సాక్షి, అమరావతి: ‘మద్యం’ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా వారి పార్టీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ఖజానాకు రూ.1,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనిపై సీఐడీకి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర, శ్రీనరేష్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు, రవీంద్రల వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకాణాలు, బార్లకు శాసన సభ ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజు తొలగించినట్లు చెప్పారు. ఇందుకు గవర్నర్ సైతం ఆమోదముద్ర వేశారన్నారు. ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తూ ఎక్సైజ్ చట్టానికి చేసిన సవరణకు అప్పటి మంత్రి మండలి ఆమోదం కూడా ఉందన్నారు.
రాజ్యాంగంలోని అధికరణ 163 (3) ప్రకారం గవర్నర్‌కు మంత్రులు చేసిన సూచనలపై న్యాయ సమీక్ష కుదరదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. కొల్లు రవీంద్ర తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం శ్రీనగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జస్టిస్ మల్లికార్జునరావు ఈ నెల 28కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment