సాక్షి, విశాఖపట్నం : వరుస ఎన్నికల్లో రాజకీయంగా చావుదెబ్బ తింటున్న టీడీపీ అధినేత, ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు రాజకీయ అస్థిత్వం కోసం పోరాడుతున్నారు. సమయం, సందర్భం, సమస్య లేకుండానే రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లె ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలను కూడా రాష్ట్రంపై నెడుతూ.. రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఆయన తీరుతో అసంహించుకుంటున్న ప్రజలు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతున్నప్పటకీ వ్యవహార శైలిని మాత్రం ఏమాత్రం మార్చుకోవడంలేదు. నా రూటే సెపరేటూ అంటూ నానాటికీ దిగజారిపోతున్నారు. తాజాగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై ఆయన వ్యవహరిస్తున్న తీరుతో సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని రాజకీయం చేస్తున్నారు.
విశాఖలో అమరావతి ప్రసంగం..
మంగళవారం విశాఖ స్టీల్ ప్లాంట్ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని పన్నెత్తి మాట కూడా అనకుండా.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేయొద్దంటూ కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పేరు కూడా ప్రస్తావించలేదు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలంటూ వింత వాదన చేశారు. అంతేకాకుండా ప్లాంట్‌పై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా విమర్శలకు దిగడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఎక్కడున్నామనే సోయిమరిచిన చంద్రబాబు.. విశాఖ దీక్ష శిబిరంలో అమరావతి భూముల గురించి ప్రస్తావించి విమర్శల పాలయ్యారు. కార్మిక సంఘాల నేతలను తమ్ముళ్లు అంటూ సంభోదించారు. చంద్రబాబు తీరుతో అక్కడి కార్మిక నేతల విసుగుచెందారు.
కాగా విశాఖ ఉక్కు కర్మాగాన్ని ప్రైవేటుపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన దీక్షలు చేపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖరాశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 20న పాదయాత్ర చేపట్టనున్నారు. జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకు 22 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment