దళితులపై రాళ్లతో దాడిచేస్తున్న టీడీపీ కార్యకర్తలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు చేసిన కుట్రలు, అకృత్యాలు బట్టబయలయ్యాయి. శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న దళితులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడిచేసి అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టడంతో నియోజకవర్గంలోని సీనియర్ నాయకుడు, చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన డాక్టర్ మన్నే రవీంద్ర, అతని అనుచరులే రోడ్డుపక్కన నక్కి, దాక్కొని దళితులపై రాళ్లతో దాడిచేశారు.
అదికూడా యర్రగొండపాలెంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటిపక్కనే నక్కి మరీ రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఫొటోలు, వీడియోలు శనివారం బయటపడ్డాయి. ఆధారాలతో సహా వెలుగుచూడడంతో టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. వారితో రాళ్ల దాడి చేయించడమే కాక.. ఆ పని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలదేనని స్వయానా చంద్రబాబు ప్రకటించడంతో వారి పరిస్థితి నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఇక పచ్చ మీడియా అయితే రెచ్చిపోయి ఇదంతా అధికార వైఎస్సార్‌సీపీ వాళ్ల పనేనని ప్రముఖంగా ప్రచురించాయి.
దొంగే దొంగ.. దొంగ అన్నట్లు..
కుట్రలు పన్నడం.. వాటిని పక్క పార్టీ వాళ్ల మీదకు నెట్టడం ఇదీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. యర్రగొండపాలెంలో జరిగింది ఇదే. చంద్రబాబు మూడోరోజు పర్యటన సందర్భంగా శుక్రవారం యర్రగొండపాలెం వచ్చారు. ఈ సందర్భంగా.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆ వర్గం వారు పెద్దఎత్తున శాంతియుత నిరసనకు దిగారు. రోడ్డు పక్కన నిలబడి నల్ల బ్యాడ్జీలు, నల్లజెండాలు, ప్లకార్డులు, నల్ల బెలూన్లతో ప్రశాంతంగా నిరసన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని మంత్రి సురేష్ ఒకరోజు ముందే మీడియా సమక్షంలో కూడా వెల్లడించారు.
చెప్పినట్లుగానే మంత్రి సురేష్ నిరసనలో పాల్గొని దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి దళిత రిజర్వు నియోజకవర్గంలోకి ఏ విధంగా వస్తావు అంటూ చంద్రబాబును నిలదీశారు. దీంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే.. తన కారులోంచి బయటకు వచ్చి నిరసనకారుల వైపు వేలు చూపించి మరీ భయపెడుతూ రెచ్చగొట్టారు. అలాగే, టీడీపీ కార్యకర్తలను, నేతలను దళితులపై దాడికి ఉసిగొల్పారు. చంద్రబాబే రెచ్చగొట్టటంతో ఆయన సామాజికవర్గానికి చెందిన మన్నే రవీంద్ర, ఆయన ప్రధాన అనుచరులు కొందరు రెచ్చిపోయి రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు దళితులు, వైఎస్సార్‌సీపీ నేతలు, పోలీసులు గాయపడ్డారు.
పోలీసులకు ఫిర్యాదులు..
మరోవైపు.. వాస్తవాలను మరుగుపరిచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై రాళ్ల దాడి చేశారంటూ ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ నాగేశ్వరరావుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తోపాటు పలువురు శనివారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
మరోపక్క.. టీడీపీ పెద్దలు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే, టీడీపీ నేతలు దాడికి పాల్పడిన వీడియోలు బయటకొచ్చాయి. దీనికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. టీడీపీ వారే దాడికి పాల్పడ్డారన్న కుట్ర కోణం బయటపడటంతో ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. మరోవైపు.. టీడీపీ నేతల దాడులపై వైఎస్సార్‌సీపీ నేతలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు కేసులు నమోదు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించడంతో మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ కె. కిషోర్‌కుమార్ శనివారం మీడియాకు తెలిపారు. యర్రగొండపాలెంలో శుక్రవారం రోడ్‌షో సందర్భంగా బహిరంగ సభకు అనుమతిచ్చిన ప్రాంతంలో కాకుండా ఎక్కువ జనసంచారం ఉన్న ప్రాంతంలో సభను పెట్టారని, దీనిపై ఆ పార్టీ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
రోడ్‌షో సందర్భంగా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయం వద్ద రాళ్లు రువ్విన సంఘటనలో కొంతమంది గాయాలయ్యాయని, ఆ రాళ్లు రువ్విన వారిని గుర్తించినట్లు చెప్పారు. వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడని ఆయన తెలిపారు. ఈ దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాబీర్ బాష, టీడీపీకి చెందిన ఎం.హరిబాబు తమకు గాయాలైనట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఈ రెండు కేసులను నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment