనుమతిస్తుందని వక్ర భాష్యం చెబుతూ న్యాయస్థానాన్ని మోసగించిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. 

పత్రాలు వెలుగులోకి.. పచ్చ కుట్ర బట్టబయలు
ఇలా.. ఎంత మసిపూసి మారెడుకాయ చేయాలని చూసినా చంద్రబాబు భూదోపిడీ కుట్ర బట్టబయలైంది. అమరావతిలోని అసైన్డ్‌ భూములలో 1954కు తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లలో పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు కూడా ఉన్నాయని తేలింది. దీనిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం వెలుగుచూసింది. అమరావతి పరిధిలో 1954 తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు అసైన్డ్‌ భూములు పంపిణీ చేశారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

2014–19 మధ్య జరిగిన అసైన్డ్‌ భూముల అన్యాక్రాంతం కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా లిఖితపూర్వకంగా నివేదించారు. సిట్‌ బృందాలు అమరావతి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సర్వే నిర్వహించడంతోపాటు సబ్‌ రిజిస్ట్రార్, తహశీల్దార్, కలెక్టర్‌ కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాయి. దాంతో గణాంకాలతో సహా పూర్తి ఆధారాలతో అసైన్డ్‌ భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

అసైన్డ్‌ భూముల రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లు, సీఆర్‌డీఏ ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీలోని అసైన్డ్‌ రైతుల పేర్లను సరిపోల్చి చూడగా అసలు బండారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లోని అసైన్డ్‌ భూముల రైతులకు, సీఆర్‌డీఏ ప్రకటించిన ప్యాకేజీలోని అసైన్డ్‌ భూముల రైతుల పేర్లకు ఏమాత్రం పొంతన లేనేలేదు. దాంతో చట్ట విరుద్ధంగా చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన అసైన్డ్‌ భూముల చిట్టా బయటపడింది. ఏకంగా 617.70 ఎకరాల అసైన్డ్‌ భూములను టీడీపీ ముఠా కొల్లగొట్టిందన్నది తేలిపోయింది.

కేటగిరీలూ అనుకూలంగానే..
ఇక జీఓ–41 ప్రకారం ఆరు కేటగిరీల కింద నాటి ప్రభుత్వం ప్యాకేజిని ప్రకటించింది. వాటిలో నాలుగు కేటగిరీల కింద చంద్రబాబు, నారాయణ తమ బినామీల పేరిట అసైన్డ్‌ భూములను చేజిక్కించుకున్నారు. ఆ నాలుగు కేటగిరీలకు జరీబు భూములకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీ ఇలా ఉంది..

రూ.3,737.30 కోట్ల అసైన్డ్‌ భూదోపిడీ 
మరోవైపు.. నాలుగు కేటగిరీ కింద దోపిడీ చేసిన 617.70 ఎకరాల అసైన్డ్‌ భూములకు చంద్రబాబు, నారాయణ గ్యాంగ్‌ ప్యాకేజీ ద్వారా ఏకంగా రూ.3,737.30 కోట్లు దక్కించుకుంది. ఎందుకంటే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన తరువాత అమరావతిలో నివాస స్థలం చ.గజం మార్కెట్‌ ధర కనీసం రూ.30వేలు, వాణిజ్య స్థలం మార్కెట్‌ ధర చ.గజం కనీసం రూ.50వేలు చొప్పున విక్రయాలు సాగాయి.

ఇక అమరావతి నిర్మించిన తరువాత వాటి విలువ మరింత భారీగా పెరుగుతుంది కూడా. ఇక భూసమీకరణ ప్యాకేజీలో కనీస విలువగా ఎకరా ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. ఎకరా లోపు భూమిని తీసుకున్నా సరే ఎకరాకు ప్యాకేజీ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు, నారాయణ తమ బినామీలు ఎక్కువ మంది ద్వారా చిన్న చిన్న కమతాలను చేజిక్కించుకున్నారు. తద్వారా ప్రతీ బినామీకి కనీసం ఎకరా ప్యాకేజీ వచ్చేలా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement